MGNREGA పేరు మార్పుపై దేశవ్యాప్త ఉద్యమ్యానికి ఖర్గే పిలుపు..
x

MGNREGA పేరు మార్పుపై దేశవ్యాప్త ఉద్యమ్యానికి ఖర్గే పిలుపు..

CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ నిర్ణయం


కేంద్రంలోని మోదీ(Modi) ప్రభుత్వం ఇటీవల యూపీఏ(UPA) కాలం నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం -2005 (MGNREGA) స్థానంలో విక్షిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) చట్టం (VB-G RAM G)ను ప్రవేశపెట్టింది. ఈ మార్పుపై "దేశవ్యాప్త ఉద్యమం" చేపట్టాలని కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) పార్టీ నేతలకు శనివారం (డిసెంబర్ 27) పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలను, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మోదీ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2015 జనవరిలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం భూసేకరణ చట్టాన్ని మార్చినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు వీధుల్లోకి రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

అప్రమత్తంగా ఉండండి..

పేద, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల పేర్లు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని, అలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజంట్లు ఈ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం గుప్పిట్లో ఈడీ, ఐటీ..

నేషనల్ హెరాల్డ్ కేసును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలయిన ఈడీ, ఐటీ, సీబీఐలను స్వప్రయోజనాలకు వాడుకుని గిట్టనివారిపైకి ఉసిగొలుపుతున్నారని విమర్శించారు.

Read More
Next Story