బీజేపీకి గుడ్ బై చెప్పిన మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.. కారణమేంటి?
x
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇంధనం మరియు జైళ్ల శాఖ మంత్రి చౌతాలా (ఫైల్)

బీజేపీకి గుడ్ బై చెప్పిన మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.. కారణమేంటి?

అభ్యర్థుల తొలి జాబితా వెలువడిన కొద్దిసేపటికే హర్యానాలో బీజేపీకి తిరుగుబాటు కష్టాలు మొదలయ్యాయి. టికెట్ దక్కకపోవడంతో ఓ మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్టీని వీడారు.


అభ్యర్థుల తొలి జాబితా వెలువడిన కొద్దిసేపటికే బీజేపీకి తిరుగుబాటు కష్టాలు మొదలయ్యాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావడంతో రాష్ట్రంలోని అధికార బిజెపి 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో మరుసటి రోజే మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈయన సిర్సా జిల్లాలోని రానియా సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించారు. కాని శిష్పాల్ కాంబోజ్‌ను బీజేపీ బరిలోకి దింపింది.

తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడైన ఇంధనం, జైళ్ల శాఖ మంత్రి రంజిత్ చౌతాలా. లోక్‌సభ ఎన్నికలకు ముందు రంజిత్ రానియా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హిస్సార్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

పార్టీకి వీడిన ఎమ్మెల్యే లక్ష్మణ్ దాస్ నాపా..

టిక్కెట్ కేటాయించలేదని ఫతేహాబాద్ జిల్లా రాతియా రిజర్వ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ దాస్ నాపా కూడా పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర పార్టీ చీఫ్ మోహన్ లాల్ బడోలీకి లేఖ రాశారు. అనంతరం ఆయన మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాను దేశ రాజధానిలోని అతని నివాసంలో కలిశారు. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గానికి అంకితభావంతో సేవలందించినా మళ్లీ పోటీ చేసేందుకు ఎందుకు నిరాకరించిందో తెలియడం లేదని చెప్పారు.

అదే వరసలో మాజీ మంత్రి కరణ్ దేవ్..

మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ కూడా OBC మోర్చా చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ‘టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఏళ్ల తరబడి అంకితభావంతో పార్టీకి సేవ చేసినా గుర్తింపులేదు.బహుశా బిజెపికి ఇకపై విధేయులు అవసరం లేదేమో’నని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సేవ చేసిన వారిని విస్మరించి ఒక రోజు ముందు చేరిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో మంత్రి సంజయ్ సింగ్, మాజీ మంత్రి సందీప్ సింగ్ సహా కొంతమంది సిట్టింగ్ శాసనసభ్యులకు కూడా స్థానం దక్కలేదు.

రాటియా నుంచి సిర్సా మాజీ ఎంపీ సునీతా దుగ్గల్‌ను పార్టీ బరిలోకి దింపింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో సిర్సా పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదు. అయితే ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన మాజీ హర్యానా కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వర్‌కు ఆ టిక్కెట్ కేటాయించారు.కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి సెల్జా చేతిలో తన్వర్ ఓడిపోయారు.

సోనిపట్ నుంచి నిఖిల్ మదన్‌ను పోటీ చేయిస్తున్నారు. దీంతో ఆ స్థానాన్ని ఆశించిన హర్యానా మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నాయకురాలు కవితా జైన్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. తాను ఎల్లప్పుడూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసినా తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

బుధవారం విడుదల చేసిన తొలి జాబితాలో కర్నాల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని లాడ్వా స్థానం నుంచి పోటీకి దింపింది బిజెపి. కొందరికి టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో చేరిన వారికి ఇవ్వడం వెనక బిజెపి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ రెబల్స్‌ను తన వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది.

Read More
Next Story