కనీస మద్దతు ధర పెంపు ..ఏ పంటకు ఎంత పెంచారు?
కేంద్ర ప్రభుత్వం 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. 2024-25 ఏడాదికి వరికి కనీస మద్దతు ధర రూ. 117 పెంచడంతో క్వింటాం సాధారణ రకం రూ. 2300, ఏ గ్రేడ్ రూ.2320 పలుకనుంది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రంపై అదనపు భారం ..
వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) సిఫార్సుల ఆధారంగా 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఎంఎస్‌పీ పెంపు వల్ల కేంద్రంపై రూ. 2 లక్షల కోట్ల ఆర్థిక భారం పడనుందని అంచనా. ఇది గత సీజన్ కంటే దాదాపు రూ. 35 వేల కోట్లు ఎక్కువ. అయితే అన్నదాతల ఆదాయాన్ని గణనీయంగా పెంచిందని మంత్రి చెప్పారు.
పెంచిన ధర ప్రకారం..వచ్చే ఖరీఫ్ సీజన్‌లో 'కామన్' గ్రేడ్ వరికి క్వింటాంకు రూ.2,300కి, 'ఏ' గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.2,320 చెల్లించనున్నట్లు వైష్ణవ్ విలేకరులకు తెలిపారు.
చిరుధాన్యాలకు..
చిరుధాన్యాలకు కూడా కనీస మద్ధతు ధరను పెంచారు. 'హైబ్రిడ్' గ్రేడ్ జొన్న రకానికి రూ. 191 పెంచడంతో ఇకపై క్వింటాం రూ. 3,371, 'మల్దానీ' రకం రూ.196 పెంచడంతో రూ.3,421 పలకనుంది.
సజ్జలకు రూ.125 పెంచడంతో క్వింటాం రూ.2,625, రాగులుకు రూ.444 పెంచి రూ.4290లకు మొక్కజొన్నకు రూ.135 పెంచి రూ.2,225 పలుకనున్నాయి.
పప్పుల దిగుమతులను దేశం తగ్గించేందుకు పప్పుధాన్యాలకు రూ.550 పెంచడంతో క్వింటాం రూ.7,550కి, మినుములకు రూ.450 నుంచి రూ.7,400కి, పెసరపప్పు రూ.124 నుంచి రూ.8,682కి అమ్ముకోవచ్చు.
ఇక పొద్దుతిరుగుడుకు రూ.520 పెంచి రూ.7,280, వేరుశనగకు రూ.406 పెంచి రూ.6,783, సోయాబీన్ (పసుపు) రూ.292 పెంచడంతో రూ.4,892 పలకునున్నాయి.
వాణిజ్య పంటల విషయానికొస్తే.. పత్తి( మధ్యరకం)కి రూ.501 పెంచడంతో క్వింటాం రూ.7,121, పొడువు రకం రూ.7,521 పలుకనుంది.
బీజ్ సే బజార్ తక్..
రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీజ్ సే బజార్ తక్ (విత్తనం నుండి మార్కెట్ వరకు) ప్రభుత్వం శ్రద్ధ తీసుకుందని వైష్ణవ్ చెప్పారు.
రికార్డు స్థాయి నిల్వ..
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రికార్డు స్థాయిలో 53.4 మిలియన్ టన్నుల బియ్యాన్నినిల్వ చేసింది. ఇది అవసరమైన దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇప్పుడున్న నిల్వలు సరిపోతాయి.