కేరళలో విజిన్జం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన మోదీ ..
x

కేరళలో విజిన్జం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన మోదీ ..

అదానీ గ్రూప్ సహకారంతో రూ.8,900 కోట్లతో నిర్మాణం.


Click the Play button to hear this message in audio format

కేరళ(Kerala)లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజిన్జం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ (మే2న) శుక్రవారం ప్రారంభించారు. తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్లతో దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) హాజరయ్యారు. ఈ సన్నివేశంపై ప్రధాని స్పందిస్తూ.. ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్‌ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్‌ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్‌ ట్వీట్‌ కూడా చేశారు.

అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యం – 'న్యూ ఇండియా' సంకేతం

విజిన్జం పోర్టు నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామి అదానీ గ్రూప్ పాత్ర గురించి మోదీ వ్యాఖ్యానిస్తూ.. "ఇప్పుడే ఒక కమ్యూనిస్టు మంత్రి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అంగీకరిస్తున్నారు. ఇదే న్యూ ఇండియా." అని పేర్కొన్నారు.

మోదీ తన ప్రసంగంలో కేరళ క్రైస్తవ వారసత్వం గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంలో మొట్టమొదటి చర్చి (సెయింట్ థామస్ చర్చి) కేరళలోనే ఉందన్న విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్‌‌ను గతంతో ఓసారి కలిసినపుడు తనతో చెప్పారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు కేరళలోని క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంగా చాలామంది అర్థం చేసుకున్నారు.

పహల్గాం దాడి, కుల గణాంకాలపై మాట్లాడని మోదీ..

కేరళ సీఎం పహల్గాం దాడి బాధితులకు నివాళి అర్పించినా.. మోదీ ఈ విషాద ఘటనను ప్రసంగంలో ప్రస్తావించలేదు. ఇండియా కూటమి ప్రధాన అజెండాలోని కుల గణాంకాలను కూడా మోదీ ప్రస్తావించకపోవడం గమనార్హం.

Read More
Next Story