
బీహార్‌లో నగదు బదిలీ ప్రోత్సాహకం మహా కూటమికి చావుదెబ్బెనా?
మహిళా సాధికారత పేరుతో ఎన్డీఏ కూటమి ఇస్తు్న్నది లంచమేనని అంటున్నదెవరు?
ఎన్నికలంటే వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించడం. ఎత్తులకు పైఎత్తులు వేయడం.. పక్కా ప్రణాళికతో సమయం చూసి ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టడం. ఇప్పుడు బీహార్‌లో ఇదే జరుగుతోంది. ఎన్డీఏ కూటమి మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు.
ఎన్నికల కమిషన్(EC) బీహార్(Bihar)లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(S.I.R) చేపట్టడంతో మహా కూటమి ముఖ్య భాగస్వాములయిన ఆర్జేడీ, కాంగ్రెస్ సహా కూటమికి మద్దతిచ్చే మిగతా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీతో కుమ్మకయిన ఈసీ.. ఎన్డీఏ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టిదంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘‘ఓటర్ అధికార్ యాత్ర(Voter Adhikar Yatra)’’ పేరిట రాష్ట్రంలో పర్యటించారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా బీహార్‌లో పర్యటించి, ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
ఇరకాటంలో మహా కూటమి..
అయితే గత వారం ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన (MMRY) కింద 75 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేశారు. ఇది ప్రతిపక్ష కూటమిని ఇరకాటంలో పడేసింది. డబ్బుతో మహిళా ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు భారీ ఆర్థిక ప్రోత్సాహకం ప్రకటించడంతో.. ఇప్పుడు మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ఎలాగా? అని మహా కూటమి ఆలోచనలో పడింది.
రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 10వేల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయడం, ఆరు నెలల తర్వాత అదనంగా రూ. 1.9 లక్షలు జమ చేస్తామన్న హామీ బాగా పనిచేసేలా కనిపిస్తుంది.
‘లంచంతో సమానం..’
"మహిళా సాధికారత పేరుతో ఎన్డీఏ కూటమి ఇస్తు్న్నది లంచమే. రాష్ట్రంలోని 94 లక్షల మంది నిరుపేద కుటుంబాల మహిళలకు గతంలో రూ. 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ మొత్తాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల ఓట్లు పొందడానికి రూ. 10వేలు ఇస్తున్నారు" అని ఆర్జేడీ జాతీయ ప్రతినిధి ప్రొఫెసర్ సుబోధ్ మెహతా అన్నారు.
‘ఇక్కడా కూడా దాన్ని అమలు చేస్తున్నారు..’
ఎన్నికల సమయంలో NDA భాగస్వామ్య పార్టీలయిన భారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక), రాష్ట్రీయ లోక్ మోర్చాకు నగదు ప్రోత్సాహకం అందుకున్న మహిళలు మద్దతుగా నిలుస్తారని కొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఇదే పంథాను అవలంభించి అధికారంలోకి వచ్చారని వారంటున్నారు.
ప్రతిపక్షాల 'చిన్న' వాగ్దానం సరిపోదా?
బీహార్ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ సరిపోకపోవచ్చునని మహా కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
మహిళా ఓటర్లపై కన్నేసిన నితీష్, కేంద్రం..
గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ మునుపటి ప్రజాకర్షక పథకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిల్లో విద్యార్థులకు యూనిఫాం, సైకిళ్ల పంపిణీ కూడా ఉన్నాయి.
బీహార్ బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ ప్రచారం మూడు 'ఎం'ల చుట్టూ తిరుగుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. మోదీ, మహిళా, మందిర్. అయోధ్యలోని రామమందిరం లాగే బీహార్‌లోని సీతామర్హిలో ఆలయాన్ని నిర్ణిస్తామని హామీ ఇచ్చారు.
రంగంలోకి ప్రియాంక గాంధీ..
మోదీ సెప్టెంబర్ 26న MMRY కింద మొదటి విడత ఆర్థిక సాయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. మోతిహరిలో జరిగిన ర్యాలీలో మహిళా ఓటర్లనుద్దేశించి ఆమె మాట్లాడారు. "డబ్బు తీసుకోండి కానీ దేశానికి ఓటు వేయండి" అని కోరారు. రాబోయే రోజుల్లో “మహిళా సంవాద్” (మహిళలతో సంభాషణ) పేరిట బీహార్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కూడా ఉంది. మహా కూటమి ప్రతిపాదిత ‘మై బెహన్ మాన్ యోజన’ కింద మహిళలకు రూ. 2,500 హామీ భత్యం ఇస్తామని కాంగ్రెస్, దాని సీనియర్ మిత్రపక్షం RJDతో కలిసి తన ప్రచారంలో దూకుడుగా ప్రకటించే అవకాశం ఉంది.
‘అంతడబ్బు ప్రభుత్వం వద్ద లేదు..’
ఆదివారం (సెప్టెంబర్ 28) తేజస్వి యాదవ్ విలేఖరులతో మాట్లాడుతూ.. మోదీ, నితీష్ MMRY, ఇతర వాగ్దానాలతో "బీహార్ మహిళలను మోసం చేయడానికి" ప్రయత్నిస్తున్నారని, "వారు (NDA) చేస్తున్న అన్ని వాగ్దానాలను నెరవేర్చడానికి రూ. 7 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు అవసరమని చెప్పారు. (రాష్ట్ర) ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పటికే రూ. 1 లక్ష కోట్ల బడ్జెట్ అవసరాలను తీర్చడంలో కూడా ఇబ్బంది పడుతోంది. ఈ అదనపు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది" అని అన్నారు.
'జీవిక దీదీలు'గా నమోదు చేసుకున్న 75 లక్షల మంది మహిళలకు మాత్రమే నగదు ఎందుకు ఇచ్చారో, అదే ప్రభుత్వం గతంలో ఆర్థిక సహాయం హామీ ఇచ్చిన రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలను ఎందుకు వదిలిపెట్టిందో కూడా మోదీ, నితీష్‌లను ఎందుకు ఇవ్వలేకపోయిందో సమాధానం చెప్పాలని కాంగ్రెస్(Congress) బీహార్ యూనిట్ మీడియా చీఫ్ రాజేష్ రాథోర్ డిమాండ్ చేశారు.