‘ఆపరేషన్ సిందూర్’ను ఆపాలని నన్నెవరు కోరలేదు
x

‘ఆపరేషన్ సిందూర్’ను ఆపాలని నన్నెవరు కోరలేదు

లోక్‌సభలో వాడివేడిగా జరిగిన చర్చ - ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చిన మోదీ


Click the Play button to hear this message in audio format

‘ఆపరేషన్ సిందూర్’ను ఆపాలని తననెవరూ కోరలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య సీజ్‌ఫైర్‌కు తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఇదే ప్రశ్నను ప్రతిపక్షాలు లోక్‌సభలో లేవనెత్తాయి. వారి విమర్శలకు ప్రధాని మోదీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ఆపాలని ఏ దేశాధినేత భారత్‌ను కోరలేదని మోదీ సభలో ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌లపై లోక్‌సభలో రెండురోజులుగా 19 గంటలకుపైగా చర్చ జరిగింది. ఈ రెండు అంశాలపై మంగళవారం సాయంత్రం ప్రధాని సుమారు 102 నిమిషాలు మాట్లాడారు. అంతకుముందు విపక్షాలు ఎగువ, దిగువసభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి.

‘‘మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు (జేడీ వాన్స్‌) నాతో మాట్లాడటానికి 3-4 సార్లు ప్రయత్నించారు. నేను ఆ సమయంలో సైనిక బలగాల సమావేశంలో ఉన్నాను. ఆ తర్వాత నేను ఆయనకు ఫోన్‌ చేశాను. పాక్‌ పెద్ద దాడి చేయబోతోందని వాన్స్‌ హెచ్చరించారు. పాక్‌గానీ భారత్‌పై దాడికి దిగితే మా దాడి ఇంకా భారీగా ఉంటుందని, ప్రతి తూటాకు మేం ఫిరంగులతో జవాబిస్తామని తేల్చిచెప్పాను. అంతేగానీ యుద్ధాన్ని నిలిపివేయాలని ఏ దేశం నుంచి ఏ నేత మనల్ని అడగలేదు. కాంగ్రెస్‌ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. వారి పసలేని ప్రకటనలు మన వీర సైనికుల్ని నిరుత్సాహపరిచాయి.’’ అని పేర్కొన్నారు.


‘మీ సమాధానాలు సంతృప్తికరంగా లేవు’

మోదీ సమాధానానికి కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా స్పందించారు. అసలు ఉగ్రవాదులు దేశంలోకి ఎలా ప్రవేశించగలిగారు? మన పౌరులు, మన పర్యాటకులపై దాడి ఎలా చేయగలిగారు అన్న ప్రశ్నలకు మీ వద్ద సమాధానాలు లేవు" అని అన్నారు.


‘నిఘా వైఫల్యానికి బాధ్యులెవరు?’

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..

"ఉగ్రవాదులు దేశంలోకి పదే పదే ఎలా వస్తున్నారో మాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిఘా వైఫల్యానికి ఎవరు బాధ్యులు? ఎవరైనా బాధ్యత తీసుకున్నారా?" అని ప్రశ్నించారు. అసలు రాఫెల్ యుద్ధ విమానాలు "ఎగిరాయో లేదో" కనీసం సభకయినా చెప్పాలని యాదవ్ వ్యగ్యంగా మాట్లాడారు.


‘మోదీ బహిరంగ ప్రకటన చేయాలి’

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో మోదీ విఫలమయ్యారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ ఆరోపించారు. పహల్గామ్‌లో ఉగ్రవాద వెనక నిఘా వైఫల్యం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్న సీజ్‌ఫైర్ గురించి నేరుగా ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ట్రంప్ చెబుతున్నది అవాస్తవమని మోదీ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

"ప్రధాని మోదీ తన రెండు గంటల ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ పూర్తి క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. ప్రసంగం ప్రారంభంలో తనకు దేశ ప్రజలు మద్దతు ఇచ్చారని అన్నారు. ఆయన చెప్పింది తప్పు, దేశ ప్రజలు ప్రభుత్వానికి, భారత సైన్యానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు" అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు.

ప్రధాని చెప్పిన దానిలో కొత్తగా ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ విమర్శించారు. "ఈరోజు ఉదయం అమిత్ షా చెప్పిన మాటలను ప్రధానమంత్రి పునరావృతం చేస్తున్నారు. మరేమీ లేదు" అని పేర్కొన్నారు.

Read More
Next Story