అధికారంలోకి వస్తే ఎన్‌డీఏ కంటే ఎక్కువ బియ్యం: ఖర్గే
x

అధికారంలోకి వస్తే ఎన్‌డీఏ కంటే ఎక్కువ బియ్యం: ఖర్గే

పేద కుటుంబాలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే శుభవార్త చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఎన్‌డీ‌ఏ ప్రభుత్వం కంటే రెట్టింపు బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించారు.


ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా 10 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. నాలుగు దఫా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే బీజేపీ కేంద్రం ప్రభుత్వం ప్రతినెలా ఐదు కిలోల రేషన్‌ బియ్యాన్నిఅందజేస్తున్న విషయాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ.."మీరు (బీజేపీ) ఐదు కిలోలు ఇస్తున్నారు. భారత కూటమి అధికారంలోకి వస్తే 10 కిలోల రేషన్ ఇస్తాం" అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు.

సమస్యకు అది పరిష్కారం కాదు: ప్రియాంక

ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా ప్రతి ఎన్నికల ర్యాలీలో ఉచిత రేషన్ బియ్యం గురించి చెబుతున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే 2029 వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తామని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల ప్రచార సభలో ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడారు. పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాదని ఆమె పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు చూపడం ముఖ్యమని చెప్పారు. నిరుద్యోగులు తమకాళ్ల మీద తాము నిలబడేందుకు వారికి ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యాన్నిపంపిణీ చేస్తామని ఎన్నికల ర్యాలీల్లో వాగ్దానం చేశారు.

Read More
Next Story