
‘‘అంతమాత్రాన.. నేను ప్రియాంకను ముద్దు పెట్టుకుంటానా?’’
మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపిన మంత్రి వ్యాఖ్యలు.. ఎదురుదాడికి సిద్ధమయిన కాంగ్రెస్.. ఇంతకు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్(Madhya Pradesh) పట్టణాభివృద్ధి మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గీయ(Vijayvargiya) వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బహిరంగంగా తన సోదరి ప్రియాంక(Priyanka Gandhi)ను ముద్దుపెట్టుకోవడం గురించి విమర్శలు గుప్పించారు. రాహుల్‌పై విదేశీ సంస్కృతి ప్రభావం ఉందని, తన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకను బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ (BJP) సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా షాజాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
"మనది ప్రాచీన భారతీయ సంస్కృతి. మా సోదరి ఇంటికి వెళితే మేం నీళ్ళు కూడా తాగం. మా నాన్న జిరాపూర్‌లో ఉన్న మా మేనత్త ఇంటికి వెళితే.. వెంట నీళ్లు తీసుకెళ్లేవారు. కాని గౌరవప్రద హోదాలో ఉన్న మన ప్రతిపక్ష నేతలు తమ సోదరిని బహిరంగంగా ముద్దు పెట్టుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా.. మీ సోదరి పట్ల మీరు బహిరంగంగా ఇలా ప్రవర్తించగలరా? అని. భారతీయ విలువల గురించి తెలియని వారు.. విదేశీ సంస్కృతిలో పెరిగిన వారు ఇలా వ్యవహరిస్తారు.’’ అని రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
కైలాష్ వ్యాఖ్యలను సమర్థించిన కున్వర్ షా..
కైలాష్ విజయ్ వ్యాఖ్యలను మరో మంత్రి కున్వర్ విజయ్ షా సమర్థించారు. "అది మన సంస్కృతి కాదు. మన నాగరికత, ఆచారాలు, సంప్రదాయాలు అలాంటి వాటిని నేర్పవు. విదేశాల్లో పాటించే వాటిని ఇళ్లలో ఆచరించాలి. బహిరంగ ప్రదేశాల్లో కాదు. ఆమె (ప్రియాంక) కూడా నా నిజమైన సోదరి. అంతమాత్రాన నేను ఆమెను బహిరంగంగా ముద్దు పెట్టుకుంటానా? అని అన్నారు.
దిష్టిబొమ్మల దహనం..
కైలాష్ విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్(Congress) ఎదురుదాడికి సిద్ధమైంది. "పవిత్ర అన్నాచెల్లెలి బంధాన్ని కైలాష్ అవమానిస్తున్నారు. అతని భాష అందరికీ తెలుసు. సిగ్గులేని కైలాష్ వ్యాఖ్యలపై స్పందించడానికి నేను సిగ్గుపడుతున్నా. కైలాష్ విజయ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. 70 ఏళ్ల వయసు ఉన్న ఆయనకు మతి భ్రమించింది. ఆయనకు సద్భుద్ధి ప్రసాదించాలని దేవున్ని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు కైలాష్ విజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.