మా నాయనమ్మ చనిపోయినా ఊరికి రాలేదు  4 ఏళ్ల తర్వాత సొంతూరికి ఎంపీ రఘురామ
x
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు

మా నాయనమ్మ చనిపోయినా ఊరికి రాలేదు 4 ఏళ్ల తర్వాత సొంతూరికి ఎంపీ రఘురామ

ఢిల్లీలో హల్‌చల్‌ చేసే ఓ పార్లమెంటు సభ్యుడు.. హైకోర్టు నుంచి ఆర్డరు పొంది పోలీసు బందోబస్తు మధ్య సొంతూరికి రావడం విచిత్రంగానే ఉన్నా అది నిజం..


‘‘నాలుగేళ్ల తర్వాత భీమవరం రావడం సంతోషంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ అందించిన సహకారం మరవలేనిది. అభిమానులు, తెలుగుదేశం, జనసేన నాయకులు చూపిన ప్రేమ మరవలేను. సొంత వారెవరో పరాయి వారెవరో అర్థమవుతోంది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు’’ అన్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

4 ఏళ్ల తర్వాత సొంత నియోజకవర్గానికి...

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు ఇవాళ సొంత గడ్డపై అడుగుపెట్టారు. నాలుగేళ్ల తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గమైన నరసాపురం వచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భీమవరంలోని తన నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వస్తున్న ఎంపీకి స్వాగత ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల బ్యానర్లు కట్టారు. పోస్టర్లు వేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు, సీఐడీ కేసులు, అరెస్టుల నేపథ్యంలో ఆయన ఏపీకి దూరంగా ఉంటున్నారు. ఢిల్లీకే పరిమితమై ఇంతకాలం వ్యవహరాలు సాగించారు.

భీమవరంలో భారీ ఏర్పాట్లు..

సంక్రాంతి పండుగ సందర్భంగా నరసాపురం వచ్చిన ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు అభిమానులు భీమవరంలో ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు 4 రోజుల పాటు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు. భీమవరంలోని రఘురామ కృష్ణం రాజు నివాసం వద్ద భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని సన్నిహితులతో రఘురామ కృష్ణంరాజు భేటీ అవుతారు.


వైసీపీ అధిష్టానం వైఖరిపై తిరుగుబాటు చేసిన ఎంపీ రఘురామ రాజు పార్టీలో ఉంటూనే జగన్‌పై విరుచుకుపడేవారు. అప్పటి నుంచి కేసులు, అక్రమ అరెస్టుతో వైసీసీ సర్కారు ఆయనను వేధింపులకు గురి చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. హై కోర్టు చట్టపరమైన రక్షణ కల్పించడంతో సంక్రాంతి పండుగ నేపధ్యంలో ఆయన భీమవరం వచ్చారు.

హైకోర్టు ఉత్తర్వులతో బందోబస్తు

సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు రక్షణ కల్పించాలంటూ రఘురామ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. పోలీసులు తనపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని పిటీషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు రఘురామకు చట్టపరమైన భద్రత కల్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Read More
Next Story