
సర్జికల్ స్ట్రైక్‌పై కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
బీజేపీ విమర్శలతో వెనక్కు తగ్గిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ..
పహెల్గామ్(Pahalgam) ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ఎంపీ చరణ్‌జిత్ సింగ్ (Charanjit Singh Channi) చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాస్పదంగా మారాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అయిన చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాక్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ 2016లో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ జరిగిందని విన్నాం. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా? దీని గురించి ఎవరూ మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాక్ జాతీయులను వారి దేశానికి పంపడం తప్ప చేసిందేమి లేదని చన్నీ విమర్శించారు.
ఏప్రిల్ 22న దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ స్పందించారు. 2024లో పూంచ్‌లో కార్పోరల్ విక్కీ పహాడే మరణాన్ని "స్టంట్‌బాజీ"గా చన్నీ చేసిన వ్యాఖ్యలను కేశవన్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన మళ్ళీ సాయుధ దళాలను అవమానిస్తున్నాడని చెప్పారు.
బీజేపీ విమర్శల నేపథ్యంలో చన్నీ వెనక్కి తగ్గారు. "ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మా మద్దుతు ఉంటుందని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం కావాలి. అదే మేం కోరుకుంటున్నాం," అని అన్నారు.