ఝార్ఖండ్ పట్టాలు తప్పిన ముంబయి-హావ్‌రా ఎక్స్‌ప్రెస్
ఝార్ఖండ్‌లో ముంబయి-హావ్‌రా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ వద్ద ముంబయి-హావ్‌రా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనపై ఆగ్నేయ రైల్వే డివిజన్ ప్రతినిధి ఓం ప్రకాష్ చరణ్ మాట్లాడుతూ.. సమీపంలో మరొక గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, అయితే రెండు ప్రమాదాలు ఏకకాలంలో జరిగాయా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు.
రెస్క్యూ ఆపరేషన్..
"గాయపడిన ప్రయాణికులకు బారాబాంబూలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం వారిని చక్రధర్‌పూర్‌కు తరలించాం’’ అని మరొక సీనియర్ ఆగ్నేయ రైల్వే డివిజన్ అధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. సురక్షితంగా ఉన్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
మమత బెనర్జీ ఆగ్రహం..
వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రపై విరుచుకుపడ్డారు. ఆమె సోషల్ మీడియాలో ఇలా పోస్టు చేశారు. “మరో ఘోర రైలు ప్రమాదం.. ఈరోజు తెల్లవారుజామున జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో హౌరా-ముంబై మెయిల్ పట్టాలు తప్పింది. ఇద్దరు చనిపోయారు.చాలా మంది గాయపడ్డారు. ఇది విషాదకర ఘటన. నేను ఇప్పుడు అడుగుతున్నా. ఇదా పాలన? ప్రతి వారం ఎక్కడోచోట రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి అంతం లేదా? కేంద్రం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంతం లేదా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.