RJD పాలనను గుర్తుచేస్తూ.. బాహుబలిలను రంగంలోకి దింపిన NDA
x

RJD పాలనను గుర్తుచేస్తూ.. 'బాహుబలి'లను రంగంలోకి దింపిన NDA

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్డీఏ బాహుబలిలను నమ్ముకుందా ? తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి భార్యలు, పిల్లలకే టిక్కెట్లు ఇచ్చిందా?


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) స్టార్ క్యాంపెయినర్లు - మోదీ(PM Modi), నితీష్ కుమార్, అమిత్ షా నుంచి యోగి ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా వరకు ఒకే పదాన్ని తమ ఎన్నికల ప్రచారంలో వాడుతున్నారు. అదే "అడవి రాజ్యం". ఆర్జేడీకి గెలిపిస్తే మళ్లీ మీకు చీకటి రోజులే అంటూ ప్రజలను భయపెడుతున్నారు.

మరోవైపు హత్య, కిడ్నాప్, దోపిడీ తదితర తీవ్ర నేరారోపణలున్న వారికి టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు. గెలువడం కోసం ఎన్డీఏ కూటమి ఒకప్పుటి "బాహుబలి" (బలవంతులు), వారి భార్యలు, కుమారులపై ఆధారపడుతోంది. ఈ బాహుబలిలలో ఎక్కువ మంది శక్తివంత అగ్ర కులాలకు చెందినవారే ఉన్నారు.

ఒకవైపు ప్రతిపక్ష ఆర్జేడీ(RJD), కాంగ్రెస్‌(Congress)లను నిందిస్తూనే.. అదే సమయంలో బాహుబలి, వారి సన్నిహిత కుటుంబ సభ్యుల కోసం బీజేపీ నేతలు ప్రచారం చేయడం శుద్ధ కపటత్వం.

పాట్నాలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) మాజీ ప్రొఫెసర్ పుష్పేందర్ కుమార్ మాట్లాడుతూ.. నితీష్‌ను తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు "సుశాషన్ బాబు" అని పిలిచినా.. నితీష్‌కు ఏ సమస్య లేదు. సంకోచం లేదు అని అన్నారు.

నవంబర్ 2005లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నితీష్ కుమార్.. ఆర్జేడీ పాలనను "అడవి రాజ్యం"తో పోలుస్తున్నారు. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా.. NDA ప్రచారకులు అదే పదం వాడారు. ఈ ఏడాది కూడా మోదీ, షా బీహార్‌ను సందర్శించినప్పుడల్లా బహిరంగ సమావేశాల్లో మళ్లీ అదే పదం తెరమీదకు తెచ్చారు.

వాస్తవానికి ఎన్డీఏ తరుపున ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నది తీవ్రనేరారోపణలున్న వారే. ఇలాంటి బాహుబలిలను ఎన్నికల్లో పోటీకి దించడానికి బీజేపీ ఏ సమస్య లేదు.


అనంత్ సింగ్ - మొకామాలో 'ఛోటే సర్కార్'

ఉదాహరణకు అనంత్ సింగ్‌ను తీసుకోండి. ఆయన కండబలానికి స్థానికులు ఆయనను 'బాహుబలి'గా పిలుస్తారు. దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో ఆదివారం అరెస్టు చేసిన ఈ మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం మోకామా అసెంబ్లీ నియోజకవర్గ జేడీ(యూ) అభ్యర్థి. 2005 నుంచి స్వస్థలం మోకామాలో ఈయనకు బలమైన మద్దతు ఉంది. హత్య, కిడ్నాప్, దోపిడీ ఇతర తీవ్రమైన నేరాల కారణంగా రెండు డజనుకు పైగా కేసులున్న అనంత్ సింగ్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. మోకామాలో ఆయనంటే అందరికి హడల్. ఆయన్ను ప్రశ్నించడానికి ఎవరూ సాహసించరు. ఆగస్టు 6న పాట్నా జైలు నుంచి విడుదలైన కొన్ని నిమిషాల తర్వాత.. అనంత్ సింగ్ మొకామా నుంచి జేడీ(యూ)టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిగా జైలు నుంచే మొకామా నుంచి గెలుపొందారు.


ఆర్జేడీ నుంచి జేడీ(యూ)కి..

2022లో దోషిగా తేలడంతో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారు. పోటీకి కూడా దూరం పెట్టడంతో ఆయన భార్య నీలం దేవి ఆర్జేడీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. కానీ జనవరి 28 2024న నితీష్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో తిరిగి చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనంత్ భార్య కూడా పార్టీ మారి ఫిబ్రవరి 2024లో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్‌కు ఓటు వేశారు.

శక్తివంత అగ్రవర్ణ భూమిహార్‌కు చెందిన అనంత్.. 2019లో తన ఇంటి నుంచి AK-47 అస్సాల్ట్ రైఫిల్‌తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద 10 ఏళ్లు జైలులో ఉన్నారు.


ఇతర JD(U) 'బాహుబలి' అభ్యర్థులు..

నితీష్ నేతృత్వంలోని జేడీ(యూ) ఎక్మా నియోజకవర్గం నుంచి ధుమల్ సింగ్, కుచాయికోట్ నుంచి అమ్రేందర్ పాండే, రాజ్‌భల్లభ్ యాదవ్ భార్య విభా దేవి, సందేశ్ నియోజకవర్గం నుంచి రాధా చరణ్ సేథ్ వంటి బాహుబలిలు ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు. ఐఎఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాహుబలి ఆనంద్ మోహన్ సింగ్ పెద్ద కుమారుడు చేతన్ ఆనంద్‌ను నబీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్‌లో జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను కొట్టి చంపినందుకు మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌కు జీవిత ఖైదు విధించారు. 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత ఏప్రిల్ 2023లో విడుదలయ్యారు. నితీష్ ప్రభుత్వం జైలు నియమాలను సవరించిన తర్వాత అతని విడుదల సాధ్యమైంది. అతని కుమారుడు చేతన్ ఆనంద్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో RJD టిక్కెట్‌పై గెలిచాడు. కానీ అతను కూడా పార్టీ మారి 2024 ఫిబ్రవరిలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్‌కు ఓటు వేశాడు. ఇప్పుడు అతను JD(U) అభ్యర్థిగా బరిలో ఉన్నాడు.


బీజేపీ 'బాహుబలి' అభ్యర్థులు..

నేరస్థుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సునీల్ పాండే కుమారుడు విశాల్ పర్శాంత్ పాండేను భోజ్‌పూర్‌లోని తరారి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. 2003లో పాట్నాలో ప్రఖ్యాత న్యూరో సర్జన్ రమేష్ చంద్రను కిడ్నాప్ చేసినందుకు పాండేకు జీవిత ఖైదు విధించారు. సునీల్ పాండే 1994లో నితీష్ కుమార్ స్థాపించిన సమతా పార్టీకి అప్పట్లో ఎమ్మెల్యే.

షాపూర్ స్థానం నుంచి రాకేష్ ఓజా, బనియాపూర్ నుంచి కేదార్‌నాథ్ సింగ్, వార్సలిగంజ్ నుంచి బాహుబలి అఖిలేష్ సింగ్ భార్య అరుణా దేవి కూడా ఇలాంటి నేపథ్యం ఉన్న బీజేపీ అభ్యర్థులు. 1990 చివర్లో నవాడా, నలబ్డా బెల్ట్‌లో అఖిలేష్ సింగ్ ఒక ఉగ్రవాది.

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) బర్హంపూర్ స్థానం నుంచి బాహుబలి అయిన హులాస్ పాండేని పోటీకి దింపింది.


2000 సంవత్సరంలో నితీష్ బాహుబలి సంబంధం..

బాహుబలితో నితీష్ కుమార్‌కు ఉన్న సంబంధం కొత్తేమీ కాదని ఒక రాజకీయ పరిశీలకుడు అన్నారు. 2000 సంవత్సరంలో నితీష్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా కేవలం ఒక వారం మాత్రమే పనిచేశారని, కొత్తగా ఎన్నికైన అరడజను మంది బాహుబలి ఎమ్మెల్యేలు, అగ్రవర్ణానికి చెందిన సూరజ్ భన్ సింగ్, సునీల్ పాండే, ధుమల్ సింగ్, రాజన్ తివారీ, రామ సింగ్, మున్నా శుక్లా వంటి వారి క్రియాశీల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేసుకున్నారు. వారందరిపై హత్య, కిడ్నాప్, దోపిడీ, అక్రమ నిర్బంధం, బెదిరింపులు ఇతర తీవ్రమైన నేరాలు ఉన్నాయని చెప్పారు.

పెరుగుతున్న నేరాలు, అవినీతి..

ఇటీవల పెరిగిపోతున్న నేరాలు, అవినీతి, బాహుబలిలతో సాన్నిహిత్యం కారణంగా నితీష్ ఎన్డీఏ ప్రభుత్వం " కానూన్ కా రాజ్ " (చట్ట పాలన), " సుశాసన్ " (సుపరిపాలన) పేరుతో వస్తున్న ప్రకటనలను కొంతమంది వింతగా చూస్తున్నారు.


కాదనలేని వాస్తవం..

లాలూ-రబ్రీ కాలం నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవవన్నది కాదనలేని వాస్తవం. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ 1990 నుంచి 1997 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన భార్య రబ్రీ దేవి 1997 నుంచి 2005 వరకు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

కానీ బీహార్‌లో ఆర్జేడీ అధికారం నుంచి దూరమయిన 20 సంవత్సరాల తరువాత కూడా.. బీజేపీ, దాని మిత్రపక్షం జేడీ(యూ) నాయకులు తమ "దుష్పరిపాలన"ను ప్రజలకు గుర్తుచేస్తూనే ఉన్నారు. దీనిని "అడవి రాజ్యం" (క్రూర పాలన) గా పిలుస్తారు.

Read More
Next Story