ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: ఖర్గే
x

ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: ఖర్గే

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మిత్రపక్షాలతో జతకట్టిన ప్రభుత్వం ఎంతోకాలం నిలువదన్నారు.


ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యానించారు.

లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. అయితే ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. శుక్రవారం (జూన్ 14) ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.

“దేశానికి మంచి జరగనివ్వండి. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పని చేయాలి. కానీ మన ప్రధానికి మాత్రం ఆ పని కొనసాగించకుండా చేయడం అలవాటు. అయితే దేశాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తాం...’’ అని పేర్కొన్నారు.

బీజేపీ బలమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

2014, 2019లో కాకుండా బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాంతో 28 మంది సభ్యులున్న జెడి(యు), తెలుగుదేశం పార్టీ (టిడిపి)పై ఆధారపడవలసి ఉంది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి వీరి మద్దతు కీలకంగా మారింది.

16 సీట్లు గెలుచుకున్న ఎన్ చంద్రబాబు నాయుడు టీడీపీతో పాటు నితీష్ కుమార్ జేడీయూ (12), బీజేపీ ఏక్నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ (5)పై ఆధారపడాల్సి వచ్చింది.

స్పందించిన జేడీ(యూ)..

ఖర్గే వ్యాఖ్యపై బీహార్ మాజీ IPRD మంత్రి, JD(U) MLC నీరజ్ కుమార్ స్పందించారు. కాంగ్రెస్ వారసత్వం గురించి ఖర్గేకు తెలియదా అని కుమార్ ప్రశ్నించారు. గతంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. 1991లో కాంగ్రెస్ వచ్చిన మెజార్టీకే 2024లోనూ వచ్చిందని, స్పష్టమైన మెజారిటీ లేకుండానే అప్పట్లో కాంగ్రెస్‌ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రావడం కోసం అప్పట్లో పీవీ నరసింహారావు చిన్న పార్టీలను చీల్చారని వ్యాఖ్యానించారు.

ఖర్గే ప్రకటనకు కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీ అండగా నిలిచింది. ఖర్గే సరిగ్గా చెప్పారంటూ ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఓటర్లు తనను అంగీకరించకపోయినా, మోదీ అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు.

Read More
Next Story