
హస్తినలో బీజేపీ ముందున్న సవాళ్లేమిటి?
వాయు(Air) కాలుష్యం, జల(water) కాలుష్యం నివారణ, వ్యర్థాల నిర్వహణ - కాషాయ పార్టీ ఎన్నికల హామీలు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పవర్‌లోకి వస్తుండడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కాని అసలు సమస్య మొదలు కాబోతుంది.
ఎన్నికలకు ముందు గాలి నాణ్యత మెరుగుపరచడం, యమునా నది శుద్ధీకరణ, వ్యర్థాల సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఈ మూడింటి వల్ల ఢిల్లీవాసులు జీవనం ప్రమాదంలో పడింది. కాషాయ పార్టీ మేనిఫెస్టో మొదట్లో ఆశాజనకంగా కనిపించినా..ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం పార్టీ నేతలపై ఉంది.
పడిపోయిన గాలి నాణ్యత..
2024లో ఢిల్లీలో 155 రోజులు గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉండేది. నవంబర్‌లో AQI 700 దాటినప్పుడు.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం గ్యాస్ చాంబర్‌గా మారింది. ది లాన్సెట్ ప్లానటరీ హెల్త్ ప్రకారం.. దేశంలో జరిగే మొత్తం మరణాల్లో 7.2% PM2.5 కాలుష్య కారణంగా జరిగినట్లు వెల్లడైంది. 2008-2019 మధ్య 10 నగరాల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణే, శిమ్లా, వారణాసి)లో చేసిన పరిశోధనలో ఢిల్లీలో గాలి కాలుష్యం వల్ల 11,964 మరణాలు సంభవించాయని పేర్కొంది.
బీజేపీ మేనిఫెస్టోలో "ఢిల్లీ క్లీన్ ఎయిర్ మిషన్" ద్వారా 2030 నాటికి AQI ని సగానికి తగ్గించాలని, PM2.5, PM10 స్థాయిలను 50% తగ్గించాలని ప్రతిపాదించింది. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లను శుభ్రం చేయడం వంటి చర్యలను చేపట్టనుంది. యమునా నదిని శుభ్రం చేయడం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉంది.
ఇక యమునా(Yamuna) నది శుద్ధీకరణ విషయానికొస్తే.. గుజరాత్‌లోని సబర్మతి మాదిరిగా యమునా రివర్‌ఫ్రంట్‌ను తీర్చిదిద్దాలని బీజేపీ యోచిస్తోంది. యమునా నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు "యమునా కోష్" ఏర్పాటు చేసి, ప్రధాన మురుగు కాలువల శుద్ధికి చర్యలు చేపట్టబోతుంది.
వ్యర్థాల నిర్వహణపై..
ఢిల్లీ రోజుకు 11వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ల సామర్థ్యం కేవలం 8,000 టన్నులకే పరిమితం. మిగిలిన వ్యర్థాలు(landfills) గాజీపూర్, ఓఖ్లా, భల్స్వా ల్యాండ్‌ఫిల్స్‌కు చేరతాయి. గాజీపూర్ ల్యాండ్‌ఫిల్ 2019 నాటికి 65 మీటర్ల ఎత్తుకి చేరింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచాలని బీజేపీ చూస్తోంది.
నిధుల మాట..
అయితే "డబుల్ ఇంజిన్" పాలనతో పనులు సమర్థవంతంగా జరుగుతాయన్న అంచనాలున్నాయి. హామీలను అమలు చేయాలంటే బీజేపీ 13వేల కోట్లు అవసరం. ఇందుకోసం కొత్త ప్రభుత్వం అదనపు ఆదాయ మార్గాలను కనుగొనాల్సి ఉంది. మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వాలనే ప్రణాళిక ద్వారా ఏకంగా ₹11,400 కోట్ల ఖర్చు అవుతుంది.
మొత్తంగా.. ఇప్పుడు రాజకీయ విజయాన్ని ఆస్వాదిస్తోన్న బీజేపీ ప్రభుత్వంపై పర్యావరణ సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా ఉంది. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం.