కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్..
x

కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్..

జనవరి 26, 2029 వరకు బాధ్యతలు నిర్వహించనున్నజ్ఞానేశ్ కుమార్..గతంలో రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా, హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.


Click the Play button to hear this message in audio format

భారత ఎన్నికల సంఘం కొత్త కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ (Gyanesh Kumar) నియమితులయ్యారు. ఈయన గత సంవత్సరం మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆయనను ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) గా నియమించింది.


ఎవరీ జ్ఞానేశ్‌ కుమార్‌..

కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌...గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన కొత్త నియామక విధానంలో ఎంపికైన మొదటి సీఈసీ కూడా. 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్‌ జనవరి 26, 2029 వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఇంజినీరింగ్ నుంచి బ్యూరోక్రసీ వరకు..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జనవరి 27, 1963న జన్మించిన జ్ఞానేశ్ కుమార్ ..IIT-కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ICFAIలో బిజినెస్ ఫైనాన్స్ కోర్సు, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్‌వైరన్మెంటల్ ఎకానమిక్స్ చదివారు.

కేరళలో కీలక పదవులు..

ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా, అడూర్ సబ్-కలెక్టర్‌గా, కొచ్చి కార్పొరేషన్ కమిషనర్‌గా, కేరళ ఎస్సీ/ఎస్టీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కేరళ ప్రభుత్వంలో ఆర్థిక వనరులు, ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టులను కూడా పర్యవేక్షించారు.

కీలక హోదాల్లో..

2007-2012 వరకు యూపీఏ హయాంలో రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా, హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, కోఆపరేషన్ మంత్రిత్వ శాఖలో కూడా కార్యదర్శిగా సేవలందించారు. జనవరి 31, 2024న పదవీ విరమణ చేశారు.

హోం మంత్రిత్వ శాఖలో..

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలక చర్యలను అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయోధ్య రామమందిరం కేసులో న్యాయపరమైన పత్రాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షాతో సన్నిహితంగా పనిచేసిన అధికారిగా ఆయన పేరుంది.

నూతన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్..ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, 2026లో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు - 2029ను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత ఆయనపై ఉంది.

Read More
Next Story