తెలంగాణలో త్వరలో డిజిటల్ మీడియా పాలసీ
x

తెలంగాణలో త్వరలో డిజిటల్ మీడియా పాలసీ

కార్పొరేట్ గుప్పిటలో ఉండే మీడియా కంటే ఎక్కువ మంది పాల్గొనే డిజిటల్ వేదికలు స్వాగతించాల్సినవి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు


త్వరలో రాష్ట్రంలో డిజిటల్ మీడియా పాలసీ తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఈ విధానాన్ని వచ్చే రెండు, మూడు నెలల్లో తీసుకురాబోతున్నట్టు శాసన మండలిలో మంత్రి చెప్పారు.

మండలిలో ఎంఎల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ డిజిటల్ మీడియా పాలసీకి ఇప్పటికే ఒక రూపం ఇచ్చామని చెప్పారు.

డిజిటల్ మీడియా సంస్థల ప్రభావం పెరుగుతున్న నేపధ్యంలో ఈ మార్పు గత కొద్ది కాలంగా జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నదే.

మీడియా సంస్థల ఏర్పాటులో పెద్ద కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ పార్టీలు ప్రధానంగా ముందుకు రావటంతో అవి ఇచ్చే వార్తలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయింది. సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేయటానికి యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లేదా వెబ్సైట్ లను నడిపేందుకు సాపేక్షికంగా తక్కువ ఖర్చు అవ్వటంతో అవి ప్రధాన స్రవంతి మీడియా కవర్ చేయని అంశాలను కూడా వెలుగులోకి తెస్తున్నాయి. దీనితో వాటికి ఆదరణ పెరుగుతోంది.

ఇటీవల ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ను నియంత్రించటానికి ఒక చట్టాన్ని చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నామని మార్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ అన్నారు.

“ఎలక్ట్రానిక్ మీడియా పై వచ్చే ఫిర్యాదులను పరిశీలించటానికి తగిన వేదికలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియా లో జరిగే తప్పుడు ప్రచారం విషయంలో అలాంటి వ్యవస్థ లేదు. దీన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది,” అన్నారు.

నిజమైన విలేకరులకు ఆ ముసుగులో ఇతర సొంత వ్యవహారాలు నెరిపే వారికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండానికి ఒక చట్టం అవసరాన్ని ఆ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

డిజిటల్ మీడియా కు ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించటం ఆహ్వానించాల్సిన విషయమే అని సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. “ప్రభుత్వ విధానం డిజిటల్ మీడియాను ప్రోత్సహించే విధంగా ఉండాలి. పొరపాటు ధోరణులను సరిదిద్దుకోవటానికి అవకాశం ఇవ్వాలి. సాంకేతిక శిక్షణ, సమాచార వనరుల లభ్యత కల్పించి డిజిటల్ మీడియా పెరుగుదలను గుర్తించే విధంగా ఉండాలి. దాన్ని మరింత క్రమబద్దంగా, ప్రజాస్వామికంగా పెంపొందించటానికి దోహదం చేయాలి,” అన్నారు.

కార్పొరేట్ గుప్పిటలో ఉండే మీడియా కంటే ఎక్కువ మంది పాల్గొనే డిజిటల్ వేదికలు స్వాగతించాల్సినవి. తమకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటూ వాటి స్వేచ్ఛను హరించే ధోరణులు మంచివి కావు అని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఎర్నస్ట్ అండ్ యంగ్ సంస్థ విడుదల చేసిన మీడియా ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ 2024 రిపోర్ట్ ప్రకారం 3.3 శాతం పెరుగుదల నమోదు చేసింది. దాని విలువ రు. 2.5 ట్రిలియన్లకు చేరుకుంది. 2019 నుంచి డిజిటల్ మీడియా విలువ రు. 308 కోట్ల నుంచి 2024 లో రు. 802 కోట్లకు పెరిగింది. 2024-27 మధ్యన ఈ రంగం 11.2 శాతం పెరుగుదల నమోదు చేస్తుందని ఎర్నస్ట్ అండ్ యంగ్ సంస్థ అంచనా వేసింది. ఇదే సమయంలో టెలివిజన్ రంగం విలువ రు. 788 బిలియన్ ల నుండి రు. 679 బిలియన్ లకు తగ్గింది. ఈ రంగం 2024-27 మధ్యన 0.6 శాతం నెగెటివ్ పెరుగుదల నమోదు చేస్తుందని అంచనా వేసింది.

ఫిక్కీ-ఈవై రిపోర్ట్ ప్రకారం డిజిటల్ మీడియా పరిశ్రమ ప్రతి ఏడు 17 శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. 2025 నాటికి దాని విలువ 9.35 బిలియన్ డాలర్ల కు పెరుగుతుందని అంచనా వేసింది. 2024 లో టెలివిజన్ రంగం కంటే డిజిటల్ మీడియా పరిశ్రమ రెవెన్యూ 32 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఈ పెరుగుదల 2019 కరొనా సమయం నుండి స్ఫష్టంగా కనిపిస్తోంది. దేశ జీడీపీ లో మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వాటా 0.73 శాతం.

2023 నాటికి దేశంలో 800 మిలియన్ ఇంటర్నెట్ వాడకం దారులున్నారు. దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి, స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఈ పెరుగుదలకు దోహద పడింది. దీనితో యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ కేవలం ఎంటర్టైన్మెంట్ కు మాత్రమే కాకుండా వార్తల ప్రసారనికి మాధ్యమంగా, సామజిక భాగస్వామ్యానికి, క్రియాశీల కార్యక్రమాలకు వేదిక అయ్యాయి అని రిపోర్ట్ పేర్కొంది.

Read More
Next Story