
ఢిల్లీలోని RSS కొత్త కార్యాలయంలో ప్రత్యేకతలేంటి?
ఆధునిక సాంకేతికతకు పురాతన శిల్పకళ జోడింపు, 13 అంతస్తులతో కూడిన మూడు టవర్లు, 300 గదులు, గ్రంథాలయం, హెల్త్ క్లీనిక్..
ఢిల్లీ(Delhi)లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కొత్త భవనం తయారైంది. పాత భవనాన్ని తొలగించి దీన్ని కట్టారు. 3.75 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నిర్మించారు. భవన నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే సుమారు 75వేల మంది విరాళాలు ఇచ్చారు. భవనం పూర్తికావడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. వాస్తవానికి నిర్మాణం 2016లోనే మొదలుపెట్టినా..కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ నూతన కార్యాలయం ఢిల్లీలో సంఘ్ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ఉపయోగపడనుంది.
పాత పేరు.. కొత్త రూపం..
RSS కొత్త భవనం "కేశవ కుంజ్" అనే పాత పేరుతోనే కొనసాగనుంది. RSS చీఫ్ మోహన్ భాగవత్, జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే ఫిబ్రవరి 19న ఇందులో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నారు.
ఆధునిక సాంకేతికతకు పురాతన శిల్పకళ జోడించి గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అనుప్ దవే భవనానికి రూపకల్పన చేశారు. మొత్తం భవన సముదాయంలో 13 అంతస్తులతో కూడిన మూడు టవర్లు ఉన్నాయి. టవర్లకు సాధన, ప్రేరణ, ఆర్చన అనే పేర్లు పెట్టారు.
సింఘాల్ పేరిట ఆడిటోరియం..
విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకుడు, రామ మందిర ఉద్యమంతో నేరుగా సంబంధం ఉన్న ఆశోక్ సింఘాల్ పేరిట ఒక పెద్ద ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఇందులో 463 మంది కూర్చోవచ్చు. 650 మంది కూర్చోడానికి వీలుగా మరో హాల్‌ను కూడా నిర్మించారు.
2016 నుంచి అద్దె భవనంలో..
1962 నుంచి పాత భవనంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు సాగేవి. 2016లో అద్దె భవనంలోకి మార్చారు. కొత్త భవనంలో ఐదు పడకల ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, మురుగు శుద్ధి కేంద్రం, భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
గ్రంథాలయం భవనంలో సుమారు 8,500 పుస్తకాలు ఉంచనున్నారు. పరిశోధకులకు ఉపయోగపడేలా ఈ భవనం రూపొందించారు. ఇకపై RSS అనుబంధ పత్రికల కార్యాలయాలు "పాంచజన్య," "ఆర్గనైజర్", హిందుత్వ ప్రచురణ సంస్థ "సురుచి ప్రకాశన్" కొత్త భవనంలోనే ఉంటాయి.