ఫలించిన భారత్ కృషి..
ఇండియాకు ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా.. కుట్రకోణాన్ని బయటపెట్టే పనిలో NIA
ఎట్టకేలకు ముంబై (NIA) పేలుళ్ల కుట్రదారుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. భారత్ అభ్యర్థన మేరకు..అమెరికా మార్షల్స్ రాణాను భారత ఏజెంట్లకు అప్పగించారు. అమెరికా(America) నుంచి గురువారం సాయంత్రం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే రాణాను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉగ్రవాద నిరోధక సంస్థ అతన్ని పాటియాలా హౌస్‌లోని NIA ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. దీంతో 18 రోజుల NIA కస్టడీకి కోర్టు అనుమతించింది. పాటియాలా హౌస్ కోర్టు నుంచి ఢిల్లీ పోలీసుల స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT), ఇతర భద్రతా సిబ్బంది ప్రత్యేక భారీ భద్రతా వాహనంలో రాణాను NIA ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రతి రోజు విచారణ అనంతరం ఢిల్లీలోని CGO కాంప్లెక్స్‌లోని ఉగ్రవాద నిరోధక సంస్థ ప్రధాన కార్యాలయం లోపల అత్యంత భద్రత ఉన్న సెల్‌లో రాణాను ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రెస్ నోట్ రిలీజ్..
"రాణా 18 రోజుల పాటు NIA కస్టడీలో ఉంటాడు. 2008 జరిగిన బాంబు దాడిలో మొత్తం 166 మంది చనిపోగా, 238 మందికి పైగా గాయపడ్డారు. ఆ కుట్రను ఛేదించడానికి ఏజెన్సీ అతన్ని ప్రశ్నించనుంది’’ అని కోర్టు ఉత్తర్వు తర్వాత దర్యాప్తు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
రాణా ప్రయత్నాలు విఫలం..
తన అప్పగింతపై స్టే విధించాలని అమెరికా సుప్రీంకోర్టులో రాణా గట్టి ప్రయత్నాలే చేశాడు. అయితే వాటిని తిరస్కరించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, అమెరికాలోని సంబంధిత అధికారుల సమన్వయంతో రాణాను ఇండియాకు తీసుకురాగలిగింది భారత ప్రభుత్వం.
"ఈ దాడులకు బాధ్యులయిన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా, భారతదేశం కలిసి పనిచేస్తాయి," అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు.
ఉగ్రదాడి గురించి క్లుప్తంగా..
2008లో దాదాపు పది మంది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబై నగరంలో మారణహోమం సృష్టించారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నవంబరు 6 నుంచి 29 వరకూ మూడు రోజుల పాటు కాల్పులు, బాంబు దాడులకు తెగబడింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా, 308 మంది వరకూ గాయపడ్డారు. దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో, సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో, విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.
కీలక సూత్రధారి రాణా..
64 ఏళ్ల తహవూర్ రాణా (Tahawwur Rana) పాకిస్థాన్ మూలాలున్న కెనడా పౌరుడు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే ముందు పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో కెప్టెన్‌గా పనిచేశాడు. ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థను నిర్వహిస్తూ..వ్యాపారిగా చికాగోలో సెటిల్ అయ్యాడు. తన ఇమ్మిగ్రేషన్ సెంటర్‌తో పాటు ముంబైలో ఉన్న ఆఫీసును ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాడులకు ముందు కొన్ని రోజులు హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉన్నట్లు సమాచారం. అంతేకాదు రాణాకు పాక్‌లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
లాస్ ఏంజెల్స్‌లో రాణా జైలు జీవితం..
ఈ దాడులకు ప్రణాళిక రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడని అతడిపై కేసులు నమోదయ్యాయి. దాడి జరిగిన ఏడాది తర్వాత 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రాణా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. రాణా అప్పగింతపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సైతం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇక అతడి అప్పగింత విషయమై భారత్ న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ పిటిషన్‌లు వేశాడు. అయితే రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత దేశానికి పంపించాలని జారీ అయిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో ఆయనను భారత దేశానికి రప్పించడానికి మార్గం సుగమం అయింది. ఇక రాణాపై నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, హత్య, ఫోర్జరీతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.