బెంగాల్: హింస లేకుండా ‘ఈసీ’ ఎన్నికలను నిర్వహించగలదా?
బెంగాల్ లో ఏ స్థాయి ఎన్నికలు జరిగినా హింస అనేది సాధారణంగా మారిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసీ లోక్ సభ ఎన్నికలకు 900 కంపెనీల బలగాలను మోహరించింది.
ఎన్నికలు అనగానే పశ్చిమ బెంగాల్ రావణకాష్ఠంలా రగలడం గత దశాబ్దం నుంచి పరిపాటిగా మారింది. ఇక్కడ జరిగే రాజకీయ హింస గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అయితే ఇప్పుడు కూడా ఈ ధోరణి కొనసాగుతుందా? ప్రజలు ఐక్యంగా ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోగలరా? ఓటర్ల, ఎన్నికల సంఘం మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే.
సార్వత్రిక ఎన్నికల మొదటి దశ ప్రారంభం కావడానికి దాదాపు మరో 15 రోజులు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పోల్-సంబంధిత హింస నమోదు, మరణాలు ఏవీ సంభవించలేదు. అలా అని బెంగాల్ ఏమి ప్రశాంతంగా లేదు. పలు ఆందోళనలకు ఆస్కారం ఉందనే సంకేతాలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి.
ఏప్రిల్ 19న ప్రారంభ దశలో ఎన్నికలు జరగనున్న మూడు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన కూచ్ బీహార్‌లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర బెంగాల్ మంత్రి ఉదయన్ గుహా కారును ఆదివారం (మార్చి 31) బీజేపీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ నియోజకవర్గంలోని దిన్‌హటా సబ్ డివిజన్‌లో బాంబు దాడి ఘటనలు కూడా జరిగాయి.
టీఎంసీ, బీజేపీ కార్యకర్తల వాగ్వాదాలు
మార్చి 20న రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ, కేంద్రమంత్రి ప్రమాణిక్ సమక్షంలోనే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. అడపాదడపా హింసాత్మక సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇతర ప్రదేశాలలో కూడా జరిగాయి. వీటిలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగోర్, కానింగ్, గోసాబా, నదియా జిల్లాలోని కృష్ణానగర్, తూర్పు బుర్ద్వాన్‌లోని పాండేబేశ్వర్, ముర్షిదాబాద్‌లోని బెర్హంపూర్ ఉన్నాయి.
ఈ సంఘటనలు ఎన్నికల కమిషన్‌కు ముందస్తు హెచ్చరిక. కఠినంగా వ్యవహరించకపోతే ఏడు దశల్లో నిర్వహించే ఎన్నికల్లో భారీగా హింసచెలరేగడం ఖాయం. ఎన్ని కేంద్ర బలగాలు మోహరించిన ఎటువంటి ఫలితం ఉండదు.
సాయుధ బలగాల భారీ ఉనికి
బెంగాల్ లో సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి దాదాపు 920 కంపెనీల పారామిలిటరీ బలగాలు అవసరం అవుతాయని పోల్ ప్యానెల్ అంచనా వేసింది. అంటే సుమారు లక్ష మంది ఇందులో ఉంటారు. ప్రజలకు భరోసా కల్పించడానికి దాదాపు 100 కంపెనీల బలగాలను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే రాష్ట్రానికి ఈసీ పంపించింది.
వీరు నిత్యం రూట్ మార్చ్‌లు చేస్తూ, దుర్బల ప్రాంతాలను మాత్రమే కాకుండా, బలహీన ఓటర్లను కూడా గుర్తిస్తున్నారు. గతంలో రాజకీయ హింసకు గురైనవారు, ఏదైనా రాజకీయ సమూహం బెదిరింపులకు గురైన వారిని బలహీన ఓటర్లుగా ట్యాగ్ చేస్తున్నారు.
బలహీన ఓటర్ల గుర్తింపు
ఇప్పటికే వివిధ జిల్లాల్లో వేలాది మంది ఓటర్లను గుర్తించినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేయాలని పారామిలటరీ బలగాలని కోరింది.
పారామిలిటరీ బలగాలు నిర్వహించే రూట్ మార్చ్ గురించి స్థానికంగా ఉండేవారు ఫిర్యాదు చేసేందుకు కూడా EC సదుపాయం కల్పించింది పశ్చిమ బెంగాల్ CEO వెబ్‌సైట్‌లో దాని వివరాలను అప్‌లోడ్ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని 80,530 బూత్‌లలో పోలింగ్‌కు సంబంధించిన లైవ్ వీడియోలను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌ల నుంచి ఓటింగ్‌కు సంబంధించిన లైవ్ వీడియోలు ప్రసారం కావడం ఇదే తొలిసారి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 50 శాతం బూత్‌లు మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేయబడ్డాయి. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 2) కమిషన్ ప్రకటన చేస్తూ, పారదర్శకంగా, ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండా ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
పశ్చిమ బెంగాల్ గవర్నర్..
ప్రజా ఫిర్యాదుల కోసం "లోక్‌సభ" పోర్టల్‌ను ప్రారంభించడం ద్వారా ఎన్నికల సంఘం చేసే ప్రయత్నాలకు అనుబంధంగా గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా చొరవ తీసుకున్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు logsabha.rajbhavankolkata@gmail.com అనే ప్రత్యేక ఇమెయిల్ చిరునామా పంపవచ్చు. ఎన్నికల హింస, అవినీతిని అరికట్టేందుకు ఇలా చేశామని గవర్నర్ బోస్ చెప్పారు.
గత ఏడాది పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఇలాంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు గవర్నర్ బోస్ రాజ్‌భవన్‌లో 'పీస్ రూమ్ 'ని ప్రారంభించారు. అయితే హింసను నిరోధించడంలో సఫలం కాలేదు. గత ఏడాది గ్రామీణ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో కనీసం 20 మంది మరణించినట్లు సమాచారం.
ఈసీ ఇంకాస్త జాగ్రత్తగా..
2019లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రాష్ట్రంలో 11 మంది మరణించారు. 690 కి పైగా హింసాత్మక ఘటనలు చెలరేగాయని హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది. " గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింస పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించాలని" రచయిత నిర్మల్య బెనర్జీ పేర్కొన్నారు.
Next Story