మోదీని గెలిపించేందుకే ఏడు దశల్లో పోలింగ్: మమతా బెనర్జీ
దేశంలో మరోసారి మోదీని గెలిపించేందుకు ఈసీ ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
ప్రధానమంత్రిని, అతని మంత్రులను తిరిగి గెలిపించేందుకు ఈసీ సహకారం అందిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. తమ దగ్గర ఉన్న వనరులు పూర్తిగా వినియోగించుకుని బీజేపీ గెలిపించేలా ఎన్నికల కమిషన్ వ్యూహం రచించిందని ఆరోపించారు. అందుకు వీలుగా ఏడు దశల ఎన్నికలను ఈ సీ షెడ్యూల్ చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం అన్నారు.
టిఎంసి అభ్యర్థి ప్రసూన్ బెనర్జీకి మద్దతుగా మాల్దా జిల్లాలోని గజోల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈసీపై విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలను షెడ్యూల్ చేశారు, తద్వారా మోదీ, ఆయన మంత్రివర్గం సహచరులు, ఎంపీలు గెలవాలి. అందుకోసం దేశ వ్యాప్తంగా ప్రత్యేక విమానంలో ప్రయాణించి ప్రతిపక్ష అభ్యర్థులను ఓడించాలనే దురుద్దేశంతోనే ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుపుతున్నారని అన్నారు.
"ఇంతకుముందు సందర్భాలలో, ఎన్నికలు మే నాటికి ముగిసేవి, కానీ ఈ సంవత్సరం, మోదీ సైనిక విమానాలలో వివిధ ప్రదేశాలను సందర్శించడానికి వీలుగా జూన్ 1 వరకు ఎన్నికలు జరుపుతున్నారు. హెలికాప్టర్లతో సహా మా స్వంత రవాణా కోసం మేము ఏర్పాట్లు చేసుకుంటే ఉంటే.. బీజేపీ నేతలు మాకు ఎలాంటి అవకాశం లభించకూడదు అని చాలా వాటిని ముందస్తుగా బుక్ చేసి ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.’’ అని సీఎం ఆరోపించారు. ఎండవేడితో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో సర్వ సుఖాలు అనుభవిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల ప్రకటన తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి తాత్కాలిక కేబినెట్‌గా మారుతుంది, పరిపాలనా యంత్రాంగాన్ని నడిపించే బాధ్యత ఈసీకి ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం ప్రధాని మోదీ, నిర్దేశించిన పంథాలో నడుస్తోందని బెనర్జీ ఆరోపించారు. .
పశ్చిమ బెంగాల్‌కు నరేగా నిధులు విడుదల చేయించడంలో రాష్ట్రం నుంచి ఎంపికైనా బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు విఫలమయ్యారని పీఎం ఆవాస్ కింద నిధులు కూడా తేలేకపోయారని విమర్శించారు. మరోవైపు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసేందుకు గత ఏడాది నవంబర్‌లో మా (టీఎంసీ) ఎంపీలు ఢిల్లీకి వెళ్లినపుడు వారిపై దాడి చేసి అరెస్టు చేశారన్నారు.
" కాంగ్రెస్ - బిజెపి ఎంపిలు పేదల కోసం ఏమి చేసారు? (మాల్దాహా ఉత్తర) బిజెపి ఎంపి ఖగెన్ ముర్ము రాష్ట్రంలోని జాబ్ కార్డ్ హోల్డర్ల కోసం ఏమి చేసారు?" ఆమె ప్రశ్నించింది. సీపీఐ (ఎం), కాంగ్రెస్‌లు రాష్ట్రంలో బీజేపీని బలపరుస్తున్నాయని ఆరోపించిన బెనర్జీ, టీఎంసీయేతర అభ్యర్థికి ఓట్లు వేయవద్దని ప్రజలను కోరారు. "నేను ఇండి బ్లాక్ అనే పేరు పెట్టాను. కానీ బెంగాల్‌లోఈ బ్లాక్ లేదు. మన రాష్ట్రం వెలుపల ఉంది" అని ఆమె చెప్పారు.
"మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి, వ్యాపార సంస్థలతో సన్నిహితంగా ఉంటున్నారనే అంశాన్ని బయటకు తీసిన మా ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించారు. ఈ ప్రభుత్వం TMC ఎంపీలను లక్ష్యంగా చేసుకుంది" అని విమర్శించారు. ఎన్‌ఆర్‌సిలో 19 లక్షల మంది బెంగాలీల పేర్లు బయటకు రావడంతో మమతా బాలా ఠాకూర్, డెరెక్ ఓబ్రెయిన్‌తో సహా టిఎంసి ఎంపీలు అస్సాం వెళ్తే.. అక్కడి బీజేపీ ప్రభుత్వం గౌహతి విమానాశ్రయం నుంచి వెనక్కి పంపిందని బెనర్జీ పేర్కొన్నారు. మణిపూర్ లో జాతులు హింస ప్రజ్వరిల్లిన సమయంలో రాష్ట్రంలోని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, అప్పుడు టీఎంసీ వారికి అండగా నిలిచిందని చెప్పారు.
"మేము ప్రార్థనా మందిరాలను నిర్మిస్తుండగా వారు మాత్రం ధ్వంసం చేస్తున్నారు. రామ మందిరం గురించి బిజెపి ప్రగల్భాలు పలుకుతుంది, అయితే గత కొన్నేళ్లుగా బీజేపీ ఎన్ని దేవాలయాలను నిర్మించింది? దుర్గా, కాళి, జగన్నాథ ఆలయాలను నిర్మించింది టిఎంసి" అని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం వారికి అలవాటని, దేశంలో తప్పుడు వార్తలు ప్రసారం చేసి అల్లర్లకు కమలదళం కుట్రపన్నిందని బెనర్జీ ఆరోపించారు. టీవీల్లో వచ్చే ముందస్తు సర్వేలు ఫేక్ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ అధిక సంఖ్యలో సీట్లు గెలుస్తుందని అన్నారు.
Next Story