బెంగాల్ బీజేపీ స్పీడ్ కి, ఆధార్ బ్రేక్ వేసిందా?
బెంగాల్ లో ఎన్నికల ముందు బీజేపీకి స్పీడ్ కు ఆధార్ బ్రేక్ వేసినట్లు కనిపిస్తోంది. మథువా కమ్యూనిటీకి చెందిన వారికి ఆధార్ తొలగించడంపై కమలదళం ఆందోళన చెందుతుంది
మరో వారం లేదా రెండు వారాల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పొత్తులు, ఎత్తులు, సీట్ల పంపకాలు, అలకలు, కూటములు మొదలైయ్యాయి. ప్రజలకు తమ వైపు కు తిప్పుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా వారికి నాయకులకు ఓ ఐడియా వచ్చే ఉంటుంది. కానీ బెంగాల్ లో అనుకోకుండా బీజేపీ స్పీడ్ కు ఆధార్ బ్రేక్ వేసింది.
బెంగాల్ లో దాదాపు ఐదు లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలపై ప్రభావం చూపగల మథువా కమ్యూనిటికి రాంఛీలో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఆధార్ కార్డులు డి ఆక్టివేట్ అయినట్లు పలు లేఖలు వచ్చాయి. వీరంతా బెంగాలీ హిందూవులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వీరంతా ఇండియాలో ఉండడం గురించి అందులో ప్రశ్నలు లేవనెత్తడంతో బీజేపీ బెంగాల్ శాఖ వెంటనే రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. యూఐడీఏఐ సరిగా పనిచేయట్లేదని ఆరోపిస్తూ, త్వరలోనే అన్ని సమస్యలు సద్దుమణుగుతాయని సర్దిచెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన ఇటు కేంద్రం నుంచి గానీ, లేదా యూఐడీఏఐ నుంచి గానీ రాలేదు.
లేఖలో ఏముంది ?
బంగ్లాదేశ్ సరిహద్దులో నివస్తున్న అనేక మంది బెంగాలీ మథువా హిందూవులు ఆధార్ నంబర్ డియాక్టివేట్ గురించి లేఖలు అందుకున్నారు. "కింద సంతకం చేసిన వ్యక్తి, ఆధార్ నంబర్ xxxx xxxx xxxx కలిగి ఉన్నాడు.
ఇతనికి సంబంధించిన ఆధార్ నంబర్ ను డియాక్టివేట్ చేస్తున్నాం. మీరు ఇండియాలో ఉండడానికి కావాల్సిన అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేకపోయారు. కావున 2016 ఆధార్ రెగ్యూలేషన్స్( ఎన్ రోల్ మెంట్, అప్ డేట్) 28ఏ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం " అని అందులో రాసి ఉంది. దీనిని నడియా జిల్లాకు చెందిన ఓ బాధితులు ఫెడరల్ కు చూపించాడు. సంబంధిత లేఖను పరిశీలించినప్పడు, అది ఫిబ్రవరి 5 న జారీ చేయబడినట్లు ఉంది. మీకు ఏవైన అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ సెల్స్ ను సంప్రదించాలని వివరించింది.
"మథువా కమ్యూనిటీకి చెందిన వందలాది మందికి రాత్రిరాత్రే ఇలాంటి నోటీసులు వచ్చాయి. దీంతో బ్యాంక్ అకౌంట్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లింక్ లను కోల్పోయాం " అని అఖిల భారత నామశూద్ర బిక్షక్ పరిషద్ లీడర్ ముఖుల్ చంద్ర బైరాగ్య ఫెడరల్ తో అన్నారు.
బెంగాల్ లో ప్రస్తుతం ఉన్న చాలామంది మథువాలు లేదా నామశూద్ర తూర్పు పాకిస్తాన్ లేదా ప్రస్తుత బంగ్లాదేశ్ కు చెందిన షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు. అయితే అక్కడి మతోన్మాదులు జరిపిన దాడుల్లో వారంతా తిరిగి పశ్చిమ బెంగాల్లోని ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కానీ వీరిలో చాలామందికి భారత సిటిజన్ షిప్ లేదు.
‘బెంగాల్’ ను ‘అస్సాం’లా మార్చాలనుకుంటున్నారు: సీఎం
యూఐడీఏఐ మథువా కమ్యూనిటికి ఆధార్ నంబర్లు డియాక్టివేట్ చేయడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అస్సాం తరహలో డిటెన్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వారు(బీజేపీ) ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ బెంగాల్ లో దీనికి మేము అనుమతించమని అన్నారు. కార్డులు డీయాక్టివేట్ అయిన వారి పేర్లను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ ను ప్రారంభిస్తుందని ప్రకటించారు. డేటా బేస్ సిద్దమైన తరువాత రాష్ట్రం వారికి ప్రత్యేక కార్డును జారీ చేస్తుందని హమీ ఇచ్చారు. దీంతో మీరు బ్యాంక్ ఖాతాలు, ఇతర కార్యకలాపాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బీజేపీ హామీ ఇచ్చింది.. కానీ
2019 లో పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం మథువా కమ్యూనిటీకి భారత పౌరసత్వం మంజూరు చేస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. అయితే తరువాత దీనిపై ఆందోళనలు చెలరేగడంతో పౌరసత్వం ఇవ్వలేదు. దాంతో ఈ కమ్యూనిటీలో బీజేపీకి ఆదరణ తగ్గింది. వీరి జనాభా దాదాపు 30 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఐదు నియోజక వర్గాల ఫలితాలను వీరు తారుమారు చేయగలరు. అయితే 2024 ఎన్నికల ముందు సీఏఏ ప్రకారం కమ్యూనిటీ పౌరసత్వాన్ని మంజూరు చేస్తామని మరోసారి హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు యూఐడీఐ లేఖలతో బీజేపీ ఇరుకున పడింది.
ఆందోళనలు చేస్తాం
మథువాలకు ఆధార్ నంబర్ లు డియాక్టివేట్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని నామశూద్ర బికాష్ పరిషద్ నిర్ణయించింది. మార్చి 5న ఢిల్లీలో ధర్నాకు కూడా ప్రణాళిక సిద్దం చేసుకుంది. దీనిపై చట్టపరంగా కూడా పోరాడాలని మథువాలు ఆలోచిస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా నేరుగా ఆధార్ నంబర్ ను డియాక్టివేట్ చేస్తారని, ఇది సహజ న్యాయ సూత్రాలను ఉల్లఘించడమే అని, ఆధార్ అనేది పౌరసత్వం కాదని, భారత్ లో ఉండేందుకు అవసరాలను పూర్తి చేయలేదనే కారణంతో నంబర్ ను డియాక్టీవేట్ చేయడం చట్టబద్దం కాదని కలకత్తా హైకోర్టు సీనియర్ న్యాయవాదీ అరిందమ్ దాస్ అన్నారు.
నష్ట నియంత్రణ చర్యలు చేపట్టిన బీజేపీ
ఎన్నికల ముందు ఈ చర్య బయపడుతుండడంతో బీజేపీ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. డియాక్టివేషన్ సందర్భంగా జరిగిన తప్పులకు కేంద్ర షిప్పింగ్ , జలమార్గాల శాఖ సహాయమంత్రి శంతను ఠాకూర్ మథువాలకు క్షమాపణ చెప్పారు.యూఐడీఏఐ లోని సాంకేతిక లోపాల వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
" నేను ఈ సమస్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తో చర్చించాను. సమస్య పరిష్కారం నాకు అప్పగించారు. " అని ఠాకూర్ న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. మరో 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర నేతల నుంచి హమీ లభించిందని మరో బీజేపీ నేత సువేందు అధికారి తెలిపారు.