కోల్ కత వైద్య విద్యార్థిని హత్య లో మాఫియా కోణం..?
x

కోల్ కత వైద్య విద్యార్థిని హత్య లో మాఫియా కోణం..?

బెంగాల్ లో వైద్య విద్యార్థిని హత్య, అత్యాచారం కేసులో మరో కోణం ఉందని తోటీ విద్యార్థులు చెబుతున్నారు. బాధితురాలిని కావాలనే ఓ మాఫియా టార్గెట్ చేసిందని..


బెంగాల్ లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని హత్య, అత్యాచారం కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇందులో డ్రగ్ మాఫియా హస్తంతో పాటు, పెద్ద తలకాయల ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు, వైద్య విద్యార్థిని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి సహోద్యోగులు, కుటుంబ సభ్యులను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా వార్తా కథనాన్ని ప్రచురించింది.

'సాధారణ కేసు కాదు'
“ ఇది కేవలం అత్యాచారం, హత్య లేదా ఓ బాధితురాలి కేసు కాదని మేము అనుమానిస్తున్నాము. ఆమెను కొన్ని విషయాలపై టార్గెట్ చేశారు. ఆ సమయంలో ఆమె ఒంటరిగా సెమినార్ హాలులో ఉన్నట్లు పౌర వాలంటీర్‌కి ఎలా తెలిసింది? అతను కొన్ని పెద్ద చేపలు పంపిన కిల్లర్ ఫిష్ కావచ్చు” అని ఒక సహోద్యోగి జాతీయ మీడియాకి చెప్పారు.
మరొక సహోద్యోగి అంతర్గతంగా జరుగుతున్న చర్చ గురించి మీడియాకు వివరించారు. ఆమె తన డిపార్ట్‌మెంట్ లో జరుగుతున్న డ్రగ్ రాకెట్ ను బహిర్గతం చేయాలని ప్రయత్నించినందువల్ల దారుణంగా హత్య చేయించబడిందని పేర్కొన్నారు.
కేసు సీబీఐకి బదిలీ జరగడాని కంటే ముందు ఆమె ఏదో విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించిందని బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు.
ప్రిన్సిపాల్ మాట వినకపోతే అంతే..
బాధితురాలు గత కొన్ని వారాలుగా తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆమె డైరీలోని కొన్ని వివరాలు పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. కొన్ని సార్లు ఏకధాటిగా 36 గంటల పాటు పని చేసినట్లు తెలిసింది. ప్రిన్సిపాల్ మాట వినకపోవడంతో జూనియర్ డాక్టర్లను ఇలా వేధించినట్లు తెలిసింది. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ ఆధ్వర్యంలో ఇది జరిగినట్లు కొంతమంది విద్యార్థులు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్‌ కాగా ఘోష్‌ వారిని వేరే మెడికల్‌ కాలేజీకి బదిలీ చేశారని ఆరోపించారు.
ఘోష్‌ను విచారిస్తున్న సీబీఐ
అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలోనే ఇటూ సీబీఐ శనివారం (ఆగస్టు 17) ప్రిన్సిపాల్ ఘోష్‌ను ప్రశ్నించింది. నేరం జరిగిన రాత్రి అతను ఎక్కడ ఉన్నాడో కనుగొనే ప్రయత్నం చేసింది. నేరం జరిగిన తరువాత అతని స్పందన పరిశీలిస్తున్నారని కూడా తెలిసింది. అయితే ఘోష్ మాత్రం సరిగా సమాధానాలు ఇవ్వడం లేదని, ప్రతి ప్రశ్నను దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి మూడు రోజులుగా అతడిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.
దేశవ్యాప్తంగా హోరెత్తున్న నిరసనలు..
RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు వరుసగా పదో రోజు ఆందోళనల్లో పాల్గొనడంతో ఆరోగ్య సేవలు ప్రభావితం అయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్‌ పేషెంట్‌ విభాగాలు ఆదివారాలు మూతపడడంతో అత్యవసర విభాగానికి సీనియర్‌ వైద్యులు హాజరై రోగులకు వైద్యం అందించడంతో రద్దీ అంతంత మాత్రంగానే ఉంది.
Read More
Next Story