‘సందేశ్ కాలీ’  మహిళల గొంతును ‘టీఎంసీ’అణచివేస్తోంది: మహిళా కమిషన్
x

‘సందేశ్ కాలీ’ మహిళల గొంతును ‘టీఎంసీ’అణచివేస్తోంది: మహిళా కమిషన్

సందేశ్ కాలీ ప్రాంతంలో ఉన్న మహిళా బాధితుల గొంతును టీఎంసీ ప్రభుత్వం అణచివేస్తోందని జాతీయ మహిళా కమిషన్ ఆరోపించింది.


సందేశ్ కాల్ ప్రాంతంలో ఉన్న మహిళల గొంతును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అణచివేస్తోందని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆరోపించారు. సోమవారం ఆమె ప్రతినిధి బృందంతో పర్యటించారు. జాతీయ మహిళా కమిషన్ ను కలవడానికి అనేకమంది మహిళలు వచ్చారని చెప్పారు. తాను మహిళల్లో విశ్వాసం నింపడానికి ప్రయత్నించానని, దాంతో వీరంతా బయటకు వచ్చారని వివరించారు.

నిందితుడైన షాజహాన్ షేక్ ను అరెస్ట్ చేస్తే అనేక మంది బాధితులు ధైర్యంగా బయటకు వస్తారని పేర్కొన్నారు. కానీ బెంగాల్ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా మహిళలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. దీని ద్వారా నిజం బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పోలీసులతో మాట్లాడి వారికి రక్షణ కల్పించాలన్నారు. " సందేశ్ కాలీ ప్రాంత మహిళలతో మాట్లాడానికి నేను రోజంతా ఇక్కడే ఉన్నాను. అయితే ముందు నిందితుడిని అరెస్ట్ చేయండి. పోలీసులతో మాట్లాడండి" అన్నారు.

పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక దీవి సందేశ్ కాలీ ప్రాంతం. ఇక్కడ అక్రమ బంగ్లా వలసదారులు పెద్ద ఎత్తున నివసిస్తుంటారు. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, రేషన్ బియ్యం స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్ ఇక్కడి స్థానిక హిందూ ప్రజల భూములు లాక్కోవడంతో పాటు, మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఇంతకుముందు జనవరి 5 న ఈడీ అధికారులు కూడా రేషన్ బియ్యం స్కాంలో సోదా కోసం సందేశ్ కాలీ ప్రాంతంలో ఉన్న షాజహాన్ నివాసానికి వెళ్లినప్పుడు కొంతమంది దుండగులు అధికారులపై దాడులకు పాల్పడ్డారు. అప్పటి నుంచి అతడు పరారీ లో ఉన్నాడు.

ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ఇక్కడికి రావడానికి కంటే ముందు కమిషన్ లోని ఇద్దరు సభ్యులు సందేశ్ కాలీ ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా శర్మ ఈ రోజు ఈ పర్యటన చేపట్టారు.

" సమాజం తలదించుకునే పనులు ఇక్కడ జరిగాయి. మేము వెంటనే బాధితులతో మాట్లాడాలి. తరువాత పశ్చిమ బెంగాల్ గవర్నర్, రాష్ట్రపతిని కలిసి ఇక్కడి పరిస్థితి నివేదిస్తాం" అని రేఖా శర్మ చెప్పారు. బెంగాల్ టీఎంసీ ప్రభుత్వం, స్థానిక పరిపాలన వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం అధికారులకి సహకారం అందకుండ అడ్డంకులు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలు టీఎంసీ ప్రభుత్వం ఖండించింది. మహిళా కమిషన్ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి దాడులు జరిగితే మహిళా కమిషన్ ఎందుకు పర్యటించలేదని, కానీ బెంగాల్ లో మాత్రం వెనువెంటనే తన బృందంతో దిగి హాడావుడి చేస్తోందని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ విమర్శించారు.

Read More
Next Story