సందేశ్ ఖాలీ: అదో రావణలంక, క్లీనర్ నుంచి కిరీటం దాకా..
x

సందేశ్ ఖాలీ: అదో రావణలంక, క్లీనర్ నుంచి కిరీటం దాకా..

రేషన్ బియ్యం స్కాం,అక్రమ ఆయుధాలు, ప్రైవేట్ సైన్యం, భూ కబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులు.. ఆ లంకలో జరగని ఘోరం లేదు.. ఇంతకు ఇవన్నీ చేసిన రావణుడు.. ఎవరంటే..


అదో ద్వీపం.. చుట్టూ గంగానదీ .. కాస్త ముందుకు వెళ్తే మడ అడవులు, ఇంకాస్త ముందుకు వెళ్తే బంగ్లాదేశ్.. ఇంకోవైపు బంగాళాఖాతం.. అలాంటి ద్వీపానికెళ్లాలంటే పడవలే మార్గం.. కొత్త వారు ఎవరు వెళ్లిన ఇట్టే పసిగట్టవచ్చు. 20 ఏళ్ల క్రితం క్లీనర్ పని చేసి పొట్ట పోసుకుంటూ జీవనం ప్రారంభించిన ఓ వ్యక్తి.. నేడు కిరీటం పెట్టుకుని ఆ ద్వీపాన్ని పాలిస్తున్నాడు. భూ కబ్జాలు, ఆడవారిపై వేధింపులు, తనకు ఎదురు తిరిగి సజీవ దహానం చేయడం, విదేశీ ఆయుధాలు, ద్వీపాన్ని ఆక్రమించుకోవడానికి అవసరమైన తూటాలు అన్ని ఉన్నాయి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెబుతున్నానో.. అవును షాజహాన్ షేక్ గురించే ఇదంతా

ఈ మధ్య కాలంలో బెంగాల్ లో ఏ రాజకీయ నాయకుడి పేరు ఇంతలా మారుమోగిపోలేదు. ఇంతలా ఆధిపత్యం చెలాయించలేదు. బెంగాల్ లో అధికార టీఎంసీ అండతో చెలరేగిపోయిన షేక్ షాజహాన్ చరిత్ర మొత్తం కూడా సామాన్య ప్రజల గోసతో నిండిపోయింది. ఇప్పుడు ఇదే బెంగాల్లో అధికార టీఎంసీ మెడకు చుట్టుకుంటోంది.
తనను తాను ‘బేతాజ్ బాద్షా’గా ప్రకటించుకున్న షేక్ షాజహాన్ సందేశ్ ఖలిలో పాల్పడని అక్రమాలు లేవు. వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం స్కామ్ లో తన ఇంటిని సోదా చేయడానికి వచ్చిన ఈడీ అధికారులపై తను పెంచిపోషించిన అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. ఇక్కడే అతడి తలరాత అడ్డం తిరిగింది.
బంగ్లాదేశ్ నుంచి బిహార్ వరకూ.. వయా నాగాలాండ్
షేక్ షాజహాన్ తన అక్రమాలకు కేవలం సందేశ్ ఖాలీ వరకే పరిమితం చేయలేదు. బంగ్లాదేశ్ నుంచి బిహార్ లో తయారయ్యే అక్రమ ఆయుధాల రవాణా వరకూ ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నాగాలాండ్ లో భారత వ్యతిరేక గ్రూపులతో సత్సంబంధాలు నెరపుతున్నాడు. వారి వద్ద నుంచి అనేక ఆయుధాలు కొనుగోలు చేయడం, అందులో విదేశీ తయారీ ఆయుధాలు ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. రెండు చేతులతో కాల్చగల నైపుణ్యం షాజహాన్ కు ఉందని తెలుస్తోంది. చట్ట విరుద్దంగా సంపాదించిన అక్రమ ఆయుధాలతో ఒక ప్రైవేట్ ఆర్మీని నెలకొల్పాడని ఒక పరిశోధకుడు ఫెడరల్ కు చెప్పాడు. వారు బహిరంగంగా తుఫాకులు పట్టుకుని ద్వీపాన్ని ఆక్రమించుకున్నారు. టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన తరువాత విచారణ చేస్తున్న పోలీసులకు ఈ సంఘటనలకు సంబంధించిన పలు ఆధారాలు లభించాయి. నాగాలాండ్ లోని దిమాపూర్, బిహార్ లోని పలు నెట్ వర్క్ ల్లో అతని పేరు బయటపడింది.
దిమాపూర్ లోని ఓ ఇంటి అడ్రస్ ఆధారంగా షాజహాన్ నకిలీ ఆయుధాలను సేకరించేవాడని పోలీసులకు తెలిసింది. వీటిని అక్కడి నుంచి వయా బంగ్లాదేశ్ నుంచి తన అడ్డా అయిన సందేశ్ ఖలికి చేర్చేవాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
రేషన్ బియ్యం స్కామ్ ను విచారిస్తున్న ఈడీ అధికారులు షాజహాన్ ఆస్తులు కొన్ని బంగ్లాదేశ్ లో ఉన్నట్లు గుర్తించారు. బెంగాల్ లోని ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న రూ. 12 కోట్లు ఆస్తులను ఈ మధ్య అటాచ్ చేశారు. అలాగే ఖరీదైన కార్లు, బైక్ లు అతడి సొంతం. బంగ్లాదేశ్ లోని గార్మెంట్స్, రియల్ ఎస్టేట్ లో కూడా ఇక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బును అక్కడ పెట్టుబడిగా మార్చేశాడు.
సీపీఎం నుంచి టీఎంసీ దాకా..
ఉత్తర 24 పరగణా జిల్లాలోని సందేశ్ ఖాలీ, సర్బేరియా మధ్య నడిచే ప్రయాణా వాహానాల్లో క్లీనర్ గా షాజహాన్ తన జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత చేపల వ్యాపారంలోకి దిగి సీపీఎం ఎమ్మెల్యేకి దగ్గరయ్యాడు. ఇక అప్పటి నుంచి ఇక షాజహాన్ అక్రమాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. సందేశ్ ఖాలీ ప్రాంతంలో ఇటుక బట్టీలు, చేపలు, రొయ్యల మార్కెట్ లను నియంత్రించి పెద్ద దాదాగా అవతరించాడు. తరువాత టీఎంసీ అధికారంలోకి రావడంతో జ్యోతిప్రియో మల్లిక్ కింద చేరాడు. తరువాత అతడికి, అక్రమాలకు చట్టం నుంచి రక్షణ లభించింది.
2019 లో లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీకి ప్రచారం చేస్తున్నారనే నెపంతో ఇద్దరిని సజీవదహనం చేసిన కేసుల్లో ప్రధాన ఆరోపణలు షేక్ షాజహాన్ మీదే ఉన్నాయి. ఇంతేకాకుండా కొన్ని సంవత్సరాల క్రితం విద్యుత్ అధికారులపై దాడి చేసి తప్పించుకున్నాడు.



అయితే చేసిన పాపం ఎక్కువ రోజులు విడిచిపెట్టలేదు. ఈడీ అధికారులపై దాడి చేసిన తరువాత అండర్ గ్రౌండ్ లోని వెళ్లిపోయాడు. ఇదే సమయంలో తమపై జరిగిన అత్యాచారాలను మహిళలు బహిరంగంగా చెప్పడం ప్రారంభించారు. చీమల దండు మొత్తం ఏకమై పాముని చుట్టుముట్టినట్లు మహిళలు అంతా ఏకమై భారీ ఉద్యమం చేయడంతో సందేశ్ ఖాలీలో పరిస్థితులు అన్నీ అదుపుతప్పాయి.
పార్టీ సమావేశాలకు మహిళలను పంపాల్సిందిగా వేధించడం, వారు వచ్చాక ఎప్పుడో కానీ ఇంటికి తిరిగి పంపడం, భూ కబ్జాలు ఇలా చేసిన అక్రమాలన్నీ బయటపడ్డాయి. చివరకు ఇవన్నీ టీఎంసీ మెడకు చుట్టుకోవడం, ఇది ఎన్నికల సమయం కావడంతో పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే 55 రోజుల పాటు షాజహాన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.
షాజహాన్ రాజకీయ పలుకుబడి ఈడీపై దాడి చేసిన కేసు దర్యాప్తు ను ప్రభావితం చేస్తుందని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తరువాత ఇదీ కేంద్ర విచారణ సంస్థలు, రాష్ట్ర సంస్థలకు మధ్య వివాదం గా మారుతుందని అందువల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని కూడా కలకత్త హైకోర్టును ఈడీ అభ్యర్థించింది. దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై బెంగాల్ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆదేశించింది.


Read More
Next Story