టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్: కోల్ కతాలో ‘ఈడీ’ దాడులు
బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయాన్నే ఈడీ సోదాలు నిర్వహించింది. బెంగాల్ లో జరిగిన టీచర్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న..
బెంగాల్ లో వెలుగుచూస్తున్న కుంభకోణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే శారదా స్కామ్, రేషన్ బియ్యం స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న ఈడీ తాజాగా టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ పై కూడా దృష్టి సారించింది. బెంగాల్ రాజధాని లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు.
కోల్ కతను ఆనుకుని ఉన్న న్యూ టౌన్ లోని పాతర్ ఘాటా మజార్ షరీఫ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒ టీచర్, అరెస్ట్ అయిన రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీకి సన్నిహితుడిగా తేలింది. ఈ టీచర్ ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందం సోదాలు నిర్వహించింది. అలాగే నగరంలోని ఉత్తర భాగంలో కల నాగర్ బజార్ లో ప్రాంతంలో నివాసం ఉన్న ఓ అకౌంటెంట్ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
రాజర్ హాట్ ప్రాంతంలో నివాసం ఉన్న పలు వ్యాపారుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. వీరికి ఈ కుంభకుణంలో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈ సోదాలు జరిగాయి. వీరితో పాటు మరికొందరు వ్యాపారులు, టీచర్లు, దళారుల ఇళ్లలో కూడా ఈడీ శుక్రవారం సోదాలు జరిపి కీలక పత్రాలు సేకరించింది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి ఈడీ ప్రయత్నిస్తోంది.
Next Story