‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అంటే ఏమిటి?,  మమతా దీదీ హెచ్చరిక
x
మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అంటే ఏమిటి?, మమతా దీదీ హెచ్చరిక

దేశమంతా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం అనే ప్రతిపాదనలో దేశాన్ని నియంతృత్వం కిందకి తీసుకురావాలనే లక్ష్యం కనిపిస్తోందని టీఎంసీ అభిప్రాయపడింది.


ఒకే దేశం- ఒకే ఎన్నికలు( వన్ నేషన్- వన్ ఎలక్షన్) కింద భారత దేశాన్ని ఏకపార్టీ నియంతృత్వం కింద తీసుకురావాలనే లక్ష్యం ఉందని, దానిని మేము వ్యతిరేకిస్తున్నామని టీఎంసీ వెల్లడించింది. భవిష్యత్ లో దేశాన్ని డిక్టేటర్ షిప్ కిందకి మార్చాలనే రహస్య ఎజెండా ఈ ప్రతిపాదనలో ఉందని టీఎంసీ ప్రతినిధి బృందం పేర్కొంది.

‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీని సుదీప్ బందోపాధ్యాయ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ బృందం కలిసి తమ పార్టీ వైఖరిని వెల్లడించింది. ప్యానెల్ కు తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రాసిన లేఖను అందజేసినట్లు వారు మీడియాకు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలనే విధానాన్ని తమ పార్టీ అంగీకరించట్లేదనే విషయాన్ని కమిటీకి వివరించినట్లు తెలిపారు.

"మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీని కలిశాం. మా అధినేత్రి మమతా బెనర్జీ రాసిన లేఖను అందించాము. ఒకే దేశం- ఒకే ఎన్నికలు అనే ఆలోచనను మేం వ్యతిరేకిస్తున్నామనే విషయాన్ని కమిటీకి వివరించాం.. ఆ ఆలోచన వెనక రహస్య లక్ష్యం ఉంది. భవిష్యత్ భారత్ లో ప్రజాస్వామ్యం తీసివేసి నియంతృత్వాన్ని తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ వన్ నేషన్- వన్ ఎలక్షన్ తీసుకువచ్చారు " అని కమిటీని కలిసిన అనంతరం టీఎంసీ బృంద సభ్యుడు కళ్యాన్ బెనర్జీ అన్నారు.

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక భావనలను ఈ వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. " ఇంతకుముందు దేశంలో రాజకీయాలు చేసేందుకు రెండు పెద్ద జాతీయ పార్టీలు ఉండేవి. కాలక్రమేణా వాటి స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు ఆక్రమించాయి.

కేంద్ర ప్రభుత్వాన్ని ఐదేళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలను సైతం అదే ఐదు సంవత్సరాలకు ప్రజలు ఎన్నుకుంటారు. ఇదే రాజ్యాంగ లక్ష్యం. దీనిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు" అని బెనర్జీ విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహించి ప్రజాశక్తిని, తీర్పును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీ బృందం ఆరోపించింది.

" ఒక రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందనుకుందాం.. అలాంటి సమయంలో మిగిలిన కాలానికి పరిష్కారం ఏంటీ? రాష్ట్రపతి పాలన విధిస్తారా మిగిలిన కాలానికి? ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పని కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రజల తీర్పును ఎలా వాయిదా వేస్తారు? ఇదీ నిజంగా సమాఖ్య వ్యవస్థను కాలరాయడమే అవుతుంది" అని కళ్యాణ్ బెనర్జీ అన్నారు.

కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి వ్యతిరేకంగానే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వివరించారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత నెలలో వన్ నేషన్- వన్ నేషన్ అనే అంశంపై ఏర్పాటు అయిన కమిటీకి లేఖ రాశారు. ఈ అంశంపై మేము మీతో ఏకీభవించడంలేదు అని అందులో పేర్కొన్నారు.

" మీ అభిప్రాయాలు, సూత్రీకరణలకు మేము వ్యతిరేకం. దేశమంతా ఒకే ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనలను మేము ఆమోదించలేము" అని అందులో వెల్లడించారు. వన్ నేషన్ అనే భావన ఎక్కడి నుంచి తీసుకున్నారు. దాని అర్థం ఏమిటీ అని ప్రశ్నించారు. మీరు దీనికి సరైన అర్థం, భావం వివరించపోతే దానిపై ఎలాంటి ధృడ నిర్ణయం తీసుకోలేమని అందులో చెప్పారు.

Read More
Next Story