కోల్ కతాలో  ‘షాజహాన్ షేక్’  తకరారు ఏంది?
x

కోల్ కతాలో ‘షాజహాన్ షేక్’ తకరారు ఏంది?

ఈడీ అధికారులపై దాడులకు పాల్పడిన షేక్ షాజహన్ ను సీబీఐకి అప్పగించాల్సి హైకోర్టు తీర్పు చెప్పింది.షాజహన్ ఇన్ని రోజులు " లౌకిక రక్షణ"లో ఉన్నాడని బీజేపీ విమర్శించింది.


టీఎంసీ బహిష్కృత నాయకుడు, రేషన్ బియ్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు, సందేశ్ ఖలిలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాలకు పాల్పడి, ఈడీ అధికారులపై దాడి చేసిన ప్రధాన నిందితుడు, ప్రస్తుతం బెంగాల్ పోలీసు అధికారుల వద్ద ఉన్న షేక్ షాజహాన్ సీబీఐ అధికారులకు అప్పగించాలని మంగళవారం కోల్ కతా హైకోర్టు ఆదేశించింది.

పశ్చిమ బెంగాల్ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించింది.
దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా కేసును జాప్యం చేస్తున్నారని మండిపడింది. కేసును సీబీఐకి అప్పగించాలని ఈడీ చేసిన అభ్యర్థన సబబుగానే ఉందని మంగళవారం కేసు విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయ పడింది.
ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన షేక్ షాజహాన్ ను వెంటనే సీబీఐ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 4.30 నిమిషాల లోపు తమ ఆదేశాలను పాటించాలని హైకోర్టు ఆదేశించిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు తరువాత భవానీ నగర్ లోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే రాత్రి 7.30 వరకూ వేచి ఉన్న సీఐడీ అదుపులో ఉన్న షాజహాన్ షేక్ ను సీబీఐకి అప్పగించలేదు. బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందువల్ల తాము సీబీఐకి నిందితుడిని అప్పగించలేదని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు.
అయితే సాయంత్రం కోర్టు ఆదేశాలను బెంగాల్ ప్రభుత్వం పాటించలేదని ఈడీ తిరిగి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చింది. బుధవారం ఉదయం కోర్టు ముందు మరో దరఖాస్తు ఇవ్వాలని ఈడీ న్యాయవాదీకి ప్రధాన న్యాయమూర్తీ సూచించారు.
హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును అత్యవసరంగా విచారించాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ ముందు ప్రస్తావించాలని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదీకి సమాధాన మిచ్చింది.
కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నాయంటే..
వేలకోట్ల రూపాయల రేషన్ బియ్యం స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన బెంగాల్ మాజీ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ తో షేక్ షాజహన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ గుర్తించింది. సందేశ్ ఖాలీలో ఉన్న అతని ఇంటిని సోదా చేయడానికి జనవరి 5న ఈడీ అధికారులు వెళ్లగా దాదాపు 1000 మంది గుంపు ఈడీ అధికారులపైకి దాడికి పాల్పడింది. ఇందులో నలుగురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి.
తమ అధికారులపై దాడులకు పాల్పడిన సంఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ సీబీఐ దర్యాప్తుతో పాటు రాష్ట్ర పోలీసులతో కూడిన ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై ఈడీ, బెంగాల్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు కేసు దాఖలు చేశాయి. మంగళవారం కేసును ప్రధాన న్యాయమూర్తి తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
అనంతరం ప్రధాన న్యాయమూర్తి " సీబీఐ దర్యాప్తుకు ఇంతకమంటే మెరుగైన కేసు ఉండదు. " ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞాన్ వ్యాఖ్యానించారు. సాయంత్రం 4.30 లోపు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని తీర్పుచెప్పారు.
ఈడీ వాదన
షాజహాన్ షేక్ పై ఇప్పటికే 40 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అయినప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగానే ఫిబ్రవరి 29 న బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. ఇప్పటికే ఈడీపై దాడులపై పాల్పడిన కేసుతో పాటు సందేశ్ ఖలిలో మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణలు అతడిపై ఉన్నాయని వివరించింది.
అరెస్ట్ చేసింది కేవలం దర్యాప్తును ప్రభావితం చేసేందుకు వాడుకుంటున్నారని ఈడీ బలమైన వాదనలు వినిపించింది. దీంతో సిట్ ఏర్పాటు చేయాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలువరించడంతో పాటు సీబీఐకీ కేసు అప్పగించాలని, కేసు విచారిస్తున్న బెంగాల్ సీఐడీ సైతం దర్యాప్తు చేయకుండా కోర్టు మంగళవారం ఆదేశించింది.
నిందితుడు దాదాపు 50 రోజుల పాటు కనిపించకుండా పోయాడని, నిందితుడిని రక్షించడానికి బెంగాల్ పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఉద్దేశం కనిపిస్తోందన్న ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. షాజహాన్ కు ఉత్తర పరగణా జిల్లా పరిషత్ కు టీఎంసీ టికెట్ పై కర్మధాక్ష్యగా ఎన్నిక అవడమే కాకుండా అధికార పార్టీతో బలమైన నేతలతో సంబంధాలు ఉన్నాయని కూడా కోర్టు పేర్కొంది.
కాగా కలకత్త హైకోర్టు తీర్పు పై బెంగాల్ బీజేపీ శాఖ హర్షం వ్యక్తం చేసింది. సత్యమేవ జయతే అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. బెంగాల్ ప్రభుత్వం షాజహాన్ ను రక్షించేందుకు విఫలయత్నం చేస్తోందని విమర్శించారు. ఇన్ని రోజులు అతడికి మద్ధతుగా నిలిచిన సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు పార్టీ నుంచే తొలగించే బూటకపు చర్యకు దిగారని ఆయన మండిపడ్డారు. భూ కబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అతడు 50 రోజలు పాటు " లౌకిక పరిరక్షణలో ఉన్నాడు" అని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన..
ఈ కేసు ఇలా ఉండగా సందేశ్ ఖాలిలో పర్యటించిన జాతీయ మహిళా కమిషన్ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశ మయ్యారు. సందేశ్ ఖలిలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలను రక్షించడంలో అధికార యంత్రాంగం విఫలమయిందని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు.
బాధితులను రక్షించడానికి స్థానిక యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుందో మహిళా కమిషన్ వివరాలు సేకరించిందని, ఇందులో దిగ్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని ఒక నిజ నిర్థారణ నివేదిక ను సైతం కమిషన్ సిద్దం చేసింది. ఇంతకు ముందు బెంగాల్ లో పర్యటించిన షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ను సిఫార్సు చేసింది.
" సందేశ్ ఖలి సంఘటన ఒకటి కాదు. గతంలో రాష్ట్రంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే రాష్ట్రపతి పాలన ను సిఫార్సు చేశాం" అని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని చైర్మన్ రేఖా శర్మ తెలిపారు.
Read More
Next Story