సుప్రీంకోర్టు గడువు విధించిన బెంగాల్ లో పూర్తికానీ ‘సర్’
x

సుప్రీంకోర్టు గడువు విధించిన బెంగాల్ లో పూర్తికానీ ‘సర్’

శనివారంతో పూర్తయిన డెడ్ లైన్


కొన్ని నెలలుగా సర్ లేదా ఎస్ఐఆర్ పై జరుగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువును ఎన్నికల సంఘం పూర్తి చేయలేకపోయింది. బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ) లకు సకాలంలో అవసరమైన సాప్ట్ వేర్ ను ఈసీ అందించకపోవడంతో ఓటర్ల జాబితాను ప్రచురించలేకపోయింది. బెంగాల్ ఓటర్ల జాబితాను ప్రచురించడానికి శనివారం చివరి గడువుగా సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ గడువు నేటితో ముగిసిపోయింది.

జనవరి 19న పేర్ల వ్యత్యాసాలు, జాబితాలో ఉన్న పేర్లు, మ్యాప్ చేయని ఓటర్ల పంచాయతీ, బ్లాక్ కార్యాలయాలలో ప్రదర్శించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
‘‘శుక్రవారం రాత్రి వరకూ సాప్ట్ వేర్ అందలేదు. చివరిక్షణంలో సాప్ట్ వేర్ మాకు చేరినా కొన్ని గంటల్లోనే భారీ మొత్తంలో ఉన్న డేటాను డౌన్ లోడ్ చేయడం, ప్రింట్ చేయడం, ప్రదర్శించడం సవాల్ గా ఉంది’’ అని పశ్చిమ బెంగాల్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఒక అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.
‘‘బీఎల్ఓలు ఇప్పటికే ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. లాజిస్టిక్ గా ఇది ఒక పెద్ద సవాలు’’ అని ఆయన అన్నారు.
సవాళ్లు..
ఈసీ ప్రచురించబడే జాబితాలో డేటా వ్యత్యాసాలు ఉన్న పేర్లతో పాటు మ్యాప్ చేయని ఓటర్లు ఉంటారు. ఈ జాబితా మొత్తంగా 1.26 కోట్లుగా ఉంది. చివరి రోజు ఆదేశాలు ఇవ్వడంలో గందరగోళం నెలకొందని అధికారులు వెల్లడించారు.
‘‘డేటా ఉంది కానీ క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేసేది బీఎల్ఓలు’’ అని మరొక అధికారి చెప్పారు. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాలు ఇప్పుడు అమలు చేయడం ఇఫ్పుడు సాధ్యం కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.
అన్ మ్యాప్డ్ గా వర్గీకరించబడిన 3 లక్షలకు పైగా ఓటర్ల నోటీసులు అందజేసినప్పటికీ విచారణలకు హాజరుకాలేదని జాతీయ మీడియా ఒక అధికారిని ఉటంకిస్తూ నివేదించింది.
‘‘మ్యాప్డ్ చేయని ఓటర్లలో దాదాపు పదిశాతం మంది విచారణకు హాజరుకాలేదు’’ అని ఆయన అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో 294 మంది అదనపు సీనియర్ మైక్రో అబ్జర్వర్లను నియమించాలని ఈసీ నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు. ‘‘పెండింగ్ లో ఉన్న కేసులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడమే లక్ష్యం’’ అని ఆయన అన్నారు.
డేటాలో తేడాలు..
రాష్ట్రంలో ఓటర్లకు మొత్తం 7.62 కోట్ల గణన ఫారాలను పంపిణీ చేశారు. డిసెంబర్ 16న ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఇందులో మరణాలు, బదిలీలు, ఎంట్రీలలో నకిలీ కారణంగా 58 లక్షలకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. బెంగాల్ లో చివరిగా 2002 లో జరిగిన ఓటర్ల జాబితాను సవరించారు. వాటితో ఇప్పుడున్న వాటితో సరిపోలని వారికి హియరింగ్ నోటీసులు జారీ చేశారు.
‘‘తార్కిక వ్యత్యాసాలలో తండ్రుల పేర్లు తప్పు లేదా సరిపోలకపోవడం, ఆరుగురు పిల్లల కంటే ఉన్న ఓటర్లు, తల్లిదండ్రులు లేదా తాతామామలతో ఉన్న వయస్సు వ్యత్యాసాలు, 45 ఏళ్లుగా ఉన్నవారిని కొత్త ఓటర్లుగా చూపించడం వంటివి ఉన్నాయని తెలిపారు. విచారణలు ఫిబ్రవరి 7న ముగిసిపోనున్నాయి. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 14న ప్రచురించనున్నారు. అయితే గడువు పొడిగించవచ్చని ఈసీ సూచించింది.


Read More
Next Story