సీబీఐపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఎంసీ, ఎందుకంటే..
సందేశ్ కాళీలో సీబీఐ దాడులు నిర్వహించడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ రైడ్ చేయడం అంటే తమపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడమేనని..
సార్వత్రిక ఎన్నికల వేళ బెంగాల్ లో ఫిర్యాదుల రాజకీయాలు నడుస్తున్నాయి. సందేశ్ కాళీలోని ఓ ఖాళీ ప్రదేశంలో సీబీఐ అధికారులు దర్యాప్తు అంటూ హడావుడి సృష్టించారని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన దర్యాప్తు అని ఫిర్యాదులో ఆరోపించింది.
సీబీఐ శోధనలో తుఫాకులు లభ్యం
మహిళలపై లైంగిక వేధింపులు, భూకజ్జాలు, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ షేక్ ప్రధాన అనుచరుడికి సంబంధించిన ఖాళీ జాగాలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది. భూమిలో పాతిన నాటు తుఫాకులు, భారీ మందుగుండు సామగ్రితో పాటు విదేశీ తుఫాకులు సైతం ఇక్కడ లభించాయి.
వీటిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) మీడియాకు విడుదల చేసింది. ఈ దాడుల సందర్భంగా సీబీఐ ఉగ్రవాదులను ఏరివేయడానికి ఉపయోగించే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ( ఎన్ఎస్జీ) కమాండోలను మోహరించాయి. ఇంతకుముందు సందేశ్ కాళీలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బియ్యం కుంభకోణం సందర్భంగా షేక్ షాజహాన్ ఇంటిలో సోదాలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి అల్లరి మూక వారిపై దాడి చేసింది. ఇందులో పలువురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
టీఎంసీ లేఖ
అయితే రెండో దశ ఎన్నికల వేళ రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేయడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కావాలనే కేంద్ర దర్యాప్తు సంస్థలు, సందేశ్ కాళీలో అలజడులు సృష్టించాలని చూస్తున్నాయని లేఖలో ఆరోపించింది. ఆ లేఖను మీడియాకు విడుదల చేసింది. సీబీఐ కావాలనే ఎన్ఎస్ జీ కమాండోలు, బాంబు స్క్వాడ్ లను అక్కడికి పిలిపించిందని విమర్శించింది. అయితే అదంతా ఖాళీ ప్రదేశమని ఆరోపించింది.
పోలీసులకు 'నోటీస్' ఇవ్వలేదు
"లా అండ్ ఆర్డర్" పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, అయితే సీబీఐ రైడ్ జరగడాని కంటే ముందు రాష్ట్ర పోలీసులకు ఎటువంటి నోటీస్ అందించలేదని టీఎంసీ, ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో విమర్శించింది. పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులో కూడా బాంబు స్క్వాడ్ ఉందని, మీకు అవసరమని అనిపిస్తే మాకు సమాచారం అందించాలని, అవసరమైన మేర సాయం చేయగలమని లేఖలో టీఎంసీ వెల్లడించింది. అయితే మా పోలీస్ శాఖకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ దాడుల విషయం మాత్రం దేశ వ్యాప్తంగా సంచలన వార్తలుగా మారాయని ఆరోపించింది.
అవి నిజంగా దొరికాయా? టీఎంసీ అనుమానాలు
" సందేశ్ కాళీలో ఆ ఆయుధాలు నిజంగా దొరికాయా? లేదా సీబీఐ, ఎన్ ఎస్ జీ కమాండో వాటిని ఎవరూ చూడకముందు అమర్చారా" అని టీఎంసీ లేఖలో అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో TMC అభ్యర్థులపై దేశవ్యాప్త ద్వేషాన్ని సృష్టించడానికి CBI చేసిన ప్రయత్నమని ఆ పార్టీ ఆరోపించింది, అదే సమయంలో ఆ స్థలం పార్టీకి చెందిన ఒక మద్దతుదారుడికి చెందింది కాదని సమర్థించుకుంది. సీబీఐ దాడుల సందర్భంగా తమ ప్రభుత్వానికి చెందిన ఒకరిని కూడా అక్కడ లేరని, అందుకే వీటిని తాము నమ్మమని టీఎంసీ ప్రకటించింది.
Next Story