’మేం ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, కూటమితో సంబంధం లేదు‘
x
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

’మేం ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, కూటమితో సంబంధం లేదు‘

ఇండియా కూటమితో సంబంధం లేదని టీఎంసీ ప్రకటించింది. మొత్తం 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు వెల్లడించింది.


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎటువంటి పొత్తులు ఉండవని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో ఎనిమిదిమంది సిట్టింగ్ లకు టికెట్ నిరాకరించిన టీఎంసీ, కొత్తవారికి చోటు కల్పించింది. దీంతో కాంగ్రెస్ ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ తో పొత్తులు కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. తమకు కనీసం ఆరు నుంచి ఎనిమిది స్థానాలు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుండగా, అందుకు మమతా బెనర్జీ అంగీకరించలేదు.

యూసఫ్ వర్సెస్ అధిర్?
టిఎంసి తొలిజాబితాలో 16 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇచ్చింది. ఇందులో 12 మంది మహిళలను రంగంలోకి దించింది. కొత్త ముఖాల్లో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ , బహరంపూర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేయనున్నారు, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, అతను వరుసగా ఐదుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్నాడు.
మరో మాజీ క్రికెటర్, కృతి ఆజాద్, బర్ధమాన్-దుర్గాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లావాలియా ఉన్నారు. వివాదస్పద ఎంపీ, ప్రస్తుత లోక్ సభ ఎంపీ నుంచి తొలగించబడిన మహూవా మొయిత్రాకి సైతం టీఎంసీ మరోసారి టికెట్ కేటాయించింది. లోక్ సభ లో ప్రశ్నలు అడగడానికి పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు తీసుకున్నారని లోక్ సభ విచారణ కమిటీ నిర్ధారించింది.
ఈమె కృష్ణా నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. అలాగే మరో వివాదస్పద ఎంపీ నుస్రత్ జహాన్ ను టీఎంసీ టికెట్ నిరాకరించింది. ఈమెది బసిర్ హత్ స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలుపొందారు. ఈ స్థానం సందేశ్ ఖాలి ప్రాంతంలో ఒక భాగంగా ఉంది. ఇక్కడ టీఎంసీ మాజీ నాయకుడు, భూ కబ్జాదారుడు అయిన షేక్ షాజహాన్ మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకుముందు ఇక్కడి నుంచి 2009-14 కాలంలో ఎంపీగా ఉన్న హాజీ నూరుల్ ఇస్లామ్‌కు మళ్లీ టీఎంసీ టికెట్ ఇచ్చింది.
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరాడా గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన టిఎంసి మెగా ర్యాలీ లో ఈ జాబితాను టీఎంసీ ప్రకటించింది. మొత్తం 42 స్థానాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
కాంగ్రెస్ స్పందన
టీఎంసీ ప్రకటనపై కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తన అసంతృప్తిని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

"పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్ కలిసి బీజేపీతో పోరాడాలని కోరుకుంటోంది. అందుకోసం గౌరవ ప్రదమైన స్థానాలు కావాలని కాంగ్రెస్ పదేపదే కోరింది. ఏదైన ఒప్పందాన్ని చర్చల ద్వారానే ఖరారు చేయాలి కానీ, ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదు” అని ఆయన ట్వీట్ చేశారు.
"తలుపులు తెరిచి ఉన్నాయి"
నామినేషన్ల ఉపసంహరణ వరకు పొత్తు కోసం ‘తలుపులు తెరిచే ఉంటాయని’ కాంగ్రెస్‌ చెబుతోంది. "మా తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి , నామినేషన్ల ఉపసంహరణకు ముందు ఎప్పుడైనా కూటమి ఏర్పడవచ్చు" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
అయితే క్షేత్ర స్థాయిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్, టిఎంసి నాయకులు మాత్రం మాటల యుద్దం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కు రెండుసీట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని టీఎంసీ చెబుతుండగా, ఆరు నుంచి ఎనిమిది కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. దీనితో టీఎంసీ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు బహరంపూర్ నుంచి అధిర్ రంజన్ చౌదరీ, మాల్డా సౌత్ నుంచి అబూ హుస్సేన్ ఖాన్ గెలుపొందారు.
Read More
Next Story