బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేస్తాం: మమతా బెనర్జీ
x
మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేస్తాం: మమతా బెనర్జీ

ఎన్నికలకు ముందు ‘ఇండియా’ కూటమికి బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమత బెనర్జీ షాక్ ఇచ్చారు.


తాము వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లోని 42 లోక్ సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించారు. బుధవారం బుర్ద్వాన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ చేస్తున్నసీట్ల బెదిరింపులకు మేము లొంగేదీ లేదని అన్నారు. "వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మనం ఒంటరిగా నే బరిలోకి దిగుదాం. మన సత్తా చూపిద్దాం" అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. "సీట్ షేరింగ్ నాతో ఎవరూ మాట్లాడలేదు. నా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. ప్రారంభంలోనే తిరస్కరించారు " అని సమావేశంలో మమతా బెనర్జీ అన్నారు.

మంగళవారం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహూల్ గాంధీ మాట్లాడుతూ.. తాము మమతా బెనర్జీతో కలిసి బెంగాల్ లో పోటీ చేస్తామని ప్రకటించారు. మా మధ్య చర్చలలో ఎలాంటి అవాంతరాలు లేవని చెప్పారు. " మమతా జీతో నాకు మంచి అనుబంధం ఉంది. కొన్ని సార్లు రెండు పార్టీలకు చెందిన నాయకులు కొన్ని కొన్ని అసమ్మతి వ్యాఖ్యలు చేస్తారు. అయితే ఇలాంటివి మా మధ్య దూరాన్ని పెంచలేవు " అని రాహూల్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనకు విరుద్దంగా మమతా బెనర్జీ మరునాడే మొత్తం అన్ని సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తున్నామని ప్రకటించారు.

కాంగ్రెస్ బెంగాల్ లో కనీసం 8-14 సీట్లు కావాలని టీఎంసీతో బేరసారాలు చేస్తోంది. ఇంతకుముందు 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం రెండు సీట్లు (బహరంపూర్, మల్దహ సౌత్ ) మాత్రమే గెలుచుకుంది. తరువాత 2021 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. రోజురోజుకీ దానికి ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గాలన్నీదూరం జరుగుతున్నాయి.

ముఖ్యంగా మైనారిటీ ఓట్ల శాతంలో గణనీయమైన తగ్గుదల బెంగాల్ వ్యాప్తంగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఏకంగా డబుల్ డిజిట్ సీట్లను ఆశించడం బెంగాల్ సీఎంకు ఆగ్రహం కలిగించి ఉంటుంది. తాము కూడా కేవలం రెండే సీట్లు ఇస్తామని ఇంతకుముందు కూడా ఆమె ప్రకటించారు. తన మాట వినకుంటే ఇండియా కూటమిలో ఉండేది లేదని ముందస్తుగా ఆమె ఈ ఎత్తు వేశారు.

లోక్ సభ లో కాంగ్రెస్ పక్ష నాయకుడి గా ఉన్న అధిర్ రంజన్ చౌధరి నేతృత్వంలోని బెంగాల్ పీసీసీ కమిటీ, టీఎంసీతో చర్చలను ముందుకు జరగకుండా ఉండేందుకు ఈ విధంగా డబుల్ డిజిట్ స్థానాలు కావాలని షరతు పెట్టారని టీఎంసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చౌధరి వర్గంలోని నాయకులు టీఎంసీతో కాకుండా, లెప్ట్ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటున్నారు. చౌధరికి, టీఎంసీకి ఎప్పుడు సఖ్యత కుదరదు. ఆయన ఎప్పుడు లెప్ట్ పార్టీలతో అవగాహన కుదుర్చుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట.

" బంతి ఇప్పుడు కాంగ్రెస్ కోర్టులో ఉందని, బెంగాల్ లో కాంగ్రెస్ తమ స్థాయికి తగ్గ డిమాండ్ తో వస్తే బాగుంటుందని" ఒక టీఎంసీ నాయకుడు ఫెడరల్ తో అన్నారు. " కాంగ్రెస్, సీపీఎం తో కూడా పొత్తు కుదుర్చుకోకూడదు. దానిని మా భుజాలపై మోయం, ఇక్కడ కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ బిడ్డింగ్ చేస్తోంది" అని ఒక టీఎంసీ ఎంపీ ఫెడరల్ తో చెప్పారు.

అయితే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాత్రం బెంగాల్ లో పొత్తు పెట్టుకుంటే మిగిలిన రాష్ట్రాలలో మైనారిటీ ఓట్ల పరిస్థితిలో పరిస్థితి ఆశాజనంగా ఉంటుందని భావిస్తోంది. అందుకే పొత్తుపై ఇంకా మంతనాలు సాగిస్తూనే ఉందని తెలుస్తోంది. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలలాగే, కమ్యూనిస్టులు కూడా ఒకరని, దాని వల్ల టీఎంసీకీ ఎలాంటి నష్టం ఉండదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాట. దీనిని వారు ఎంతవరకూ విశ్వసిస్తారో చూడాలి.

Read More
Next Story