మరాఠాలు ‘ఓబీసీ’ హోదాను పొందుతారా?
x
మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలు

మరాఠాలు ‘ఓబీసీ’ హోదాను పొందుతారా?

ఐదో రోజుకు చేరిన మనోజ్ జరంగే నిరాహార దీక్ష


మహారాష్ట్రలో మరోసారి రిజర్వేషన్ అగ్గి రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరాఠా సామాజిక వర్గానికి పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో మనోజో జరాంగే చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారానికి ఐదో రోజుకు చేరింది. దీంతో ఆయన తాగు నీరును నిలిపివేశారు.

మరాఠాలను ఓబీసీలుగా మార్చడంతో పాటు వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రధాన డిమాండ్ గా ఉంది. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని ప్రతిజ్ఞ చేశాడు.

ఈ అంశం పై మహా సర్కార్ సైతం స్పందించింది. మంత్రి రాధాకృష్ణ పాటిల్ మాట్లాడుతూ.. మరాఠా రిజర్వేషన్ సమస్యపై కేబినేట్ సబ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న పాటిల్ ఆదివారం సీఎం ఫడ్నవీస్ కలిసి మాట్లాడారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి సమయం పడుతుంది. కానీ పరిష్కారం అనేది కోర్టులలో నిలబడాలి’’ అని సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

మరాఠాలదే ఆధిపత్యం..

మహారాష్ట్ర జనాభాలో మరాఠా కమ్యూనిటీదే ఆధిపత్యం. వీరు రాష్ట్ర జనాభాలో 33 శాతం దాకా ఉంటారు. చారిత్రకంగా వీరంతా భూస్వాములు. ఇందులో కూడా అనేక ఉపకులాలు ఉన్నాయి. మరాఠా లోని క్షత్రియులను దేశ్ ముఖ్, భోంస్లే, మోర్, షిర్కే, జాదవ్ వంటి వర్గాలుగా పిలుస్తారు.
సాంప్రదాయకంగా చాలామంది వ్యవసాయం ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నవారంతా మరాఠీలు కాదు. మరాఠా అనేది భాష కాగా, మరాఠాలు కుల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు భారత్ లో అతిపెద్ద సమూహాలలో ఒకరిగా గుర్తింపు పొందారు.
రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో వీరి ప్రభావం గణనీయంగా ఉంది. మహారాష్ట్రలో 31 సంవత్సరాలు మరాఠా సీఎంలు రాజ్యమేలారు. అయితే చాలామంది మరాఠాలు కేవలం రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. కరువులు వారిని నిత్యం ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కష్టాలు మరాఠ రిజర్వేషన్ ఉద్యమానికి మరాఠ్వాడా ప్రాంతం కేంద్రంగా ఆవిర్భవించింది.
ఓబీసీ సర్టిఫికెట్ల పరిశీలన..
రాష్ట్ర ప్రభుత్వం మరాఠ్వాడాలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడానికి కుంబి సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా వారిని ఓబీసీ వర్గంలోకి సమర్థవంతంగా చేర్చే అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తోంది. అయితే మహారాష్ట్ర అంతటా ఉన్న మరాఠాలందరిని రిజర్వేషన్ చట్రంలోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. అప్పటి వరకూ ఉద్యమం ఆగేది లేదని జరంగే ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు.
ఐదు దశాబ్దాల పోరాటం.. తొలి మరణం..
రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేస్తున్న పోరాటం సుదీర్ఘమైనది. మొదటిసారిగా 1982 లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నిరసనలకు కార్మిక సంఘం నాయకుడు అన్నా సాహెబ్ పాటిల్ నాయకత్వం వహించాడు. కులం ఆధారంగా కాకుండా ఆర్థిక ప్రమాణాల ఆధారంగా కోటాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
తన విజ్ఞప్తిని విస్మరిస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ప్రభుత్వం ఆయన డిమాండ్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మరాఠా ఉద్యమంలో తొలి ఆత్మహత్య నమోదు అయింది. 1990 లో వచ్చిన మండల్ కమిషన్ తరువాత ఆర్థిక ఆధారిత ఉద్యమం కాస్త కుల ఆధారిత ఉద్యమంగా మారింది.
ఓబీసీ జాబితాలో..
2004 లో అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రభుత్వం మరాఠా కున్భీలు, కున్భీ- మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి అంగీకరించింది. కానీ ఇతర మరాఠాలను ఇందులో చేర్చడానికి నిరాకరించింది. కున్బీలు ఇప్పటికే బీసీ జాబితాలోకి చేర్చినందు వలన, మిగిలిన మరాఠాలను సైతం ఇదే జాబితాలోకి చేర్చాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
కానీ ఇతర ఓబీసీ వర్గాలు దీనిని వ్యతిరేకించాయి. 2014 లో ఏర్పాటు అయిన నారాయణ్ రాణే నేతృత్వంలోని కమిటీ మరాఠాలకు 16 శాతం కోటా, ముస్లింలకు 5 శాతం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం దీనిని అమలు చేయడానికి ప్రయత్నించగా, బాంబే హైకోర్టు వీటిని నిలిపివేసింది.
ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగాయి. 2016 లో మరాఠా కోటా ఉద్యమం తీవ్రంగా ప్రారంభం అయింది. 2018 లో హింసాత్మక ఘటనల వైపు వెళ్లింది. వీరి డిమాండ్లను వ్యతిరేకిస్తూ ఇతర వర్గాల నుంచి నిరసన ప్రదర్శనలు జరిగాయి.
మరాఠా వర్గం నుంచి ఒత్తిడి పెరగడంతో నవంబర్ 30, 2018న శివసేన- బీజేపీ ప్రభుత్వం విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించింది.
మరాఠా కోటాకు అడ్డు ఏమిటీ?
మరాఠాలకు రాజకీయంగా రిజర్వేషన్ మంజూరు అయినప్పటికీ చట్టపరంగా, న్యాయపరంగా పలు అవరోధాలు ఎదరవుతున్నాయి. ఈ విధాన్ని మొదట బాంబే హైకోర్టు లో సవాల్ చేశారు. ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తునే ఉద్యోగాలలో 16 నుంచి 13 శాతానికి, విద్యలో 12 శాతానికి తగ్గించింది.
తదనంతరం మరాఠా కోటాను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2021 లో రాజ్యాంగ ధర్మాసనం మరాఠాలకు కోటాను అందించేందుకు ప్రవేశపెట్టిన 2018 చట్టాన్ని కొట్టివేసింది. ఈ చట్టం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఉల్లంఘిస్తోందని తీర్పు నిచ్చింది.
‘‘2018 లో మహారాష్ట్ర చట్టం సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి చేస్తూ 1992 లో ఇచ్చిన తీర్పును మేము పరిశీలించము’’ అని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.
మరాఠా కోటా మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్లను 65 శాతానికి చేర్చిందని, పరిమితిన ఉల్లంఘించడం సరైన కారణం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు 1992 ఇంద్రసాహ్నీ కేసులో(మండల్ తీర్పుగా) 50 శాతం పరిమితిని నిర్ణయించింది. దీనితో మరోసారి జరంగే ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నాడు.
మరాఠా ఉద్యమాల ప్రభావంతో మహా సర్కార్ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని అత్యున్నత న్యాయస్థానం విచారించడానికి అంగీకరించింది. ప్రస్తుతం 50 శాతం సీలింగ్ అనేది మరాఠాలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అడ్డంకిగా మారింది.
ఎస్ఈబీసీ చట్టం అంటే ఏంటీ?
గత ఏడాది ఫిబ్రవరి 20, 2024న ఏక్ నాథ్ షిండే సర్కార్ ఎస్ఈబీసీ చట్టం ఆమోదించింది. ఇది రిటైర్డ్ జస్టిస్ సునీల్ శుక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ ఆధారంగా రూపొందించారు.
సుప్రీంకోర్టు నిర్ధేశించిన కోటాలపై 50 శాతం పరిమితిని ఉల్లంఘించినప్పటికీ అసాధారణ పరిస్థితులు మరాఠా సమాజానికి రిజర్వేషన్ ప్రయోజనాలు విస్తరించడాన్ని సమర్థిస్తాయని కమిషన్ తేల్చింది.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం సమ్మతం కాదని అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో మరాఠా సంస్థలు చట్టాన్ని సమర్థించడానికి పిటిషన్లు వేసింది. బాంబే హైకోర్టు వీటిని ఇప్పటికే విచారించడం ప్రారంభించింది. చట్టం కింద చేసే అడ్మిషన్లు, ఉద్యోగ నియమాకాలో పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అయితే ఇవి కోర్టు తుది తీర్పుకు లోబడి సాగుతాయి.
కీలక డిమాండ్లు.. మహా సర్కార్ స్పందన..
ప్రతి మరాఠాను కున్బీ వర్గానికి చెందిన వారిగా గుర్తించాలని జరాంగే పట్టుబడుతున్నారు. ఈ సంబంధాన్ని బలపరిచేందుకు ఆయన చారిత్రక ఆధారాలు, ముఖ్యంగా హైదరాబాద్, సతారా గెజిట్లను ఉదహరిస్తున్నారు.
ఇది మరాఠాలను ఓబీసీలుగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని వాదిస్తున్నారు. మరాఠాలందరికి కున్బీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని అందరికి అర్హత పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్ల ఆందోళనలో నమోదైన అన్ని కేసులు ఎత్తివేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వీరి డిమాండ్లను తిరస్కరించాడు. కున్భీలు ఇప్పటికే ఓబీసీలుగా ఉన్నారని, వీరిని అందులో చేర్చడం కష్టమని కూడా చెప్పారు.
మరాఠాలు, కున్భీలు ఒకటే అంటూ ప్రభుత్వానికి వినతులు వచ్చాయని కానీ అది చట్టపరంగా, రాజ్యాంగ పరంగా వీలుకాదని స్పష్టం చేశారు. ‘‘ఓబీసీలో ఇప్పటికే 350 సంఘాలు ఉన్నాయి. ఈ జాబితాలోకి మరాఠాలను చేర్చడం అంటే వారిని అన్యాయం చేసినట్లే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద లభించే ప్రయోజనాలతో పాటు, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల కేటగిరీ కింద మరాఠాలకు రాష్ట్రం ఇప్పటికే ప్రత్యేక కోటా విస్తరించిందని ఆయన నొక్కి చెప్పారు.
Read More
Next Story