
చిరాగ్ పాశ్వాన్, పవన్ కల్యాణ్ (గ్రాఫిక్స్)
ఇక్కడ పవన్ కల్యాణ్, అక్కడ చిరాగ్ పాశ్వాన్!
జనసేన స్ట్రైకింగ్ రేటు 100 శాతం, చిరాగ్ పాశ్వాన్ 75 శాతం స్ట్రైకింగ్ రేట్
రామ్ విలాస్ పాశ్వాన్ గుర్తున్నాడుగా. కేంద్రమంత్రిగా పని చేసిన బీహార్ దళిత నాయకుడు. ఆయన కుమారుడే ఈ చిరాగ్ పాశ్వాన్. ఇప్పుడు బీహార్ లో ఈపేరో సంచలం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా చిరాగ్ పార్టీ 75 శాతం స్ట్రైకింగ్ రేట్ సాధించారు. ఆయన నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్ పాసవాన్) 29 సీట్లకు పోటీ చేసి 22 చోట్ల గెలువబోతున్నాడు. అంటే 75 శాతం సీట్లు తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.
గత ఎన్నికల్లో ఒకేఒక్క స్థానానికే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు 22 సీట్లతో రాష్ట్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టినా పార్టీలో చీలికలు, ముఠా తగాదాలతో పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు.
ఇప్పడాయన గెలుపును ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పోలుస్తున్నారు. జనసేన 2019 ఎన్నికల్లో ఒక సీటును మాత్రమే గెలిచారు. ఆ ఎమ్మెల్యే కూడా ఆ తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. అయితే 2024 ఎన్నికల్లో 22 సీట్లకు పోటీ చేసి 22 సీట్లనూ గెలిచారు. వంద శాతం స్ట్రైకింగ్ రేటు సాధించారు.
2020 ఎన్నికల్లో నీతీశ్ నాయకత్వాన్ని చిరాగ్ పాశ్వాన్ వ్యతిరేకించారు. ఎన్డీయేలోని బీజేపీకి మద్దతు ఇస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో జేడీయూ ఓట్లకు గండి కొట్టడంలో కీలక భూమిక పోషించారు.
2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ.. ఆ ఎన్నికల్లో కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్‌తో చిరాగ్‌కు విభేదాలు వచ్చాయి. ఆ పార్టీ ఎంపీలు ప్లేటు ఫిరాయించడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును నిలిపివేసింది. దీంతో 2021లో ఎల్జేపీ (రాం విలాస్) పేరిట కొత్త పార్టీని నెలకొల్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో 100% స్ట్రైక్‌రేట్
బాబాయ్ నుంచి గట్టి ఎదురుదెబ్బతిన్న చిరాగ్ పాశ్వాన్ తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ‘యువ బిహారీ’ అంటూ ప్రజలకు చేరువయ్యారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తనను దళిత నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అదే బిహార్‌లో మళ్లీ ఎన్డీయేతో కలిసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ విజయం సాధించారు.
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
తాజా ఎన్నికల్లో 29 చోట్ల పోటీ చేసిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్‌జేపీ (RV) 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 75 శాతం స్ట్రైక్‌రేటుతో దూసుకెళ్తోంది. 2029 ఎన్నికల్లో మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమంటూ తన విధేయతను చాటుకున్నారు.
చిరాగ్ పాశ్వాన్ ఎవరు?
చిరాగ్ పాశ్వాన్ బీహార్ రాజకీయాల్లో అత్యంత వేగంగా ఎదిగిన యువ నేతల్లో ఒకరు. ప్రస్తుతం లోక్ జనశక్తి పార్టీ (రామవిలాస్) జాతీయ అధ్యక్షుడు. బీహార్‌లో NDA కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తండ్రి రామవిలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, చిరాగ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రధాన నేతగా ఎదిగాడు.
తండ్రి: రామవిలాస్ పాశ్వాన్. కేంద్ర మంత్రిగా ఎన్నో సార్లు పనిచేసిన శక్తిమంతమైన దళిత నాయకుడు. 1982 అక్టోబర్ 31న జన్మించిన చిరాగ్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత మోడలింగ్, సినిమాల రంగంలో చిన్న ప్రయోగం చేశాడు. 2011లో “మైల్స్ టు గో” అనే మూవీ తీసి చేతులు కాల్చుకున్నారు.
చిరాగ్ 2014లో LJPలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరంలో జముయి పార్లమెంట్ సీటు నుండి గెలిచి లోక్‌సభ సభ్యుడయ్యాడు. 2019లో మళ్లీ గెలిచాడు. పార్టీ యువ నాయకుడిగా ఎదిగి, తరువాత పార్టీ అధ్యక్షుడయ్యాడు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ ఎక్కువగా చర్చకు వచ్చాడు. నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. కానీ BJPతోనే కొనసాగారు. అతన్ని అప్పట్లో మీడియా “బీహార్‌లో BJP ట్రోజన్ హోర్స్” అని కూడా పిలిచింది. ఈ వ్యూహం చిరాగ్‌ను బీహార్ రాజకీయాల్లో హై–ప్రొఫైల్ నాయకుడిగా నిలబెట్టింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎల్జీపీ (రామవిలాస్) పార్టీ 5 సీట్లకు పోటీ అన్నీ గెలిచింది. NDAలో బలమైన స్థానాన్ని సంపాయించారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ సాధించిపెట్టిన దళిత ఓటు బ్యాంక్‌ను బలోపేతం చేయగలిగిన నాయకుడుగా పేరుపొందారు. యువ ఓటర్లలో అతనికి మంచి following ఉంది. “బీహార్ ఫస్టు – బిహారియా ఫస్టు” అనే ఆయన నినాదం బాగా పాపులర్ అయింది. తండ్రి వారసత్వం, యువత ఆకర్షణ, రాజకీయ వ్యూహాలు చిరాగ్ ను బీహార్‌లో ఎదుగుతున్న స్టార్‌గా నిలబెట్టాయి.
Next Story

