కశ్మీరీలందరిని అనుమానంగా చూస్తున్నారు: ఒమర్ అబ్ధుల్లా
x
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా

కశ్మీరీలందరిని అనుమానంగా చూస్తున్నారు: ఒమర్ అబ్ధుల్లా

జేకే రిజిస్ట్రేషన్ వాహనం ఢిల్లీలో తీయాలంటే భయంగా ఉందన్న సీఎం


ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి తరువాత జమ్మూకశ్మీర్ ప్రజలు కేంద్రపాలిత ప్రాంతం దాటి ప్రయాణించడానికి భయపడుతున్నారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా బుధవారం అన్నారు.

కొద్దిమంది కశ్మీరీ ప్రజలు చేసిన అకృత్యాలు మిగిలిన వారిపై అనుమానం పెంచాయని అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపడానికి ఇష్టపడకపోవచ్చు.

అన్నివైపుల నుంచి మనల్నీ అనుమానాస్పద దృష్టితో చూస్తున్నారు. వేరొకరు మనల్ని అప్రతిష్ట పాలుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఇప్పుడు బయటకు వెళ్లడం కష్టమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది’’ అని దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంలో జరిగిన ఒక కార్యక్రమంలో అబ్దుల్లా అన్నారు.

కానీ మనం ఏమి చేయగలం, అదే వాస్తవం అని అన్నారు. ‘‘ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కొంతమంది బాధ్యులు, కానీ దానికి మనమందరం కారణమనే భావనను సృష్టిస్తున్నారు.

మనమందరం దానిలో భాగమే’’ అని ఆయన అన్నారు. దేశ రాజధానిలో జేకే రిజిస్ట్రేషన్ ఉన్న తన వాహానాన్ని బయటకు తీసుకెళ్లే ముందు రెండుసార్లు ఆలోచిస్తానని అబ్ధుల్లా అన్నారు.

‘‘నేనే ఢిల్లీలో జేకే రిజిస్ట్రేషన్ వాహానం నడపడం కూడా నేరంగా చూస్తున్నారు. నాతో పాటు ఎక్కువ మంది భద్రతా సిబ్బంది లేనప్పుడూ నా కారు బయటకు తీయాలా వద్దా అని నేను ఆలోచిస్తాను.
ఎందుకంటే ఎవరైనా నన్ను ఆపి నేను ఎక్కడి నుంచి వచ్చానని అడుగుతారో లేదో నాకు తెలియదు’’ అని ఆయన అన్నారు. నవంబర్ 10 న ఢిల్లీలో కారు పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఎన్ఐఏ క్రైమ్ బ్రాంచ్ లతో కూడిన విస్తృత బహుళ సంస్థ దర్యాప్తు ప్రారంభమైంది. పేలుడు జరిగినప్పటి నుంచి భద్రతా చర్యలను పెంచడంలో భాగంగా జమ్మూకశ్మీర్ నుంచి ఫరీదాబాద్ లోనే 500 మందికి పైగా ప్రజలను పోలీసులు తనిఖీలు చేశారు.
అల్ ఫలాహ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న చాలామంది వైద్య విద్యార్థులు ‘వైట్ కాలర్’ పేరుతో ఉగ్రవాద కుట్రలకు పాల్పడ్డారు. తమ బృందంలో పేలుడు పదార్థాలను సేకరించడానికి వైద్య బాషలో కోడ్ నేమ్ లు రాసుకున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. డీ6 మిషన్ పేరుతో డిసెంబర్ ఆరున దేశవ్యాప్తంగా ఏకకాలంలో పేలుళ్లు జరపాలని కుట్రపన్నారు. దీనికోసం ఏకంగా 20 కార్లను కొనగోలు చేసినట్లు తెలిసింది.
Read More
Next Story