
ఢిల్లీ జరిగిన ఎర్రకోట పేలుడు
ఢిల్లీ పేలుడులో ‘మదర్ ఆఫ్ సైతాన్’ ఆనవాళ్లు?
పేలుడు షాక్ వేవ్ లను పరిశీలిస్తే టీఏటీపీ ఉందని అనుమానాలు
చారిత్రాత్మక ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదులు తమ పేలుడులో ‘మదర్ ఆఫ్ సైతాన్’ అని పేరున్నా ప్రత్యేక పదార్థాలను ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ పేలుడు పదార్థం ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్(టీఏటీపీ) ప్రపంచవ్యాప్తంగా బాంబు తయారీదారులలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2015 లో ఫ్రాన్స్ దాడులు, 2016 లో బ్రస్సెల్స్ దాడులు, 2017 లో బార్సిలోనా దాడులు, 2017 మాంచెస్టర్ పేలుడులో ఈ బాంబు ఆనవాళ్లు కనిపించాయి.
ఇది ఎందుకు ప్రాణాంతకం..
మదర్ ఆఫ్ సాతాను లేదా టీఏటీపీ కేవలం వేడి కారణంగానే పేలిపోతుంది. అమ్మోనియం నైట్రేట్ వంటి ఇతర పేలుడు పదార్థాల మాదిరిగా కాకుండా పేలుడును ప్రేరేపించడానికి డిటోనేటర్ అవసరం లేదు.
టీఏటీపీ అనేది చాలా సున్నితమైన సమ్మేళనం. ఇది ఏ మాత్రం ఘర్షణ జరిగినా పేలిపోతుంది. నవంబర్ 10 న ఎర్రకోట సమీపంలో జరిగిన ఐ20 కారు పేలుడులో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించబడిందని దర్యాప్తు అధికారులు మొదట అనుమానించారు.
ఈ పేలుడులో 13 మంది మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారును ఉమర్ మహ్మద్ అనే వైద్యుడు నడుపుతున్నాడు. పాత ఢిల్లీలోని అత్యంత రద్దీ గల ప్రాంతమైన చాందినీ చౌక్ లోకి ప్రవేశించడానికి ముందు ఈ పేలుడు పదార్థం స్వభావం గురించి తెలిసి ప్రవేశించడా లేదా అని తెలుసుకోవడానికి పోలీసులు తమ దృష్టి కేంద్రీకరించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం..పేలుడు సంభవించిన ప్రదేశంలో జరిగిన నష్టం, తరువాత వచ్చిన షాక్ వేవ్ లు అన్ని టీఏటీపీ తరహలోనే ఉంది. పేలుడు పదార్థం వేడి చేసి పెట్టారా? లేక దాన్ని కారులో అస్థిరంగా పెట్టారా? అని ఫోరెన్సిక్ బృందాలు పరీక్షిస్తున్నాయి. వేరే ఉగ్రవాద చర్యలో ఉపయోగించడానికి ఇతర ప్రదేశాలలో తరలిస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తూ పేలిందా అనే కోణంలో కూడా వారు పరిశీలిస్తున్నారు.
ఎక్కడి నుంచి వచ్చింది?
మదర్ ఆఫ్ సైతాన్ ను తయారు చేయడానికి ఉమర్ కు రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే దీనికి అనేక పదార్థాలు అవసరం.
ఇందుకోసం విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారా? ఇతరులు ఎవరైనా పాల్గొన్నారా? అని కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పేలుడుకు ముందు ఉమర్ కదలికలు అంచనా వేయడానికి డిజిటల్ ట్రైల్స్, లాగ్ లను స్కాన్ చేస్తున్నారు.
Next Story

