
ఆరేళ్ల విరామానికి తెర.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ, అకాలీదళ్!
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటన
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్లుగా విడివిడిగా రాజకీయ ప్రయాణం సాగిస్తున్న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఒక్కటయ్యాయి. 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో 2020లో తెగిపోయిన ఇరు పార్టీల రాజకీయ బంధం మళ్లీ మొదలైనట్లయింది.
అమిత్ షా ఏం అన్నారంటే...
న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా పాల్గొన్నారు.‘‘పంజాబ్ ఎన్నికల్లో మేమిద్దరం కలిసి పోటీ చేయాలని బీజేపీ, అకాలీ దళ్ నాయకులు నిర్ణయించుకున్నారు’’ అని షా చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నాయకత్వాలు నిర్ణయించినట్లు అమిత్ షా వెల్లడించారు. ఎన్డీయేలో అకాలీదళ్ అత్యంత పాత మిత్రపక్షమని ఆయన గుర్తుచేశారు. ఆ పార్టీ తిరిగి కూటమిలోకి రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
వాస్తవానికి బీజేపీ, అకాలీదళ్ మధ్య దాదాపు 24 ఏళ్లపాటు రాజకీయ మైత్రి కొనసాగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో విభేదాలు తలెత్తడంతో 2020లో ఈ బంధం తెగిపోయింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.
మోదీ స్వాగతం..
ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్ ఈ పున: కలయికను స్వాగతిస్తూ ఈ భాగస్వామ్యాన్ని ఒక సహజ కూటమిగా అభివర్ణించారు.
‘‘పంజాబ్ కు, పంజాబ్ ల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత.. శిరోమణి అకాలీదళ్, అది కూడా శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ రోజున ఎన్డీఏ కుటుంబంలోకి తిరిగి రావడం నాకు అత్యంత ఆనందంగా ఉంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ భాగస్వామ్యం చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆయన మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయ్, సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్ కే అద్వానీ, ఎస్ఏడీ అధినేత ప్రకాశ్ బాదల్ లకు ఘనత ఆపాదించారు.
‘‘అటల్ జీ, అద్వానీ జీ, సర్ధార్ ప్రకాశ్ సింగ్ బాదల్ జీల పెంపకలో పెరిగిన అకాలీ దళ్- బీజేపీ కూటమి కాలపరీక్షకు నిలబడింది’’ అని మోదీ రాసుకొచ్చారు.
కేజ్రీవాల్ విమర్శలు..
రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ పొత్తులు పెట్టుకుంటోందని ఆరోపిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆ రెండు పార్టీలను విమర్శించారు. ‘‘కొన్నిసార్లు వారు కలిసి వస్తారు. కొన్నిసార్లు విడిపోయి మళ్లీ కలుస్తారు. మా పొత్తు పంజాబ్ ప్రజలతోనే’’ అని ఆయన అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ ఆ నిరసనల్లో 700 మంది రైతులు మరణించారని ఆయన ఆరోపించారు.
మాదక ద్రవ్యాల ముప్పు..
పంజాబ్ లో పార్టీల ప్రాధాన్యతల గురించి కూడా షా మాట్లాడారు. రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలను నిర్మూలించడం తమ ప్రధాన లక్ష్యమని అదే సమయంలో అవినీతిని అరికట్టడం, జాతీయవాద శక్తులను బలోపేతం చేయడం కూడా తమ అజెండాలో ఉంటాయని ఆయన అన్నారు.
‘‘పంజాబ్ నుంచి మాదక ద్రవ్యాల బెడదను నిర్మూలించడం మా ప్రాథమిక లక్ష్యం. పంజాబ్ నుంచి అవినీతిని నిర్మూలించడం ఒక కీలక లక్ష్యం. అలాగే రాష్ట్రంలో జాతీయవాద శక్తులను బలోపేతం చేయడం కూడా మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం’’ అని అమిత్ షా అన్నారు.
1996 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ తొలిసారిగా చేతులు కలిపాయి. 1997 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారు లాంఛనంగా పొత్తు పెట్టుకున్నారు.
ఈ పరిణామంతో పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు అవకాశం ఏర్పడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కూటమి ఏ విధంగా ముందుకు సాగుతుంది? సీట్ల పంపకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ముఖ్యంగా ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసిన ఈ రెండు పార్టీలు పంజాబ్ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పాత్ర పోషిస్తాయన్నది వేచి చూడాలి.
Next Story
