
ఢిల్లీ సీఎం పేరును సాయంత్రానికి ప్రకటించనున్న బీజేపీ?
ముందు వరుసలో పర్వేశ్ వర్మ పేరు, మహిళలకు కూడా అవకాశం ఉందని ప్రచారం
ఢిల్లీ కొత్త సీఎం ఎవరనేది ఈ సాయంత్రం తేలబోతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బీజేపీ శాసనసభా పక్షం సమావేశం జరుగనున్నందున అందులో తమ నాయకుడిని వారు ఎన్నుకోనున్నారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. కొత్త నాయకుడిని ఎన్నుకున్న తరువాత ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని, దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఆ పార్టీ ప్రణాళిక వేస్తోంది. దాదాపు దశాబ్ధకాలంగా అధికారంలో ఉన్న ఆప్ ను కమలం పార్టీ ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే.
ప్రధాని విదేశీ పర్యటన..
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చే విషయంలో జరిగిన జాప్యానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనే కారణమని తెలుస్తోంది. ఆయన ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని శనివారమే న్యూఢిల్లీకి చేరుకున్నారు.
ఆయన వచ్చిన తరువాత ఈ ప్రక్రియకు ప్రాథమిక కసరత్తు జరిగిందని, అందుకోసం పార్టీ తరఫున ఓ పరిశీలకుడిని నియమించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారం ఘనంగా ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో దాదాపుగా 200 మంది ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
సీఎం ఎంపికపై ఉత్కంఠ
ఢిల్లీ సీఎం పదవికి అనేక పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ కూడా ముందు వరుసలో ఉన్నారు. మాలవీయ నగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్, పార్టీ సీనియర్ నాయకుడు విజేందర్ గుప్తా, కొత్తగా ఎన్నికైన జనక్ పురి ఎమ్మెల్యే ఆశిశ్ సూద్, ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
బీజేపీ తదుపరి ముఖ్యమంత్రి ఒక మహిళను కూడా ఎంపిక చేయవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అందులో నీలం పహల్వాన్, రేఖ గుప్తా, పూనమ్ శర్మ, శిఖారాయ్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఆ పార్టీ ఢిల్లీలో 70 సీట్లలో 48 గెలుచుకుంది. ఇది 2020 కంటే 41 ఎక్కువ, ఆ సంవత్సరం 62 సీట్లు గెలుచుకున్న ఆప్ ను కేవలం 22 స్థానాలకే పరిమితం చేసింది.
Next Story