
కారు బాంబు పేలిన ప్రదేశం
ఢిల్లీలో 14 ఏళ్ల తరువాత పేలిన బాంబు
చివరగా 2011 లో ఢిల్లీ హైకోర్టు దగ్గర బాంబు పేలుడు
నిన్న సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడులో కనీసం ఎనిమిది మంది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు.
దాదాపు 14 సంవత్సరాల తరువాత ఢిల్లీ మరోసారి బాంబు దాడులతో ఉలిక్కి పడింది. ఆ సమయంలో ప్రయాణికులు, సందర్శకులతో ఈ ప్రాంతం కిక్కిరిసి ఉంది.
గాయపడిన వారిని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. దేశంలో తరుచుగా జరిగే ఉగ్రవాద దాడులకు ఢిల్లీకేంద్రంగా మారింది. అయితే భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడం, వరుస అరెస్ట్ లతో ఉగ్రవాదులు కొంతకాలంగా రూట్ మార్చారు. డాక్టర్లు, ఇంజనీర్లను ఆకర్షించి ఈ ఉగ్రవాదులుగా మార్చడంలో సఫలం అయ్యారు.
30 సంవత్సరాల క్రితం..
1996 వేసవి కాలం ఇప్పటికే ఢిల్లీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. రాజధానిలో అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ కేంద్రమైన లజ్ పత్ నగర్ లో అత్యంత శక్తివంతమైన బాంబును ఉగ్రవాదులు పేల్చారు.
ఇందులో 13 మంది మరణించగా, డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారు. ఒక సంవత్సరం తరువాత సదర్ బజార్, కరోల్ బాగ్, రాణి బాగ్, చాందీని చౌక్ వరకూ వరుస బాంబు పేలుల్లు జరిపి పదుల సంఖ్యలో సాధారణ ప్రజలను పొట్టన పెట్టుకున్నారు.
డిసెంబర్ 2000 లో ఒక ఉగ్రవాద సంస్థ ఎర్ర కోట సముదాయం లోపల కాల్పులు జరిపి ఇద్దరు సాధారణ పౌరులను హత్య చేసింది. 2001 లో ఏకంగా పార్లమెంట్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు, తొమ్మిది మంది భద్రతా సిబ్బందిని హతమార్చారు.
2005 దీపావళికి కేవలం రెండు రోజుల ముందు పహార్ గంజ్, సరోజిని నగర్, గోవింద్ పురిలో పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో 67 మంది మరణించారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలతో రాజధాని మార్కెట్లలో పండగ సమయంలో షాపింగ్ చేయాలంటే సామాన్య ప్రజలు తీవ్రంగా భయపడటం ప్రారంభించారు.
2008 లో కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, గ్రేటర్ కైలాశ్ ప్రాంతాలలో ఒకే సమయంలో ఐదు పేలుళ్లు సంభవించాయి. ఇందులో 20 మంది మరణించారు. ఢిల్లీలో చివరిసారిగా 2011 లో ఉగ్రవాదులు బాంబు పేల్చారు. ఢిల్లీ హైకోర్టు వెలుపల బ్రీఫ్ కేసు బాంబు పేలి 15 మంది మరణించారు. 79 మంది గాయపడ్డారు. ఆ తరువాత నిన్ననే ఢిల్లీలో మరోసారి బాంబు పేలుడు జరిగింది.
Next Story

