జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అధికారుల దారుణ హత్య..
x

జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అధికారుల దారుణ హత్య..

మాయమైన తుపాకులు!


Click the Play button to hear this message in audio format

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిష్త్వార్ జిల్లాలో కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPOలు) గురువారం ఉదయం విగతజీవులుగా కనిపించారు. వారి మృతదేహాలపై తూటా గాయాలు ఉండటం, వారు వెంట తీసుకెళ్లిన రెండు తుపాకులు కనిపించకపోవడం కలకలం రేపుతోంది.

మృతులను 40 ఏళ్ల రష్‌పాల్ కుమార్, 54 ఏళ్ల బాబీ చంద్‌గా గుర్తించారు. కిష్త్వార్ జిల్లాలోని మారుమూల దచన్–మార్వా ప్రాంతంలో ఉన్న ధెర్నా పోస్టు వద్ద వారి మృతదేహాలను గుర్తించారు. ఒకరి తలపై, మరొకరి వీపుపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు సమాచారం.

అసలేం జరిగింది?

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ ఇద్దరు ఎస్పీఓలు ఆర్మీ పెట్రోలింగ్ బృందంతో కలిసి విధుల్లో ఉన్నారు. ధెర్నా పోస్టులో విధులు నిర్వహిస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి బాధ్యతలు అప్పగించేందుకు అక్కడికి వెళ్తుండగా ఉగ్రవాదులు వారిపై మెరుపుదాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
వారు కనిపించకుండా పోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మొదట వారి మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొంతసేపటి తర్వాత స్విచ్ఛాఫ్ అయ్యాయి. దీంతో సహచర సిబ్బందిలో ఆందోళన పెరిగింది.
ఈ క్రమంలో గాలింపు బృందాలను రంగంలోకి దించారు. పలు గంటల పాటు వెతికిన తరువాత ధెర్నా టాప్ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఘటన జరిగిన ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించినట్లు కూడా సమాచారం.
మరోవైపు, మృతుల వద్ద ఉన్న ఇన్‌సాస్, .303 రైఫిళ్లు కనిపించకపోవడం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. హత్య చేసిన దుండగులే ఆ ఆయుధాలను తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఈ ఘటన తరువాత దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతున్న కిష్త్వార్‌లోని అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు.
కాగా, గత అక్టోబర్ 16న కూడా ఇదే జిల్లాలో మరో ఎస్పీఓ బషీర్ అహ్మద్ (55) హత్యకు గురయ్యారు. వానిపోరా ట్రిగామ్‌లోని తన ఇంటి సమీపంలో ఆయన మృతదేహం లభించింది. విధుల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కనిపించకుండా పోయారు. అయితే, ఆ హత్య వెనుక భూ వివాదమే కారణమని, ఆయన బంధువులే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
తాజాగా ఇద్దరు ఎస్పీఓలు హత్యకు గురికావడం, వారి వద్ద ఉన్న ఆయుధాలు మాయమవడం కిష్త్వార్ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. దుండగులను గుర్తించడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంపై భద్రతా బలగాలు దృష్టి సారించాయి.


Read More
Next Story