ఢిల్లీ హైకోర్టుకు చేరిన బటర్ చికెన్ కేసు
x

ఢిల్లీ హైకోర్టుకు చేరిన బటర్ చికెన్ కేసు

బటర్ చికెన్.. నోరూరించే మాంసాహార వంటకాల్లో ఒకటైన ఈ వంటకం మూలాలు ఎవరికి దక్కాలనే విషయమై రెండు సంస్థలు కోర్టుకు ఎక్కాయి..


బటర్ చికెన్.. నోరూరించే మాంసాహార వంటకాల్లో ఇదొకటి... నోరు కాస్తంత చవ్వబడితే ఏదో రెస్టారెంట్ కో, ఏ స్విగ్గీకో మరో ఫుడ్ సప్లయర్ కో ఆర్డరు ఇచ్చి తెప్పించుకుని జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడం చేస్తుంటాం. అటువంటి ఆ వంటకం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఆ బటర్ చికెన్ ను మేము కనిపెట్టామంటే మేం కనిపెట్టామంటూ ఇండియాకి చెందిన రెండు ప్రముఖ సంస్థలు కొట్టాటకి దిగాయి. సై అంటే సై అంటున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్నాయి. వందల పేజీల డాక్యుమెంట్లు, తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ వరకు ఎందరెందరివో ఫోటోలు, సరికొత్త సాక్ష్యాలతో ఢిల్లీ హైకోర్టు ఘుమఘుమలాడుతోంది.

అసలింతకీ విషయమేమిటంటే...
ప్రపంచ ఖ్యాతి గాంచిన బటర్ చికెన్ మూలాలపై ఢిల్లీ హైకోర్టులో పోరాటం మరింత స్పైసీగా మారింది. ఇప్పుడీ వివాదం అంతర్జాతీయంగా మార్మోగుతోంది. సోషల్ మీడియా కస్టమర్లు, తిండీతిప్పలపై బాగా అవగాహన ఉన్న వాళ్లు చెవులు రిక్కించి ఈ వివాదాన్ని వింటుంటే పత్రికలు, టీవీలు పుంఖానుపుంఖాలుగా బటర్ చికెన్ గురించి నోరూరించేలా వ్యాసాలు, సంపాదకీయాలు రాస్తూ లైవ్ షోలు చేస్తున్నాయి. బటర్ చికెన్ వంటకం క్రెడిట్ మాదంటే మాదంటూ రెండు భారతీయ రెస్టారెంట్లు న్యాయపోరాటానికి దిగాయి. ఇప్పటికి ఐదు నెలలుగా ఢిల్లీ హైకోర్టులో గొడవపడుతున్నాయి. ఈ రెండు సంస్థలకు దేశదేశాల్లో బ్రాంచీలున్నాయి.
బటర్ చికెన్ కనిపెట్టిందే తామని, తమకే ఆ హక్కు దక్కాలంటూ ప్రముఖ మోతీ మహల్ రెస్టారెంట్ సంస్ధ వాదిస్తుంటే అదేం కుదరమ్మా, మాదేనంటూ దర్యాగంజ్ సంస్థ పోటీకి వచ్చింది. తాము తమ హక్కును వదులుకోవాలంటే కనీసం 2లక్షల 40వేల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
మోతీ మహల్ వ్యవస్థాపకుడు కుందన్ లాల్ గుజ్రాల్ 1930లలో ఢిల్లీకి మకాం మార్చడానికి ముందు ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న పెషావర్‌లో ఉండేవారు.ఆయన పెషావర్ లోని ఓ హోటల్ లో వెన్నా, మీగడ వేసి తయారు చేసిన (క్రీమ్-లోడెడ్) డిష్‌ను రూపొందించారని మూతీ మహల్ సంస్థ వాదిస్తోంది. ఆ వాదన నిజం కాదని, కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని దర్యాగంజ్ చెబుతోంది. అంతటితో ఆగకుండా 642 పేజీలతో కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది.
దర్యాగంజ్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన దివంగత సభ్యుడు, కుందన్ లాల్ జగ్గీ ఢిల్లీలోని ఓ హోటల్ ప్రారంభసమయంలో ఈ వంటకాన్ని సృష్టించారని వాదించింది. పెషావర్‌కు చెందిన ఆయన స్నేహితుడు-కమ్- భాగస్వామిగా ఉన్న గుజ్రాల్ మార్కెటింగ్‌ మాత్రమే చూసేవారని చెబుతోంది.
ఈ వివాదం గుట్టువిప్పడానికి ఇప్పుడా ఇద్దరూ లేరు. గుజ్రాల్ 1997లో, జగ్గీ 2018లో చనిపోయారు. పెషావర్‌లో ఆ ఇద్దరు కలిసి 1930లో తీయించుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాత్రం ఉంది. 1949నాటి భాగస్వామ్య ఒప్పందం ఉంది. ఢిల్లీకి మకాం మార్చిన తర్వాత జగ్గీ బిజినెస్ కార్డ్, డిష్ మూలాల గురించి జగ్గీ 2017లో మాట్లాడిన వీడియో ఉంది. స్నేహితుల భాగస్వామ్యం కారణంగా "ఈ రెండు సంస్థలూ తమ పూర్వీకులు ఈ వంటను సృష్టించారని క్లెయిమ్ చేయవచ్చు" అని దర్యాగంజ్ తన వ్యాజ్యంలో పేర్కొంది. ఈ వివాదాన్ని "వ్యాపార పోటీ"గా చెబుతోంది.
దీనిపై వ్యాఖ్యానించడానికి మోతీ మహల్ నిరాకరించింది. కేసు కోర్టులో ఉన్నందున ఇప్పుడేమీ మాట్లాడబోమని ప్రకటించింది. 2024 మే 29న ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. ఈ వంటకం మొదట ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ద్వారా తయారైందో కోర్టు విచారించాల్సి ఉంది.
రుచులకు రేటింగ్ ఇచ్చే "టేస్ట్‌ అట్లాస్" రూపొందించిన ప్రపంచంలోని "ఉత్తమ వంటకాల" జాబితాలో బటర్ చికెన్ 43వ స్థానంలో ఉంది. బటర్ చికెన్ ఎవరు కనుగొన్నారనే దాని గురించి చెప్పుకోవడం ముఖ్యమని బ్రాండ్ నిపుణులు చెబుతుంటారు. “ఆవిష్కర్తగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది . ఎక్కువ వసూలు చేసుకోవచ్చు” అని ఇమేజ్ గురు, పర్ఫెక్ట్ రిలేషన్స్ సహ వ్యవస్థాపకుడు దిలీప్ చెరియన్ అన్నారు.
మోతీ మహల్ కి ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా బ్రాంచీలు ఉన్నాయి. ఫ్రాంఛైజీ మోడల్‌ను నిర్వహిస్తోంది. దీని బటర్ చికెన్ వంటకాలు న్యూ ఢిల్లీలో 8 డాలర్ల నుంచి మొదలైతే అమెరికాలోని న్యూయార్క్‌లో 23 డాలర్లతో ప్రారంభమవుతాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, ఇండియన్ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీలోని మోతీ మహల్ మెయిన్ రెస్టారెంట్ ను సందర్శించిన ప్రసిద్ధ ఖాతాదారుల జాబితాలో ఉన్నారు.
దర్యాగంజ్ 2019లో ప్రారంభమైంది. దాని బటర్ చికెన్ ధర $7.50. ఈ సంస్థకు ఇప్పటి వరకు పది అవుట్ లెట్లు మాత్రమే ఉన్నాయి. వీటలోనూ ఎక్కువగా న్యూఢిల్లీలోనే ఉన్నాయి. ఇతర నగరాలు, బ్యాంకాక్‌లలో బ్రాంచీలు తెరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మోతీ మహల్ తన 2,752 పేజీల దావాలో బటర్ చికెన్ పుట్టుపూర్వోత్తరాలను ఏకరవుపెట్టింది. దర్యాగంజ్ తమ డిష్ ను కాపీ కొట్టిందని ఆరోపించింది. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ దర్యాగంజ్ రెస్టారెంట్ సమర్పించిన ఇంటీరియర్‌ల ఛాయాచిత్రాలను జడ్జి సమీక్షించనున్నారు. మోతీ మహల్ తమ "ఫ్లోర్ టైల్స్ డిజైన్"ని కాపీ చేసిందని పేర్కొంది.
Read More
Next Story