పంజాబ్: ఏడు సమస్యలపై రాజకీయ పార్టీల ప్రచారం.. అవి..
x

పంజాబ్: ఏడు సమస్యలపై రాజకీయ పార్టీల ప్రచారం.. అవి..

పంజాబ్ లో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఆప్ సర్కార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఏకంగా 47 వేల కోట్ల అప్పులు చేసింది. దాని జీఎస్డీపీలో దాని వాటా 46.8 %..


పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఒక నెల మాత్రమే గడువుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రజల మద్దతును పొందేందుకు అనేక ప్రాంతీయ, జాతీయ సమస్యలను లేవనెత్తి వాటికి తాము ఇచ్చే పరిష్కారాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

దేశ సరిహద్దులో ఉన్న పంజాబ్ ముఖ్యంగా డ్రగ్స్ తో సతమతం అవుతోంది. వేలాదిమంది యువకులు వీటిబారిన పడి తమ జీవితాన్ని కోల్పోతున్నారు. ఇదే కాకుండా రైతుల ఆందోళన, పాకిస్తాన్ తో ఉన్న అట్టారి సరిహద్దు గుండా జరిగే వాణిజ్యాన్ని మూసివేయడం వంటి సమస్యలపై ఆప్, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే తాము పదేళ్లుగా అనేక విజయవంతమైన పథకాలను అందించి అనేక సమస్యలను దూరం చేశామని కమలదళం ఎదురుదాడికి దిగింది.
ఏది ఏమైనప్పటికీ, పంజాబ్ గ్రామీణ ఓటర్లలో ఎక్కువ మంది రైతులే కాబట్టి, బిజెపిని కార్నర్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలు రైతుల ఆందోళనను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి బీజేపీ నాయకులు రావడానికి వీలులేదని పోస్టర్లు వేశారు. కొంతమంది బీజేపీ నాయకులు ప్రచారానికి గ్రామాల్లోకి వెళ్లినప్పుడు రైతుల నుంచి నిరసనలు సైతం ఎదుర్కొన్నారు.
రైతుల ఆందోళన
అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కు చట్టబద్ధంగా హామీ ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులకు, రైతు కూలీలకు నెలవారీ రూ.10,000 పింఛను ఇవ్వాలని, సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయ రహిత) నేతృత్వంలోని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లఖింపూర్ ఖేరీ సంఘటనలో రైతులపైకి కారు నడిపి హత్య చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పంజాబ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారంగా ఉన్న రాష్ట్రం. 2020-21 జరిగిన రైతు ఆందోళనలతో శిరోమణి అకాలీదళ్, బీజేపీతో కొనసాగుతున్న తమ బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చింది. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతూ అధికారం కొల్పోయింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో పట్టు సాధించిన ఆప్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. మరో పైపు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి తో సహ ఐదు పంటలకు మద్ధతు ధరతో కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా వెల్లడించింది. అయితే వీటిని రైతు సంఘాల నాయకులు తిరస్కరించారు. ఇవన్నీ పంజాబ్ లో పండని పంటలనీ చర్చల ప్రక్రియలో పాల్గొనడానికి నిరాకరించారు.
ఇండో-పాక్ వాణిజ్యం మూసివేత
అట్టారీ సరిహద్దు ద్వారా భారతదేశం - పాకిస్తాన్ మధ్య వాణిజ్యం మూసివేయడం కూడా ప్రధాన సమస్యలలో ఒకటి, ఇది పంజాబ్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. పంజాబ్‌లోని వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూర్చింది ఈ మార్గమే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వల్ల సరిహద్దు మూసివేశారు. దీంతో ఈ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.
2019లో పుల్వామా దాడి కారణంగా భారత్- పాక్ మధ్య వాణిజ్యం నిలివేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ICP)ని తిరిగి తెరవాలని వాణిజ్య సంస్థలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టికల్ 370 తరువాత పాకిస్తాన్ భారత దిగుమతులపై 200 శాతం పన్నులు విధించింది. తరువాత వాణిజ్యాన్నిపూర్తిగా నిలిపివేసింది.
నిధుల కొరత
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయట్లేదని అధికార ఆప్ తరచూ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తోంది. రూ. 8,000 కోట్ల విలువైన గ్రామీణాభివృద్ధి నిధులను (ఆర్‌డిఎఫ్) నిలిపివేయడం ద్వారా పంజాబ్ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం “ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడాన్ని” బహిర్గతం చేస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. ఆర్డీఎఫ్ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇప్పటికే మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పంజాబ్ పై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఉద్యోగాల కొరత, గ్రామీణ రుణాలు
నిరుద్యోగం, గ్రామీణ రుణాలు కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యలు. వ్యవసాయం ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడం, పారిశ్రామికీకరణ లేకపోవడంతో రాష్ట్ర యువత ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వలసపోతున్నారు. పంజాబ్ నుంచి అధిక సంఖ్యలో యువత యూఎస్, యూకే, కెనడా వంటి దేశాలకు ఉన్నత చదువులు, లేదా ఉద్యోగాలకు వెళ్తున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం పట్ల ప్రజలు కూడా సంతోషంగా లేరు. భారత సైన్యంలో ఉద్యోగం చేసే అవకాశాన్ని తీసివేసిందని పంజాబీలు భావిస్తున్నారు. పంజాబ్ చాలా సంవత్సరాలుగా సాయుధ దళాలలో పనిచేయడానికి అధిక సంఖ్యలో యువకులను పంపుతోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అప్పులే ప్రధాన సమస్య. 2000 నుంచి 2018 మధ్య ఆత్మహత్యల ద్వారా మరణించిన దాదాపు 9,000 మంది రైతుల్లో, 88% మందికి గణనీయమైన అప్పులు ఉన్నాయి.
పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం..
నిరుద్యోగం కారణంగా అనేక మంది యువత డ్రగ్స్ బారినపడుతున్నారు. పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకోవడం, సంపన్న రాష్ట్రం కావడంతో ఇక్కడ డ్రగ్స్ దొరకడం పెద్ద సమస్య కాదు. 2022లో 647 కిలోలహెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. 2021లో 568 కిలోలుగా ఉండేది. ఒక్క సంవత్సరంలోనే దాని సప్లై 14% పెరిగిందని ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి. మాదక ద్రవ్యాల సరఫరా గొలుసును అరికడతామని అధికార ఆప్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పెద్దగా ఏమీ మారలేదు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారులకు రాజకీయ, పోలీసు అండదండలు ఉన్నాయని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి.
మొత్తం అప్పు
2023–2024లో, పంజాబ్ GSDPలో దాదాపు 5.0% బడ్జెట్ లోటును కలిగి ఉంటుందని అంచనా . ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 5.2% కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇది ప్రారంభ అంచనా 3.8% కంటే ఎక్కువగా ఉంది. FY23- FY24లో బడ్జెట్ లోటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించదగిన సీలింగ్ వరుసగా 3.5% - 4%గా ఉంది, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, పంజాబ్ అత్యధిక రుణాలను కలిగి ఉంది. 2024 చివరి నాటికి GSDPలో దాని అప్పులు 46.8%గా అంచనా .
AAP రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నరలోపే పంజాబ్ రూ. 47,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. ఆదాయాన్ని పెంచడంలో విఫలమైన ఆప్ సర్కార్, ప్రజాకర్షక పథకాలకు అమలు చేయడానికి భారీగా అప్పులు చేసి ఇరుక్కుపోయింది.
నీటి సంక్షోభం
పంజాబ్‌లో నీటి సమస్య అశాంతికి ప్రధాన మూలం. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PAU) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 1998 నుంచి 2018 వరకు రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయి 3 మీటర్ల నుంచి 10 మీటర్లకు పడిపోయింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో, భూగర్భజల మట్టం అంతకు పడిపోతూనే ఉంది. ఇప్పుడు దాని స్థాయి 30 మీటర్లుగా ఉంది. పంజాబ్‌లోని 23 జిల్లాల్లో 19 జిల్లాల్లో ఏటా ఒక మీటరు మేర భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని ఒక నివేదిక పేర్కొంది.
అధిక దిగుబడిని ఇచ్చే వివిధ రకాల విత్తనాలకు సాంప్రదాయ విత్తనాల కంటే మూడు రెట్లు ఎక్కువ నీరు అవసరం కాబట్టి, పంజాబ్‌లో భూగర్భజలాల స్థాయి సంవత్సరానికి 0.49 మీటర్లు పడిపోతోంది. నీటి కొరత చిన్న, పెద్ద ఆందోళనలకు దారితీసింది.
Read More
Next Story