కేజ్రీవాల్ వ్యాఖ్యలపై హర్యానాలో కేసు నమోదు
కావాలనే యుమునా నదీలో విషం కలుపుతున్నారనే వ్యాఖ్యలపై న్యాయవాది ఫిర్యాదు
యమునా నదిలో విషం కలుపుతున్నారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానాలోని కురుక్షేత్రలో కేసు నమోదు అయింది. న్యాయవాదీ జగ్మోహన్ మంచందా న్యాయస్థానంలో కేసు దాఖలు చేయడంతో షహాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలింగ్ కు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.
కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. యుమునా నదీలో కావాలని విషం కలుపుతున్నారని, ఇక్కడ ప్రజలను చంపాలనే ఇలా దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఆప్ నేతలు బాధ్యతారాహితంగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.
కేజ్రీవాల్ తన తప్పుడు వాదనలతో ఢిల్లీ ప్రజల్లోనే కాకుండా హర్యానా పౌరుల్లో కూడా భయాన్ని వ్యాపింపజేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆయన వ్యాఖ్యాలపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 192( అల్లర్లను ప్రేరేపించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం), 196(1)( మతం, జాతి వివిధ సముహాల మధ్య శత్రుత్వం ప్రొత్సహించడం), 299 ( మత విశ్వాసాలను అవమానించడం) వంటి పలు సెక్షన్ల మధ్య కేసు నమోదు చేశారు.
హర్యానా ప్రభుత్వం, బీజేపీ నేతలతో సహ రాష్ట్రం పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. తప్పుడు ప్రకటనలో హర్యానా, ఢిల్లీ లో అల్లర్లు, విధ్వంసం సృష్టించి అల్లర్ల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఈ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ దారు ఆరోపించారు.
నదిలో వ్యర్థాలు కలుపుతున్నారు..
హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగా యుమునా నదిని కలుషితం చేయడానికి పారిశ్రామిక వ్యర్థాలను కలుపుతోందని కేజ్రీవాల్ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో మరోసారి ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను చంపడానికి కావాలనే ఈ విషం కలుతున్నారని ఆయన విమర్శలు చేశారు. ఈ నీటిని ఎక్కడా శుద్ది చేయలేరని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యం కోసం నీటి సరఫరాలను నిలిపివేయాల్సి వచ్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మార్లేనా మాట్లాడుతూ.. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే నీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తోందని అన్నారు. ఫిబ్రవరి 5న రాజధానిలో జరిగే ఎన్నికల్లో చారిత్రక నష్టం నుంచి తప్పించుకోవడానికి ఇలా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు.
అయితే బీజేపీ నేతలు వీటిని ఖండించారు. ఢిల్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, యుమునా నది ఢిల్లీలోనే ఎక్కువ స్థాయిలో కలుషితం అవుతోందని ఇది కేజ్రీవాల్ ప్రభుత్వం అసమర్ధత వల్లే జరుగుతోందని ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా పారే నదీని ఎవరూ విషపూరితం చేయలేరని కూడా వ్యాఖ్యానించారు.
Next Story