రైతులతో కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత చర్చలు
x

రైతులతో కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత చర్చలు

పంట ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర అందించాలని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు మరోసారి రైతు నాయకులతో ఈ రోజు సమావేశం కానున్నారు.


ఇప్పటికే ఫిబ్రవరి 8, 12, 15 తేదీలలో రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు చండీఘడ్ లో చర్చలు జరిపారు. కానీ ఇవన్నీ అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంతో మరోసారి చర్చలు ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ లతో కూడిన బృందం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్జూర్ మోర్చా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తమ పంటలకు కనీస మద్ధతు ధర(MSP) కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరడంతో పాటు, రైతు చట్టాల సందర్భంగా నమోదు అయిన అన్ని కేసులను ఉపసంహరించాలని, రైతుల కూలీకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వీటిని సాధించడానికి పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఇప్పటికే హర్యానా- పంజాబ్ సరిహద్దులకు చేరుకున్నారు. కానీ వీరిని పోలీసులు నిలువరించారు. రైతులను చెదరగొట్టానికి టియర్ గ్యాస్, వాటర్ క్యాన్ లను ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం అంతకుముందే భారీ పిల్లర్లు, ముళ్ల కంచెలను రహదారి వెంట మోహరించింది. ఢిల్లీలో కూడా మూడు అంచెల్లో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. పంజాబ్ రైతులను ఎట్టి పరిస్థితుల్లో హర్యానా సరిహద్ధులో గల శంభు, కన్నూరి సరిహద్దులో నిలువరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధి శర్వాన్ సింగ్ పందేరా మాట్లాడుతూ " ప్రధాని నిర్ణయం కోసం దేశంలోని రైతులందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్ అనంతరం రైతులు శుభవార్త వింటారని ఆశిస్తున్నా" అని చెప్పారు. " ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. వారే రాజకీయ నిర్ణయం తీసుకోవాలి" అని పేర్కొన్నారు. శనివారం రైతులు, పోలీసుల మధ్య ప్రశాంత వాతావరణం కనిపించింది.

ఢిల్లీ చలో కి రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్ నెట్, బల్క్ ఎస్ఎంఎస్ లపై ఉన్న నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకూ పొడిగించింది. మరో వైపు హర్యానాలోని భారతీయ కిసాన్ యూనియన్( చారిణి) హర్యానాలో శనివారం ట్రాక్టర్ మార్చ్ చేపట్టింది. పంజాబ్ లోని బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ఏక్తా ఉగ్రహాన్ రైతు నాయకులు ధర్నా చేపట్టారు.

అయితే రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి అవగాహన ఉందని, కచ్చితంగా శుభవార్త వింటారని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది మంది రైతులు హర్యానా సరిహద్దులోనే ఉన్న నేపథ్యంలో హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read More
Next Story