
యూపీ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్
రాఫెల్ జెట్ల బొమ్మలకు నిమ్మకాయలు కట్టిన కాంగ్రెస్ నాయకుడు
కాంగ్రెస్ పాకిస్తాన్ ఆదేశాలతో పనిచేస్తుందని బీజేపీ ఎదురుదాడి
పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారం తీర్చుకోవడంలో రాఫెల్ ఫైటర్ జెట్లు విఫలం అయ్యాయని వ్యాఖ్యానించిన యూపీ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ తాజాగా ఓ బొమ్మ విమానానికి రాఫెల్ అని పేరు పెట్టి వాటికి నిమ్మకాయలు తగిలించారు. పాకిస్తాన్ పై దాడి చేసేందుకు మోదీ ప్రభుత్వం రాఫెల్ ను ఎప్పుడూ వినియోగిస్తుందో చెప్పాలని రాయ్ డిమాండ్ చేశారు.
రాయ్.. రాఫెల్..
రాఫెల్ యుద్ధ విమానాలను హ్యంగర్లలో నిలిపి ఉంచారని ఆయన అన్నారు. ఆయన ప్రదర్శించిన బొమ్మ విమానంలో నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడుతూ కనిపించాయి.
‘‘దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ప్రజలు బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం చాలా మాట్లాడుతుంది. ఉగ్రవాదులను అణచివేస్తుందని చెబుతుంది. వారు రాఫెల్ ను తీసుకొచ్చారు.
కానీ వాటిని నిమ్మకాయలు, మిరపకాయలు పెట్టి హ్యంగర్లలో పెట్టారు. ఉగ్రవాదులపై వారికి మద్దతు ఇచ్చే వారిపై ఎప్పుడు చర్య తీసుకుంటారు’’? అని రాయ్ ప్రశ్నించారు.
కౌంటర్ ఇచ్చిన బీజేపీ
అజయ్ రాయ్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీజేపీ ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ కథనాలను భారత్ లో వ్యాపింపజేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
‘‘అజయ్ రాయ్ బొమ్మ చూపించలేదు కానీ పాకిస్తాన్ ఆదేశం మేరకు సాయుధ దళాల నైతికతతో ఆడుకుంటున్నాడు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా పాకిస్తాన్ తో యుద్దం అవసరం లేదని వ్యాఖ్యలు చేయడంతో ఆయన మాటలు పాకిస్తాన్ లో తీవ్ర వైరల్ గా మారాయి. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దరామయ్యను పాకిస్తాన్ రత్నగా అభివర్ణించింది.
రాయ్ ఏమన్నారంటే...
బీజేపీ కౌంటర్ తరువాత మరోసారి మాట్లాడిన రాయ్.. పహల్గామ్ లో రెండు డజన్లకు పైగా పౌరులను చంపిన వారిపై భారత్ చర్యతీసుకోవాలని కోరుకుంటోందని అన్నారు.
‘‘రాఫెల్ తన పని ఎప్పుడు చేస్తుందని నేను అడుగుతున్నాను.’’ అని రాయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో నిలుస్తుందని, ప్రజలు కోరుకున్నది చేయకపోతే ప్రశ్నిస్తారని అన్నారు.
కాంగ్రెస్ అభిప్రాయం..
దేశ వ్యాప్తంగా ఉన్న తమ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కాంగ్రెస్ ఇప్పటికే తన పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పార్టీ లైన్ దాటి మరీ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ... ‘‘కొంతమంది కాంగ్రెస్ నాయకులు పహల్గామ్ గురించి మీడియాతో మాట్లాడుతున్నారు.
ఇవి పార్టీ అభిప్రాయాలను ప్రతిబింబించవు. వారి కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నారు’’ అని చెప్పారు. ‘‘అత్యంత సున్నిత సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ఆఫీస్ బేరర్లు చెప్పినవే పార్టీ విధానాలను ప్రతిబింబిస్తాయి’’ అని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
పహల్గాం రక్తపాతం..
ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది హిందు పర్యాటకులను ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులని, అందులో ఒక ఉగ్రవాది పాకిస్తాన్ స్పెషల్ ఫోర్స్ కు చెందిన సైనికుడని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
వీరి కోసం దక్షిణ కాశ్మీర్ లోని అడవుల్లో వెతుకులాట జరగుతోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలు ఖండించింది.
Next Story