
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కుట్రదారులను వదిలిపెట్టేది లేదు: ప్రధాని మోదీ
బాధితులకు న్యాయం చేస్తామని హమీ
దేశ రాజధాని ఢిల్లీలో బాంబుదాడికి పాల్పడిన నిందితులకు మోదీ గట్టి హెచ్చరిక జారీ చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు. ‘‘అమాయాక ప్రజల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోనని దేశ ప్రజలకు నేను హమీ ఇస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణను ముమ్మరం చేశాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బాధ్యులందరిని చట్టం ముందు నిలబెట్టడం ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.
మరో వైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇదే విషయాన్ని ధృవీకరించారు. దేశంలో ఉగ్రవాద దాడికి పాల్పడిన వారందరికి నిద్రలేని రాత్రులు మిగులుస్తామని హెచ్చరించారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నిన్న రాత్రి జరిగి కారు బాంబు పేలుడులో 12 మంది మరణించారు. సంఘటన స్థలంలోనే 9 మంది మరణించగా మరో ముగ్గురు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. పేలుడుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ద కార్యకలాపాల(నివారణ)(యూఏపీఏ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యూఏపీఏ చట్టం, బీఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఉగ్రవాద దాడి కుట్రకు సంబంధించి యూఏపీఏలోని సెక్షన్ 16, 18 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పేలుడుకు ఉపయోగించిన కారు యజమానిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కారు పలు దఫాలుగా చేతులు మారి జమ్మూకశ్మీర్ లోని తారిఖ్ కు చేరింది. కేంద్ర పాలిత ప్రాంతంలోని పుల్వామా ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.
హర్యానా, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ కు చెందిన పోలీసులు నిన్న జరిపిన సోదాల్లో ముగ్గురు వైద్యులు, ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పక్కన ఉన్న ఫరీదాబాద్ కేంద్రంగా 2900 కిలోల పేలుడు పదార్థాలను నిందితుల నుంచి దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది బయటపడిన కొద్ది గంటల్లోనే ఉగ్రవాదులు ఎర్రకోట దగ్గర బాంబు దాడికి పాల్పడ్డారు.
Next Story

