న్యూఢిల్లి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నా: కేజ్రీవాల్
x

న్యూఢిల్లి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నా: కేజ్రీవాల్

మరో స్థానం నుంచి పోటీ చేస్తున్నాననే ప్రచారాన్ని ఖండించిన ఆప్ అధినేత


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం తాను న్యూఢిల్లీ నుంచి మాత్రమే బరిలోకి దిగుతున్న ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన ఓటమి భయంతో న్యూఢిల్లీ నియోజకవర్గంతో పాటు మరో సురక్షిత స్థానం నుంచి పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నారని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది.

అందులో భాగంగానే ఆయన సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలో ఓటర్ల లిస్టులో పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇవే ఆరోపణలతో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ లో పోస్టు పెట్టారు.

ఈ అంశంపై స్వయంగా కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. తాను కేవలం న్యూఢిల్లీ నుంచే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండి కూటమికి సంబంధం లేదని, కేవలం ఆప్, బీజేపీ మధ్య పోరు ఉందని పేర్కొన్నారు.
కాగా, ఇక్కడి నుంచి 2013 నుంచి కేజ్రీవాల్ వరుసగా గెలుస్తున్నారు. ఇలా మూడు సార్లు గెలిచిన ఆయన ఇక్కడ ప్రస్తుతం గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఇద్దరు మాజీ సీఎంల కుమారులు పోటీకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేష్ వర్మను బీజేపీ బరిలోకి దింపగా, మరో మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ తరఫున రంగంలోకి దూకారు. దీంతో ఆయన త్రిముఖ పోటీని ఎదుర్కొంటున్నాడు.
ఢిల్లీ ఎన్నికలను తేదీలను ప్రకటించడానికి ముందుగానే ఇక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఆప్ స్వయంగా ఓటర్ కార్డులను ఇస్తోందని బీజేపీ ఆరోపించగా, వేలాది మంది ఆప్ మద్ధతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి కమలదళం ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ విమర్శలు గుప్పించింది. దీనికోసం అనేక నియోజక వర్గాల నుంచి దరఖాస్తులు చేశారని ఆరోపించింది.
ఇదే అంశంపై అర్వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఈ రోజు సాయంత్రం ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఇందులో ఓటర్ల తొలగింపు సహా అనే అంశాలపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తమకు మద్దతు ఇచ్చినందుకు సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్, శివసేన(యూబీటీ) వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ వ్యతిరేక ఇండి కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పటి వరకూ అది 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 28 మందితో తొలిజాబితాను వెల్లడించింది.
70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8 న ఫలితాలు వెలువడనున్నాయి. గత మూడు టర్మ్ లు ఆప్ ఢిల్లీలో అధికారం చెలాయిస్తోంది. మొదటిసారి కాంగ్రెస్ సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం నడిపిన కేజ్రీవాల్ తరువాత రెండుసార్లు పూర్తి స్థాయి మెజారిటీతో అధికారం చేపట్టారు.
అయితే కొన్ని నెలల ముందు నుంచి ఆప్ అగ్రనాయకత్వం వరుసగా అవినీతిలో కూరుకుపోయింది. కేజ్రీవాల్ సహ ముఖ్యులంతా అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. ఇదే ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ప్రచారంతో రాజకీయాల్లో వచ్చిన ఆప్ తరువాత లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది.


Read More
Next Story