తాలిబన్ మంత్రి మీడియా సమావేశంలో మహిళలకు ‘నో ఎంట్రీ’పై వివాదం
x
మీడియాతో మాట్లాడుతున్న ఆప్ఘన్ విదేశాంగమంత్రి అమీర్ ముత్తాఖీ

తాలిబన్ మంత్రి మీడియా సమావేశంలో మహిళలకు ‘నో ఎంట్రీ’పై వివాదం

ఆఫ్ఘన్ కార్యాలయం భారత పరిధిలోకి రాదని విదేశాంగ శాఖ వివరణ


తాలిబన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాఖీ ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంపై వివాదం చెలరేగింది. ఆయన సమావేశానికి మహిళా జర్నలిస్టులు అనుమతించకపోవడంపై భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.

ఆఫ్టన్ మంత్రి పర్యటన కోసం న్యూఢిల్లీలో కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులకు ముంబైలోని ఆఫ్ఘన్ కాన్సుల్ జనరల్ ప్రెస్ నోట్ కోసం ఆహ్వానాలు అందించారని విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆప్ఘన్ రాయబార కార్యాలయం భారత ప్రభుత్వ అధికార పరిధికి వెలుపల ఉందని కూడా అది పేర్కొంది.
మహిళా జర్నలిస్టులు లేరు..
ముత్తాఖీ ప్రసంగించిన విలేకరుల సమావేశంలో కొద్దిమంది మాత్రమే హజరయ్యారు. ఇందులో మహిళా జర్నలిస్టులకు అవకాశం ఇవ్వలేదు. విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ తో ముత్తాకి చర్చలు జరిపిన కాసేపటికే న్యూఢిల్లీలో ముత్తాకి ఆప్ఘన్ రాయబార కార్యాలయంలో మాట్లాడారు.
మీడియాను ఆహ్వానించాలనే నిర్ణయం విదేశాంగమంత్రితో పాటు తాలిబన్ అధికారులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ కార్యక్రమానికి మహిళా జర్నలిస్టులను సైతం ఆహ్వానిస్తే బాగుంటుందని భారత్ తాలిబన్ అధికారులకు సూచించింది. కానీ దీనిని వారు పట్టించుకోలేదు.
చాలామంది జర్నలిస్టులు ఈ చర్యను ఖండించారు. సోషల్ మీడియాలో తమదైన శైలిలో వాగ్భాణాలు సంధించారు.
కాంగ్రెస్ విమర్శలు..
తాలిబన్ విదేశాంగమంత్రి నిర్వహించిన సమావేశంలో మహిళా జర్నలిస్టులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై ప్రధాని వైఖరిని స్పష్టం చేయాలని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఈ సంఘటన భారత్ లోని అత్యంత సమర్థులైన మహిళా జర్నలిస్టులకు అవమానంగా ఆమె అభివర్ణించారు.
‘‘ఆఫ్ఘన్ కు చెందిన శ్రీ అమీర్ ఖాన్ ముత్తాకి ప్రసంగించిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను మినహయించడం నాకు దిగ్భ్రాంతి కలిగించింది’’ అని కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ఎక్స్ లో అభిప్రాయపడ్డారు. ‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. తన సహచర మహిళా జర్నలిస్టులను ఆహ్వానించలేదని తెలిసినప్పుడు పురుష జర్నలిస్టులు దీనిని వాకౌట్ చేసి ఉండాలి’’ అని చిదంబరం ట్వీట్ చేశారు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా విద్యకు దూరం చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఆప్ఘాన్ పాలనలో విదేశాంగమంత్రిగా ఉన్న ముత్తాకీ భారత్ లో తొమ్మిది రోజుల పాటు పర్యటించబోతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించడంలో ఈ సమావేశం ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Read More
Next Story