దేశం ఎప్పుడో నిర్ణయించుకుంది, మూడోసారి మోదీనే పీఎం : అమిత్ షా
x

దేశం ఎప్పుడో నిర్ణయించుకుంది, మూడోసారి మోదీనే పీఎం : అమిత్ షా

దేశ ప్రజలు మూడో సారి కూడా ప్రధాని గా మోదీని చేయడానికి సిద్దంగా ఉన్నారని, వారు ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.


రాబోయే ఎన్నికలను మహాభారత యుద్దంతో పోల్చిన ఆయన, దేశంలోని విపక్షాలపై తనదైన శైలిలో వాగ్భాణాలు విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభివృద్ది చెందిన అంశాలకు నేతృత్వం వహిస్తుండగా, ప్రతిపక్ష ‘ఇండి’ కూటమి మాత్రం అవినీతి, కుటుంబ నేపథ్యంతో నిండిపోయాయయని వాటి ఎజెండా ఏమిటో మనకు తెలుసని వ్యాఖ్యానించారు.

ఈ పార్టీలన్నీ వంశపారంపర్యం రాజకీయాలను మాత్రమే ప్రొత్సాహిస్తాయని, బుజ్జగింపు రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆదివారం నాటి బీజేపీ: దేశ్ కీ ఆశా, విపక్ష కీ హతాషా అనే సదస్సులో షా ప్రసంగించారు. " ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి.. 2జీ, 3జీ, 4జీ జనరేషన్ లతో నిండిపోయాయి. ఈ జీలన్నీ పార్టీని రెండవ, మూడవ, నాల్గవ తరం నాయకులను సూచిస్తున్నాయి " అని అమిత్ షా విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ స్థాయిని పెంచారని, అభివృద్దిని పరుగులు పెట్టించడంలో మోదీ తరువాతే మిగిలిన నాయకులనీ, అందుకే మూడో సారి కూడా ప్రధాని మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అవన్నీ రాజవంశాలు

ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అభివృద్ది పేదల గురించి ఆలోచిస్తూ ఉండగా, ‘ఇండి’ కూటమి నేతలు మాత్రం తమ పిల్లలను ప్రధానిగా, ముఖ్యమంత్రిగా చేయాలని కలలు కంటున్నారని పరోక్షంగా సోనియాగాంధీ, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ఎంకే స్టాలిన్ ను ఉద్దేశించి విమర్శించారు.

ఈ కుటుంబాలు ఇతరులను, దేశాన్ని ఎదగనివ్వరని, ఈ యువరాజులందరూ కూడా మోదీకి వ్యతిరేకంగా ఏకమయ్యారని ఘూటుగా విమర్శలు చేశారు. ఒక వైపు కుటుంబ పార్టీలు, మరోవైపు పేద తల్లి కొడుకు ఉన్నారని అన్నారు. దేశంలో 60 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి ప్రక్రియకు దూరంగా ఉన్నారని భావించిన మా ప్రభుత్వం, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేసిందని వివరించారు.

ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ పై నిషేధం, పౌరసత్వ సవరణ చట్టం, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ఇలా ఏం చేసినా కుటుంబ పార్టీలు వ్యతిరేకించాయని విమర్శించారు. ఈ బుజ్జగింపు పార్టీలన్నీ కూడా రామమందిర ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. బీజేపీలో ఇలాంటి కుటుంబ రాజకీయాలు ఉంటే, టీ అమ్మేవాడి కొడుకు దేశ ప్రధాని అయ్యే వాడు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరో 1000 సంవత్సరాలు దేశంలో రామరాజ్యం

బీజేపీ జాతీయ సమావేశంలోనే అయోధ్య రామమందిరంపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇది రాబోయే వెయి సంవత్సరాలకు భారత దేశంలో రామరాజ్య స్థాపనకు సూచనగా పేర్కొంది. " పురాతన పవిత్ర అయోధ్య నగరంలో శ్రీ రాముడి దివ్య ఆలయాన్ని నిర్మించడం దేశానికి చారిత్రాత్మక, అద్భుతమైన విజయం" అని తీర్మానం పేర్కొంది. రామరాజ్యం అనేది నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పే మహాత్మాగాంధీ హృదయంలో కూడా ఉందని తీర్మానంలో ప్రతిపాదించారు.

Read More
Next Story