స్వాతిమాలివాల్ కేసు: తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
x

స్వాతిమాలివాల్ కేసు: తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పై సీఎం కేజ్రీవాల్ పీఏ ఆయన అధికార నివాసంలో దాడి చేసిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తన అరెస్ట్ చట్ట విరుద్దంగా..


ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్, ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడి చేసిన కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారించి, తీర్పును రిజర్వ్ లో ఉంచింది. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పిటిషన్‌పై నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకించారు.

ఇరువైపులా హాజరైన సీనియర్ న్యాయవాదుల వాదనలను విన్న తర్వాత జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మాట్లాడుతూ, "కేసుపై ఆర్డర్ రిజర్వ్ చేయబడింది" అని వెల్లడించారు.
తన అరెస్ట్ చట్ట విరుద్దం అని ప్రకటించాలని, క్రిమినల్ ప్రోసిజర్ కోడ్ సెక్షన్ 41 ఏ ప్రకారం ఇచ్చిన నోటీసులను చట్టవిరుద్దమైన అంశాలుగా ప్రకటించాలని భిభవ్ పిటిషన్ లో కోరారు. సెక్షన్ 41Aకి అనుగుణంగా ఉన్న అభ్యంతరాన్ని ఇప్పటికే ట్రయల్ కోర్టు తిరస్కరించిందని, అందువల్ల పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి బదులుగా ఆ ఆర్డర్‌పై మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసు సీనియర్ న్యాయవాది వాదించారు.
ఈ కేసుకు ప్రత్యామ్నాయ పరిష్కారం ఉందని, పిటిషనర్ దానిని ఉపయోగించాలని ఆయన అన్నారు. అయితే భిభవ్ తరఫున హజరైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అతని అరెస్ట్ ప్రాథమిక హక్కులను ఉల్లఘించడమయే అని, చట్టాలను అతిక్రమించారని వాదించారు. అరెస్ట్ కు ఎటువంటి కారణాలు, అవసరం లేదని, ఒక వ్యక్తి స్వేచ్ఛను తేలికగా తీసుకోరాదని న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.
ట్రయల్ కోర్టులో అతని ముందస్తు బెయిల్ పెండింగ్‌లో ఉన్నప్పుడే పిటిషనర్‌ను అరెస్టు చేశారని, దర్యాప్తుకు సహకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని కూడా న్యాయవాది వాదనలు వినిపించారు. తనను చట్టవిరుద్దంగా అరెస్ట్ చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తనకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అంతకుముందు భిభవ్ కుమార్ సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరణకు గురైంది. మాలివాల్ చేసిన ఆరోపణలు తేలిగ్గా తీసిపారేయడానికి వీలులేవని కోర్టు ఆక్షేపించింది.
మే 13న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కుమార్ తనపై దాడి చేశారని రాజ్యసభ ఎంపీ మలివాల్ ఆరోపించారు. మే 18న కుమార్‌ని అరెస్టు చేసి ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపిన మేజిస్ట్రియల్ కోర్టు, అతని అరెస్టు కారణంగా అతని ముందస్తు బెయిల్ అభ్యర్థన నిష్ఫలంగా మారిందని వెల్లడించింది. మే 16 న భిభవ్ కుమార్ పై పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అందులో క్రిమినల్ లక్ష్యాలతో దాడి చేయడం, బట్టలను తొలగించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
Read More
Next Story