ఢిల్లీ బ్లాస్ట్: పుల్వామాతో లింక్ అయిన పేలుడు
x
పేలుడు జరగడానికి కొద్ది క్షణాల ముందు సీసీటీవీ ఫుటేజీ. పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్న ఐ20 కారు

ఢిల్లీ బ్లాస్ట్: పుల్వామాతో లింక్ అయిన పేలుడు

కొన్ని నెలల క్రితం తారిఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన కారు, అతడి ఆచూకీ కోసం భద్రతా దళాల వేట


దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది ఉగ్రవాద చర్యే అని అనుమానాలు మెల్లగా బలపడుతున్నాయి. బ్లాస్ట్ అయిన కారును పుల్వామాకు చెందిన తారిఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతడి కోసం అధికారులు వెతుకుతున్నారు.

ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మెల్లగా కదులుతున్న కారు ఒక్కసారిగా పేలిపోవడంతో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. అనేక వాహానాలు దగ్ధమయ్యాయి.

ఈ పేలుడులో ఒక మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన అమ్రోహకు చెందిన 34 ఏళ్ల అశోక్ కుమార్, ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల అమర్ కటారియాగా పోలీసులు గుర్తించారు.
మిగిలిన వారి శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. వారి వయస్సు 28 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలుసుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది.
రద్దీగా ఉండే సమయంలో ఈ పేలుడు జరిగింది. అయితే సోమవారం ఢిల్లీలో చాలా ప్రాంతాలలో సెలవుగా పాటిస్తారు. ఇదే పేలుడు వారాంతంలో జరిగి ఉంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా ఉండేది.
పేలుడులో తొమ్మిది మంది చనిపోగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. పేలుడు స్థలాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా సందర్శించారు. సాయంత్రం 6.52 గంటలకు పేలుడు సంభవించిందని తెలిపారు.
పేలుడు సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, ఇది ఆత్మాహుతి దాడా? కాదా? అనే కోణంలో విచారిస్తున్నామని ఆయన చెప్పారు. పేలుడు సంభవించిన కారు ఐ20 హ్యుందాయ్ కారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిలో ఎటువంటి పెల్లెట్ లేదా తీగలు, ఇనుప ముక్కలు కనిపించలేదని కమిషన్ పేర్కొన్నారు. పేలుడు శబ్ధం భారీగా వినిపించడంతో చుట్టుపక్కల ఉన్నవారి చెవులు కాసేపు పనిచేయలేదు. అనేక మీటర్ల దూరంలో ఉన్న కారు, మెట్రో స్టేషన్ అద్దాలు సైతం పేలుడు ధాటిని పగిలిపోయాయి.
కారు యజమాని అరెస్ట్
ఢిల్లీ పోలీసులు కారు యజమాని మహహ్మద్ సల్మాన్ ను సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ కారును ఓఖ్లాలోని దేవేంద్ర అనే వ్యక్తికి సంవత్సరం క్రితం అమ్మివేసినట్లు తెలిపారు.
తరువాత ఈ వ్యక్తి ఇదే వాహానాన్ని అంబాలాలోని మరో వ్యక్తికి అమ్మివేసినట్లు దర్యాప్తులో తేలింది. సదరు వ్యక్తి కశ్మీర్ లోని తారిక్ అని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఫరీదాబాద్ లింక్..
ఢిల్లీ సరిహద్దులోని ఫరీదాబాద్ లో ఒక జమ్మూకశ్మీరి వైద్యుడు అద్దెకు తీసుకున్న గది నుంచి దాదాపు 360 కిలోల అనుమానిత అమ్మోనియం నైట్రెట్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది జరిగిన కొన్ని గంటల తరువాతే ఢిల్లీ కారు పేలుడు సంభవించింది. పేలుడులో అమ్మోనియం నైట్రైట్ ఉపయోగించారా లేదా అనే కోణంలో ఫోరెన్సిక్ లాబోరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సంఘటనా స్థలంలో ఆర్డీఎక్స్ ఆనవాళ్లు కనిపించలేదని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడు స్థలాన్ని, ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో బాధితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు.
ఆస్పత్రి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు, 18 మంది పురుషులు సహ మొత్తం 20 మంది గాయపడ్డారు. వారిలో 12 మంది ఢిల్లీ నివాసులు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
Read More
Next Story